వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
స్టెయిన్‌లెస్ స్టీల్ మరియు అల్యూమినియం పాత్రలకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) ఆమోదం తప్పనిసరి
Posted On:
05 JUL 2024 11:07AM by PIB Hyderabad
వంటగది భద్రత, నాణ్యత మరియు సమర్థతను పెంపొందించడానికి గానూ స్టెయిన్‌లెస్ స్టీల్ మరియు అల్యూమినియం పాత్రలకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) ఆమోదముద్ర తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం(డీపీఐఐటీ) మార్చి 14, 2024న నాణ్యత నియంత్రణ ఉత్తర్వు జారీ చేసింది. దీని ప్రకారం స్టెయిన్‌లెస్ స్టీల్, అల్యూమినియం పాత్రలకు ఐఎస్ఐ ముద్ర తప్పనిసరి. ఇది పాటించకపోవడం శిక్షార్హం. వినియోగదారుల భద్రత మరియు ఉత్పత్తుల నాణ్యత పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని ఈ నిర్ణయం నొక్కి చెప్తున్నది.
ఇటీవల నిత్యావసర వంటగది వస్తువులకు సంబంధించి బీఐఎస్ తగు ప్రమాణాలను రూపొందించింది. వంట పాత్రలు నిర్దేశిత ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండేలా, నాణ్యత, భద్రతా ప్రమాణాలను పాటించేలా ఇవి ఉన్నాయి. వీటిని పరిచయం చేయడం ద్వారా వినియోగదారుల భద్రతను, ఉత్పత్తుల అత్యున్నత పనితీరును ప్రోత్సహిస్తూనే వంట పద్ధతుల్లో సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడాలని బీఐఎస్ లక్ష్యంగా పెట్టుకున్నది.
స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలు: మన్నికైనవి మరియు ఆకర్షణీయమైనవి
మన్నిక, వంటలకు అనుకూలంగా ఉండటం, చూడటానికి ఆకర్షణీయంగా కనిపించడం వంటి కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా వంటగదుల్లో చాలా కాలంగా స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. క్రోమియంతో పాటు నికెల్, మాలిబ్డినమ్ మరియు మాంగనీస్ వంటి లోహాలతో ఉక్కును మిశ్రమంగా చేసి తయారుచేసే స్టెయిన్‌లెస్ స్టీల్.. తుక్కు నిరోధకత, బలమైన యాంత్రిక లక్షణాలకు ప్రసిద్ధి గాంచింది. బీఐఎస్ ఈ లక్షణాలను భారతీయ ప్రమాణాలు ఐఎస్ 14756:2022గా క్రోడీకరించింది. వంట చేయడం, వడ్డించడం, భోంచేయడం మరియు నిల్వ చేయడానికి గానూ వేర్వేరు రకాల పాత్రలకు సంబంధించిన అవసరమైన ప్రమాణాలను ఇవి స్పష్టం చేస్తున్నాయి.
ఐఎస్ 14756:2022 ప్రమాణాలు:
- పదార్థాల అవసరం: తయారీలో సురక్షితమైన మోతాదులో పదార్థాలను వినియోగించేలా చూడటం.
- ఆకారాలు మరియు కొలతలు: పాత్రల రూపకల్పనలో ఏకరూపత మరియు ఆచరణాత్మకతను అందించడం.
- నైపుణ్యం మరియు నగిషీ: అధిక నాణ్యత మరియు ఆకర్షణీయంగా కనిపించేలా చూడటం.
- పనితీరుకు సంబంధించి ప్రమాణాలు: స్టెయినింగ్ పరీక్ష, మెకానికల్ షాక్ టెస్ట్, థర్మల్ షాక్ పరీక్ష, డ్రై హీట్ టెస్ట్, కోటింగ్ మందాన్ని కొలిచే పరీక్ష, సామర్థ్య పరీక్ష, మంటను తట్టుకునే పరీక్షలు చేయడంతో పాటు గాజు మూతలు కలిగిన పాత్రలకు ప్రత్యేకమైన పరీక్షలు జరపడం.
అల్యుమినియం పాత్రలు: తేలికైనవి మరియు సమర్థవంతమైనవి
బరువు తక్కువగా ఉండే స్వభావం, ఉష్ణవాహక గుణం, చౌకగా లభించడం మరియు మన్నికైనవి కావడం వల్ల గృహాలతో పాటు వృత్తిపరమైన వంటశాలల్లో అల్యుమినియం పాత్రలు కూడా ఎక్కువగా వినియోగంలో ఉన్నాయి. వీటికి సంబంధించి బీఐఎస్ ఇండియన్ స్టాండర్డ్ ఐఎస్ 1660:2024ను రూపొందించింది. ఇది ప్లాస్టిక్ పూతతో కూడిన నాన్-స్టిక్ మరియు కఠినమైన ఆక్సైడ్ పూత కలిగిన 30 లీటర్ల సామర్థ్యం వరకు ఉన్న అల్యుమినియం పాత్రలకు సంబంధించిన తయారీ ప్రమాణాలను నిర్దేశిస్తున్నది. సామాగ్రి అత్యధిక నాణ్యత మరియు పనితీరు ఉండేలా ఈ ప్రమాణాలు దోహదపడతాయి.
