గనుల మంత్రిత్వ శాఖ

శాస్త్రి భవన్‌లో ‘డిఎంఎఫ్’ గ్యాలరీకి కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి శ్రీకారం


జిల్లా మినరల్ ఫౌండేషన్/ప్రధానమంత్రి ఖనిజ క్షేత్ర కల్యాణ్ యోజన కింద.. మైనింగ్ కంపెనీల చేయూతతో ఏర్పాటైన ‘ఎస్‌హెచ్‌జి’ల ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తారు

Posted On: 02 JUL 2024 5:34PM by PIB Hyderabad

   కేంద్ర బొగ్గు-గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఇవాళ శాస్త్రి భవన్‌లో ‘డిఎంఎఫ్’ గ్యాలరీని ప్రారంభించారు. ఆ శాఖ సహాయమంత్రి శ్రీ సతీష్ చంద్ర దూబే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జిల్లా మినరల్ ఫౌండేషన్/ప్రధానమంత్రి ఖనిజ క్షేత్ర కల్యాణ్ యోజన కింద, కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా మైనింగ్ కంపెనీల చేయూతతో ఏర్పాటైన ‘ఎస్‌హెచ్‌జి’ల ఉత్పత్తులను ఈ గ్యాలరీలో ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా మంత్రులిద్దరూ ఒడిషాలోని కియోంఝర్, కోరాపుట్ జిల్లాలకు చెందిన ‘ఎస్‌హెచ్‌జి’లు తయారుచేసిన ఉత్పత్తులను పరిశీలించి వారి నైపుణ్యాన్ని అభినందించారు. అనంతరం వారితో కొద్దిసేపు ముచ్చటించారు. దేశవ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని ‘ఎస్‌హెచ్‌జి’లకు ఎంతో చేయూతనిస్తున్న హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, హిందాల్కో సంస్థల కృషిని వారు ప్రశంసించారు.

   కియోంఝర్ ‘డిఎంఎఫ్’ ఆర్థిక మద్దతుతో ‘కృష్ణ స్వయం సహాయ సంఘం’ ఇక్కడ చిరుధాన్య ఆహార ఉత్పత్తులతోపాటు సీడ్స్ అండ్ టాసర్ సిల్క్ ఉత్పత్తులను ప్రదర్శిస్తోంది. అలాగే కొరాపుట్ ‘డిఎంఎఫ్’ చేయూతతో ‘మహిమ స్వయం సహాయ సంఘం’ సభ్యులు లెమన్‌గ్రాస్, జపనీస్ మింట్ ఆయిల్ ఉత్పత్తులను ఈ వారం ప్రదర్శిస్తున్నారు. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్‌సిఎల్‌) సంస్థ ఆర్థిక మద్దతుతో మరో  25 ‘ఎస్‌హెచ్‌జి’లు కూడా తమ ఉత్పత్తులను వరుస క్రమంలో ‘డిఎంఎఫ్’ గ్యాలరీలో ప్రదర్శిస్తాయి.

   సుస్థిర గనుల మార్గదర్శకాలకు అనుగుణంగా హిందాల్కో సంస్థ అనేక స్వయం సహాయ  సంఘాలకు అండగా నిలుస్తోంది. తద్వారా దాదాపు 3,000 మందికిపైగా హస్తకళాకారులు ప్రత్యక్ష లబ్ధి పొందుతున్నారు. ఈ మేరకు కోసల- ఛత్తీస్‌గఢ్ కోసా నేత; కాశీ గడ్డితో నేసే కళ ‘ట్రినా పునరుజ్జీవనానికి కృషి చేస్తోంది. అలాగే జిర్హుల్ – నవ్యరీతిలో జెల్ న్యాప్‌కిన్‌ల‌ తయారీ; వంశల- వెదురు, కాశీగడ్డి నేతకళ; కథౌటియా/వివర్తన- లాంటానా కలుపుతో బయో-మిశ్రణ కళాఖండాల తయారీ వంటి ఉత్పత్తులు రూపొందుతున్నాయి.

 

   దేశంలోని గనుల ప్రభావిత జిల్లాలన్నింటిలో డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (డిఎంఎఫ్) ఏర్పాటుకు వీలుగా నిబంధనను చేరుస్తూ కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ 2015లో ‘మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) చట్టాన్ని సవరించింది. గనుల తవ్వకం, సంబంధిత కార్యకలాపాల ఫలితంగా ప్రభావితమయ్యే వ్యక్తులు, ప్రాంతాలకు ప్రయోజనం సమకూర్చడం ‘డిఎంఎఫ్’ల ఏర్పాటు లక్ష్యం. వీటిద్వారా వివిధ జిల్లాల పరిధిలో స్వయం సహాయ బృందాలను ఏర్పాటు చేసి, రకరకాల స్థానిక ఉత్పత్తుల తయారీ దిశగా సభ్యులను ప్రోత్సహిస్తారు.

***



(Release ID: 2030319) Visitor Counter : 12


Read this release in: English , Urdu , Hindi , Tamil