ప్రధాన మంత్రి కార్యాలయం
ఎస్‌సిఒ శిఖరాగ్ర సమావేశం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Posted On:
04 JUL 2024 1:29PM by PIB Hyderabad
ఈ మాటలను శిఖరాగ్ర సమావేశానికి హాజరైన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జయ్ శంకర్ చదివి వినిపించారు.
శ్రేష్ఠులారా,
షంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సిఒ) కు 2017 లో కజాకిస్తాన్ అధ్యక్ష బాధ్యతల ను నిర్వహించినప్పుడు భారతదేశం ఒక సభ్యత్వ దేశంగా చేరిన సంగతిని భారత్ ప్రశంసాపూర్వకంగా గుర్తు చేసుకొంటోంది. అప్పటి నుండి చూసుకొంటే, మనం ఎస్‌సిఒ లో అధ్యక్ష బాధ్యతల తాలూకు ఒక పూర్తి చక్రాన్ని పూర్తి చేసుకున్నాం. భారతదేశం 2020 లో శాసనాధిపతుల మండలి సమావేశాన్ని, 2023 లో దేశాధినేతల మండలి సమావేశాన్ని నిర్వహించింది. మేం అనుసరిస్తున్న విదేశాంగ విధానం లో ఎస్‌సిఒ కు ఒక ప్రముఖమైన స్థానాన్ని ఇచ్చాం.
సంస్థ లో ఒక సభ్యత్వ దేశంగా పాల్గొంటున్న ఇరాన్ కు మేం అభినందనలను తెలియజేస్తూనే హెలికాప్టర్ దుర్ఘటనలో అధ్యక్షుడు శ్రీ రయీసీ తో పాటు ఇతరులు ప్రాణాలను కోల్పోయినందుకు నా ప్రగాఢమైన సంతాపాన్ని కూడా తెలియజేస్తున్నాను.
నేను అధ్యక్షుడు శ్రీ లుకాషెంకో కు కూడా నేను అభినందనలను తెలియజేస్తున్నాను. ఈ సంస్థ లోకి నూతన సభ్యత్వ దేశంగా వస్తున్న బెలారస్ కు నేను స్వాగతం పలుకుతున్నాను.
శ్రేష్ఠులారా,
మనం ఈ రోజున మహమ్మారి ప్రభావం, ప్రస్తుతం కొనసాగుతున్న సంఘర్షణలు, పెచ్చుపెరుగుతున్న ఉద్రిక్తతలు, విశ్వాస లేమి తో పాటు ప్రపంచవ్యాప్తం గా హాట్ స్పాట్ ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సమావేశం అవుతున్నాం. ఈ పరిణామాలు అంతర్జాతీయ సంబంధాల పైన, ప్రపంచ ఆర్థిక వృద్ధి పైన విశేషమైన ఒత్తిడిని తెచ్చాయి. అవి ప్రపంచీకరణ ప్రభావం నుంచి తలెత్తిన కొన్ని సమస్యలను పెంచేశాయి. ఈ ఘటన క్రమాల తాలూకు సవాళ్లను తగ్గింపజేసేటటువంటి ఒక పరిష్కారాన్ని కనుగొనాలన్నదే మన భేటీ ఉద్దేశ్యం.
ఎస్‌సిఒ సిద్ధాంతాల ఆధారితమైన సంస్థ, ఈ సంస్థలో వ్యక్తమయ్యే ఏకాభిప్రాయం ఇందులోని సభ్యత్వ దేశాల వైఖరికి కీలకంగా ఉంటుంది. ఈ వేళలో మనం మన విదేశాంగ విధానాలకు మూలాధారాలు గా సార్వభౌమత్వ విషయంలో పరస్పర గౌరవం, స్వాతంత్య్రం, ప్రాదేశిక సమగ్రత, సమానత్వం, పరస్పర లాభాలు, ఆంతరంగిక వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం, బలప్రయోగానికి దిగకపోవడం గాని లేదా బలప్రయోగానికి వెనుకాడబోమని బెదిరించడం గాని కాకూడదు అని పునరుద్ఘాటిస్తున్నామనేది చెప్పుకోదగ్గది. దేశాల సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత అనే సూత్రాలకు విరుద్ధంగా ఎలాంటి చర్యలను చేపట్టకూడదు అని కూడా మనం సమ్మతిని తెలిపాం.