ఐఎస్ 1660:2024 ప్రమాణాల్లోని ముఖ్య అంశాలు:
- సాధారణ అవసరాలు: తయారీలో ఉపయోగించే పదార్థాలు నాణ్యత, మందంతో ఉండేలా చూడటం.
- పదార్థాల శ్రేణి వర్గీకరణ: ఘనరూపంలో ఉండగా తయారుచేసే పాత్రలకు సంబంధించి ఐఎస్ 21, కరిగించి తయారుచేసే పాత్రలకు సంబంధించి ఐఎస్ 617 ప్రమాణాలకు తగ్గట్టుగా పదార్థాలు వాడేలా చూడటం.
- రూపకల్పన మరియు డిజైన్: ఆకారాలు, కొలతలు రూపొందించడం, అధిక నాణ్యత కలిగిన పాత్రల తయారీకి అవసరమైన నైపుణ్యం ఉండేలా చూడటం.
- పనితీరు పరీక్షలు: మన్నిక మరియు భద్రత ఉండేలా అల్యుమినియం లంచ్ బాక్సులను పరీక్షించడం.
స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రల తరహాలోనే అల్యుమినియం పాత్రలకు కూడా మార్చి 14, 2024 నాటి నాణ్యత నియంత్రణ ఉత్తర్వు ప్రకారం ధ్రువీకరణ తప్పనిసరి. తద్వారా బీఐఎస్ ప్రమాణాలకు తగ్గట్టుగా లేని, బీఐఎస్ ముద్ర లేని అల్యుమినియం పాత్రలు ఎవరూ తయారుచేయకుండా, దిగుమతి చేసుకోకుండా, విక్రయించకుండా, సరఫరా చేయకుండా, నిల్వ చేయకుండా, అద్దెకు ఇవ్వకుండా, లీజుకు ఇవ్వకుండా, అమ్మడానికి ప్రదర్శించకుండా చూడవచ్చు. ఇవి ఉల్లంఘిస్తే చట్టపరంగా జరిమానాలు విధించవచ్చు. ప్రజా ఆరోగ్య భద్రత ప్రాముఖ్యతను తెలియజేయడానికి మరియు వంటగది ఉత్పత్తులపై నమ్మకాన్ని కాపాడేందుకు ఇది ఉపయోగపడుతుంది.
నాణ్యత మరియు వినియోగదారుల విశ్వాసానికి పూచీ
దేశవ్యాప్తంగా గృహాలు మరియు వృత్తిపరమైన వంటగదుల్లో ఉపయోగించే వంటపాత్రలు అత్యధిక భద్రత మరియు నాణ్యతతో ఉండేలా పూచీ కల్పించేందుకు గానూ బీఐఎస్ ఒక కీలకమైన అడుగు వేస్తూ స్టెయిన్‌లెస్ స్టీల్ మరియు అల్యుమినియం పాత్రలకు సంబంధించి ఈ కఠినమైన ప్రమాణాలను రూపొందించింది. కఠినమైన పరీక్షలు జరపడం మరియు ధ్రువీకరించే ప్రక్రియను అమలు చేయడం ద్వారా వినియోగదారులను నాసిరకం ఉత్పత్తుల నుంచి బీఐఎస్ కాపాడుతుంది. వంటపాత్రలు వినియోగించడానికి సురక్షితమైనవని మరియు మన్నికతో ఉండేలా తయారుచేసినవని పూచీని కల్పిస్తుంది.
ఈ ప్రయత్నాలు వినియోగదారుల విశ్వాసాన్ని పెంచడంతో పాటు తయారీదారులు ఉత్పత్తిలో ఉత్తమ పద్ధతులు పాటించడం ద్వారా పరిశ్రమలో పూర్తిస్థాయి మెరుగుదల తీసుకువచ్చేందుకు దోహదపడతాయి. బీఐఎస్ ముద్ర అనేది నాణ్యతను సూచించేందుకు నమ్మకమైన కొలమానంగా ఉపయోగపడటంతో పాటు వినియోగదారులకు వారి ఎంపికలకు సంబంధించిన సమాచారాన్నిఅందించేందుకు మరియు పంట పాత్రల్లో భద్రత మరియు శ్రేష్టతను పెంచుతుంది.
***
(Release ID: 2031083)
Visitor Counter : 70
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam