వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
లీగల్ మెట్రాలజీ(సాధారణ) నియమాలు, 2011 ప్రకారం శ్వాసలో ఆల్కహాల్ గాఢతను లెక్కించి చూపే సాక్ష్యం ఆధారిత బ్రీత్ ఎనలైజర్ నియమాల ముసాయిదాను రూపొందించిన వినియోగదారుల వ్యవహారాల విభాగం
సరిగ్గా పనిచేయని పరికరాల కారణంగా వేసే తప్పు జరిమానాల నుంచి వ్యక్తులను రక్షించడానికి ఎవిడెన్షియల్ బ్రీత్ ఎనలైజర్కు ఏడాదిలోపు నిర్ధారణ, స్టాంపింగ్
Posted On:
28 JUN 2024 1:21PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల విభాగ పరిధిలోని లీగల్ మెట్రాలజీ విభాగం, లీగల్ మెట్రాలజీ (సాధారణ) నియమాలు, 2011 ప్రకారం సాక్ష్యం ఆధారిత బ్రీత్ ఎనలైజర్‌లపై కొత్త ముసాయిదా నియమాలను రూపొందించింది. చట్టం అమలు చేసేవారు, కార్యాలయాల్లో ఉపయోగించే బ్రీత్ ఎనలైజర్ల కచ్చితత్వం, విశ్వసనీయతను నిర్ధారించి తద్వారా ప్రజాభద్రత, నమ్మకం పెంపొందించడమే దీని లక్ష్యం.
ధృవీకృతమైన, ప్రామాణికమైన ఎవిడెన్షియల్ బ్రీత్ ఎనలైజర్‌లు శ్వాస నమూనాల నుండి రక్తంలో ఆల్కహాల్ గాఢతను ఖచ్చితంగా లెక్కించి, మత్తులో ఉన్న వ్యక్తులను వేగంగా, ప్రభావవంతంగా గుర్తిస్తాయి. ఇది రహదారిపై మద్యం సబంధిత ఘటనలను నివారించడంలో సహాయపడి, ప్రతి ఒక్కరూ సురక్షితమైన ప్రయాణం చేసేలా దోహదపడుతుంది.
కొత్త నియమాల ప్రకారం ఎవిడెన్షియల్ బ్రీత్ ఎనలైజర్లు వివిధ పరికరాలలో ప్రామాణిక పరీక్షా విధానాలను అనుసరిస్తూ స్థిరమైన, విశ్వసనీయమైన ఫలితాలను చూపించాల్సి ఉంటుంది. ఇది చట్టపరమైన చర్యల అమలులో న్యాయం, ఖచ్చితత్వంపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తుంది.
ఎవిడెన్షియల్ బ్రీత్ ఎనలైజర్ల ఖచ్చితత్వం నిర్ధారించుకోవడానికి లీగల్ మెట్రాలజీ చట్టం, 2009 ప్రకారం ధృవీకరణ పొంది స్టాంప్ వేయించుకోవాలి. ఈ నిర్ధారణ, సరిగా పనిచేయని పరికరాల కారణంగా వేసే తప్పు జరిమానాల నుంచి వ్యక్తులను రక్షించి, చట్టం, కార్యాలయ విధానాల సమగ్రతను పరిరక్షించడంలో సహాయపడుతుంది.
ఎవిడెన్షియల్ బ్రీత్ ఎనలైజర్‌లు రక్తంలో ఆల్కహాల్ పరిమాణాన్ని లెక్కించడానికి నొప్పి లేకుండా వేగంగా నమూనాలను సేకరిస్తాయి. ఈ వేగవంతమైన విశ్లేషణ సామర్థ్యాలు చట్టాన్ని అమలు చేసే అధికారులకు త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడానికి వీలు కల్పించి, రహదారుల్లో తనిఖీలను ప్రభావవంతం చేస్తాయి.
ధృవీకరణ పొంది స్టాంప్ వేయబడిన ఎవిడెన్షియల్ బ్రీత్ ఎనలైజర్ల లభ్యత ఆల్కహాల్ బలహీనత వల్ల ఎదురయ్యే ప్రభావాలు, వాహనాలు, యంత్రాలను సురక్షితంగా నిర్వహించే అంశంలో చట్టపరమైన పరిమితులపై ప్రజల్లో అవగాహన పెంచుతుంది. ఇది బాధ్యతాయుతమైన ప్రవర్తన, నిర్ణయాలు తీసుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది.
"ఎవిడెన్షియల్ బ్రీత్ ఎనలైజర్స్"ను నిర్దేశిత దోష పరిమితుల్లో మానవ శ్వాస ద్వారా ఆల్కహాల్ గాఢతను లెక్కించి చూపే పరికరంగా ముసాయిదా నియమాలు నిర్వచిస్తున్నాయి. మౌత్ పీస్‌లు ఉపయోగించి నమూనాలు సేకరించే రకాలకు చెందిన ఎవిడెన్షియల్ బ్రీత్ ఎనలైజర్‌లకు ఇది వర్తిస్తుంది. పరికరం ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి వివిధ రకాల పరీక్షలను ఈ నియమాలు అందిస్తాయి. ఈ పరికరం ఉపయోగించేటప్పుడు ఖచ్చితత్వాన్ని వార్షిక ధృవీకరణ నిర్ధారిస్తుంది.
ముసాయిదా నియమాలు ఎవిడెన్షియల్ బ్రీత్ ఎనలైజర్‌ల కోసం వివిధ సాంకేతిక అవసరాలను వివరిస్తాయి. వీటిలో:
· తుది ఫలితాన్ని మాత్రమే చూపించడం.
· సమాచారాన్ని రికార్డు చేయడానికి ప్రింటర్ అనుసంధానించి, కాగితం లేకుండా యంత్రం పనిచేయదని నిర్ధారించడం.
· రక్తంలోని ఆల్కహాల్ గాఢతతో పాటు అదనపు సమాచారాన్ని ముద్రించి అందించడం.
· రక్తంలో ఆల్కహాల్ గాఢత లాంటి పరీక్షల ఫలితాల సమాచారాన్ని వివిధ రూపాల్లో అందించడం
ఎవిడెన్షియల్ బ్రీత్ ఎనలైజర్‌ల కోసం రూపొందించిన కొత్త ముసాయిదా నియమాలు రహదారి భద్రత, అమలులో విశ్వసనీయతను మెరుగుపరిచే ముఖ్యమైన దశను సూచిస్తాయి. ఈ నియమాలు ఎవిడెన్షియల్ బ్రీత్ ఎనలైజర్లు ఖచ్చితమైనవి, ప్రామాణికమైనవి, ఉపయోగించడానికి సులభమైనవి అని నిర్ధారించడం ద్వారా, చట్టాన్ని మెరుగ్గా అమలు చేయడం, భద్రతను పెంచడంతో పాటు న్యాయవ్యవస్థ, కార్యాలయాల్లో జరిపే ఆల్కహాల్ పరీక్షపై విశ్వాసం పెంచి ప్రజాప్రయోజనం చేకూరుస్తాయి. వినియోగదారుల వ్యవహారాల శాఖ కఠినమైన ప్రమాణాలు, విశ్వసనీయమైన లెక్కింపు సాధనాల ద్వారా ప్రజా సంక్షేమాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉంది.
ముసాయిదా నియమాలు 26.07.2024 వరకు ప్రజా వ్యాఖ్యల కోసం వెబ్‌సైట్‌లో కింద పొందుపరిచిన లింక్‌లో ఉన్నాయి:
https://consumeraffairs.nic.in/sites/default/files/file-uploads/latestnews/Draft_Rule_Breath_Analyser.pdf
***
(Release ID: 2029431)
Visitor Counter : 76