ఈ ప్రయాణంలో, ఎస్‌సిఒ సిసలైన లక్ష్యాలలో ఒకటైనటువంటి ఉగ్రవాదంతో పోరాటం జరపాలనే లక్ష్యాన్ని పాటించేందుకు సహజంగానే ప్రాధాన్యాన్ని ఇచ్చి తీరాలి. మనలో చాలా దేశాలు వాటికంటూ కొన్ని అనుభవాలను ఎదుర్కొన్నాయి. ఆ అనుభవాలు తరచు గా మన దేశ సరిహద్దులకు ఆవల నుంచి ఎదురైనవే. వాటిని అరికట్టలేకపోయిన పక్షం లో ఆ అనుభవాలు ప్రాంతీయ శాంతికి, ప్రపంచ శాంతికి ఒక పెద్ద ముప్పులా పరిణమించవచ్చు. ఉగ్రవాదాన్ని అది ఏ రూపంలో ఉన్నా సరే దానిని సమ్మతించడం గాని లేదా క్షమించడం గాని కుదరని పని. ఉగ్రవాదులకు నీడను ఇచ్చే, అభయాన్ని ప్రదానం చేసే దేశాలను, ఉగ్రవాదం హానికరమైంది ఏమీ కాదనే దేశాల అసలు ఉద్దేశ్యాలను బయటపెట్టి, అలాంటి దేశాలను అంతర్జాతీయ సముదాయం ఏకాకిని చేయాలి. సరిహద్దులకు అవతలివైపు నుంచి ఉగ్రవాదం దండెత్తి వస్తూ ఉన్నప్పుడు, దానికి ఒక కచ్చితమైన ప్రతిస్పందన ను వ్యక్తం చేయడం ఎంతైనా అవసరం. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం చేయడాన్ని, ఉగ్రవాదులుగా మారేటట్లుగా ప్రోత్సహించడాన్ని ఎట్టి పరిస్థితుల లో వ్యతిరేకించాల్సిందే. సమూల సంస్కరణవాదం మన యువజనులలో వ్యాప్తి చెందకుండా నిరోధించడం కోసం ముందస్తు చర్యలను కూడా మనం తీసుకోవలసి ఉంది. గత సంవత్సరంలో భారతదేశం అధ్యక్ష బాధ్యతలను నిర్వహించిన కాలంలో ఈ అంశంపై జారీ చేసిన సంయుక్త ప్రకటన మన ఉమ్మడి నిబద్ధతను స్పష్టం చేస్తున్నది.
ప్రస్తుతం మన ముందున్న మరొక చెప్పుకోదగ్గ ఆందోళన ఏమిటి అంటే, అది జలవాయు పరివర్తనయే. ఉద్గారాలను అనుకొన్న ప్రకారంగా తగ్గించేందుకు మనం శ్రమిస్తున్నాం. అదే సమయంలో, ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగానికి మళ్ళడం, విద్యుత్తు వాహనాలను వినియోగించడం, శీతోష్ణస్థితి ఒత్తిడులకు తట్టుకొని నిలచే మౌలిక సదుపాయాలను నిర్మించడం ఈ కృషిలో భాగాలుగా ఉన్నాయి. ఈ విషయంలో ఎస్‌సిఒ కు భారతదేశం అధ్యక్షతను వహించిన కాలంలో కొత్తగా తెర మీదకు వస్తున్న ఇంధనాలను గురించి ఒక సంయుక్త ప్రకటన, మరి అలాగే రవాణా రంగంలో కర్బనం వినియోగానికి క్రమంగా స్వస్తి చెప్పే అంశంపై ఒక కాన్సెప్ట్ పేపర్.. ఈ రెండింటికి ఆమోదాన్ని తెలియజేడమైంది.
శ్రేష్ఠులారా,
ఆర్థిక అభివృద్ధికి పటిష్టమైన సంధానం ఎంతైనా అవసరం. అది మన సమాజాల మధ్య సహకారానికి, విశ్వాసానికి కూడా బాటను పరుస్తుంది. సంధానం, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతల పట్ల గౌరవం అవసరం. ఇలాంటివే వివక్షకు తావు ఉండనటువంటి వ్యాపార హక్కులు, ప్రయాణ సంబంధ నియమాలూను. ఈ అంశాలను గురించి ఎస్‌సిఒ గంభీరమైన చర్చోపచర్చలను చేపట్టాల్సిన అవసరం ఉంది.
ఇరవై ఒకటో శతాబ్దాన్ని సాంకేతిక విజ్ఞాన ప్రధానమైన శతాబ్దమని చెప్పాలి. మనం సాంకేతిక విజ్ఞానాన్ని సృజనాత్మకత కలిగిందిగా తీర్చిదిద్ది, మన సమాజాలలో సంక్షేమానికి, సమాజాల పురోగతికి దానిని వర్తింపచేయాల్సి ఉంది. కృత్రిమ మేధ అనే అంశం పైన ఒక జాతీయ వ్యూహాన్ని రూపొందించి, ఒక ఎఐ మిషన్ ను ప్రారంభించిన దేశాలలో భారతదేశం ఒకటిగా ఉంది. ‘అందరికోసం ఎఐ’ పట్ల మా నిబద్ధత కృత్రిమ మేధ పరమైన సహకారం అనే అంశంలో మార్గసూచీ విషయం లో ఎస్‌సిఒ నిర్దేశించుకొన్న ఫ్రేమ్ వర్క్ పరిధిలో కృషి చేయడంలో కూడాను స్పష్టం అవుతూనే ఉంది.
భారతదేశానికి ఈ ప్రాంతంలోని ప్రజలతో విస్తృతమైన నాగరికత పరమైన సంబంధాలు ఉన్నాయి. ఎస్‌సిఒ లో మధ్య ఆసియా కు ఉన్న ప్రాముఖ్యాన్ని గుర్తిస్తూ, మేం వారి ప్రయోజనాలకు, ఆకాంక్షలకు పెద్దపీటను వేశాం. ఈ వైఖరి వారితో కార్యకలాపాలను నెరపడంలోను, కలసి ప్రాజెక్టులను చేపట్టడంలోను, మరింత ఎక్కువగా ఆదాన ప్రదానాలలోను తెలియ వస్తున్నది.
ఎస్‌సిఒ కు మా సహకారం ప్రజల ప్రయోజనాలే కీలకంగా పురోగమిస్తోంది. భారతదేశం తాను అధ్యక్ష బాధ్యతలను నెరవేర్చిన కాలంలో ఎస్‌సిఒ చిరుధాన్య ఆహార ఉత్సవం, ఎస్‌సిఒ చలన చిత్రోత్సవం, ఎస్‌సిఒ సూరజ్ కుండ్ క్రాఫ్ట్ మేళా, ఎస్‌సిఒ థింక్-టాంక్స్ కాన్ఫరెన్స్ లతో పాటు ఉమ్మడి బౌద్ధ వారసత్వం పై అంతర్జాతీయ సమావేశం వంటి వాటిని నిర్వహించింది. ఇతర దేశాలు సైతం ఇదే రీతిలో చేసే ప్రయత్నాలకు మేం సహజంగానే మద్దతిస్తాం.
కిందటి సంవత్సరం ఎస్‌సిఒ సచివాలయాన్ని ప్రారంభించినప్పటి నుంచి దీని న్యూ ఢిల్లీ హాల్ లో అనేక కార్యక్రమాలను నిర్వహించడం నాకు సంతోషాన్ని కలుగజేసింది. ఈ కార్యక్రమాలలో 2024 లో పదో అంతర్జాతీయ యోగ దినం సంబంధ కార్యక్రమం కూడా ఒకటిగా ఉంది.
శ్రేష్ఠులారా,
మననందరిని ఏకం చేయడానికి, పరస్పరం సహకరించుకోవడానికి, కలసి ఎదగడానికి, సమృద్ధిని సాధించడానికి ఎస్‌సిఒ మనకు ఒక విశిష్టమైన వేదికను అందిస్తోందని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను. ఇది ‘వసుధైవ కుటుంబకమ్’ అనే వేల సంవత్సరాల నాటి పురాతన సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నది. వసుధైవ కుటుంబకమ్ అనే మాటల కు ‘ప్రపంచం ఒక కుటుంబం’ అని భావం. మనం ఈ భావోద్వేగాలను నిరంతరం ఆచరణాత్మకమైన సహకారం గా తీర్చిదిద్దుకోవాల్సివుంది. ఈ రోజున తీసుకొనే ముఖ్యమైన నిర్ణయాలను నేను స్వాగతిస్తున్నాను.
ఎస్‌సిఒ శిఖరాగ్ర సమావేశానికి ఫలప్రదమైన రీతి లో ఆతిథేయిగా వ్యవహరించినందుకు కజాకిస్తాన్ కు నేను అభినందనలను తెలియజేస్తున్నాను. దీనితో పాటు ఎస్‌సిఒ కు తదుపరి అధ్యక్ష బాధ్యతలను చైనా స్వీకరిస్తున్నందుకు శుభాకాంక్షలను కూడా తెలియజేస్తూ, నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.
***
(Release ID: 2030869)
Visitor Counter : 80
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam