ప్రధాన మంత్రి కార్యాలయం

బంగ్లాదేశ్ ప్రధానమంత్రి భారత అధికార పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆంగ్ల ప్రసంగం

Posted On: 22 JUN 2024 2:15PM by PIB Hyderabad

గౌరవ ప్రధానమంత్రి శ్రీమతి షేక్ హసీనా

ఉభయ దేశాల ప్రతినిధులు

మీడియా మిత్రులారా,

నమస్కారం.

ప్రధానమంత్రి శ్రీమతి షేక్ హసీనాకు, ఆమె ప్రతినిధివర్గానికి హృద‌యపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. గత ఏడాది కాలంగా మేం పది సార్లు కలుసుకున్నప్పటికీ నేటి సమావేశం ప్రత్యేకమైనది. మా ప్రభుత్వం మూడో విడత అధికారం చేపడుతున్న సమయంలో మన తొలి అతిథి ఆమె కావడమే ఆ విశేషం.

మిత్రులారా,

మేం అనుసరిస్తున్న ‘‘పొరుగువారు ప్రథమం’’, యాక్ట్ ఈస్ట్ పాలసీ, విజన్ సాగర్, ఇండో-పసిఫిక్ విధానాలన్నింటి సంగమంలోనూ బంగ్లాదేశ్ కీలకంగా ఉంది.

గత ఏడాది కాలంగా మేం ఉమ్మడిగా పలు కీలకమైన ప్రజా సంక్షేమ ప్రాజెక్టులు పూర్తి చేశాం. అఖౌరా-అగర్తల మధ్య 6వ ఇండో-బంగ్లాదేశ్ సీమాంతర రైల్ లింక్ ప్రాజెక్టును ప్రారంభించాం. ఖుల్నా-మోంగ్లా పోర్టు ద్వారా ఈశాన్య రాష్ర్టాలకు కార్గో సదుపాయం ప్రారంభించాం. మోంగ్లా పోర్టును తొలిసారిగా రైల్వే లైన్ తో అనుసంధానం చేశాం. 1320 మెగావాట్ల మైత్రీ థర్మల్ పవర్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాం. ఉభయ దేశాల మధ్య భారత కరెన్సీ రూపాయి వర్తకం ప్రారంభమయింది. భారత, బంగ్లాదేశ్ మధ్య గంగా నదిలో ప్రపంచంలోనే సుదూరంగా  ప్రయాణించే క్రూయిజ్ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తయింది. భారత, బంగ్లాదేశ్ మధ్య తొలి సీమాంతర ఫ్రెండ్ షిప్  పైప్ లైన్ కూడా పూర్తయింది. ఇండియన్ గ్రిడ్ మీదుగా నేపాల్ నుంచి బంగ్లాదేశ్ మధ్య విద్యుత్ ఎగుమతిప ప్రాజెక్టు ఇంధన రంగంలో ఉప ప్రాంతీయ సహకారానికి తొలి ఉదాహరణ. కేవలం ఒక్క సంవత్సరంలో విభిన్న రంగాల్లో చేపట్టిన ఈ భారీ కార్యక్రమాలన్నీ మన సంబంధాల మధ్య వేగం, పరిధికి ప్రతిబింబంగా నిలుస్తాయి.

మిత్రులారా,

నేడు కొత్త రంగాల్లో సహకారానికి భవిష్యత్ విజన్ ను మేం తయారుచేస్తున్నాం. హరిత భాగస్వామ్యం, డిజిటల్ భాగస్వామ్యం, సాగర ఆర్థిక వ్యవస్థ, అంతరిక్షం సహా పలు రంగాల్లో సహకారానికి ఉభయ దేశాల మధ్య కుదిరిన అంగీకారం వల్ల రెండు దేశాల యువత ఎంతో ప్రయోజనం పొందుతారు. భారత బంగ్లాదేశ్ ల ‘‘మైత్రీ ఉపగ్రహం’’ మా భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చుతుంది. కనెక్టివిటీ, కామర్స్, కొలాబొరేషన్ పై మేం ఫోకస్ పెడుతున్నాం.

1965 కన్నా ముందు నుంచి ఉభయ దేశాల మధ్య గల కనెక్టివిటీని గత 10 సంవత్సరాల కాలంలో మేం పునరుద్ధరించాం. నేడు డిజిటల్, ఇంధన భాగస్వామ్యంపై మేం ఫోకస్ పెడుతున్నాం. మన ఆర్థిక సంబంధాలను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు సెపాపై సంప్రదింపులు ప్రారంభించేందుకు కూడా అంగీకారానికి వచ్చాం. బంగ్లాదేశ్  లోని సిరాజ్ గంజ్ లో ఇన్ లాండ్ కంటైనర్ డిపో  నిర్మాణానికి భారత్ మద్దతు ఇస్తుంది.

మిత్రులారా,

భారత, బంగ్లాదేశ్ లను 54 నదులు అనుసంధానం చేస్తున్నాయి. వరదల అదుపు, ముందస్తు హెచ్చరికలు, మంచినీటి ప్రాజెక్టుల విభాగాల్లో మేం సహకరించుకుంటున్నాం. 1996 గంగా జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు సాంకేతిక స్థాయిలో చర్చలు ప్రారంభించాం. బంగ్లాదేశ్ లోని తీస్తా నది సంరక్షణ, నిర్వహణ అంశం చర్చించేందుకు ఒక సాంకేతిక టీమ్ త్వరలో బంగ్లాదేశ్ సందర్శించనుంది.

మిత్రులారా,

రక్షణ ఉత్పత్తుల నుంచి సాయుధ దళాల ఆధునికీకరణ వరకు అన్నింటిలోనూ రక్షణ సహకారం పటిష్ఠం చేసుకోవడంపై మేం సమగ్రంగా చర్చించాం. ఉగ్రవాదం, తీవ్రవాద వ్యతిరేక పోరాటం; సరిహద్దుల్లో శాంతి నిర్వహణ వంటి అంశాలపై సహకారం పటిష్ఠం చేసుకోవాలని నిర్ణయించాం.

హిందూ మహా సముద్రంపై కూడా మేం ఉమ్మడి దృక్పథం కలిగి ఉన్నాం. ఇండో-పసిఫిక్ సాగర సహకార కార్యక్రమంలో చేరాలన్న బంగ్లాదేశ్ నిర్ణయాన్ని మేం  ఆహ్వానిస్తున్నాం. బిమ్ స్టెక్ సహా విభిన్న ప్రాంతీయ, అంతర్జాతీయ వేదికలపై సహకారాన్ని మేం కొనసాగిస్తాం.

మిత్రులారా,

భాగస్వామ్య సంస్కృతి, ఉభయ దేశాల ప్రజల మధ్య చురుకైన భాగస్వామ్యం మా బంధానికి బలమైన పునాది. స్కాలర్ షిప్ లు, శిక్షణ,  సామర్థ్యాల నిర్మాణం లో సహకారాన్ని విస్తరించుకోవాలని మేం నిర్ణయించాం. వైద్యం కోసం బంగ్లాదేశ్ నుంచి వచ్చే వారి కోసం ఇ-మెడికల్ వీసా సదుపాయం ప్రారంభించాలని భారత్ నిర్ణయించింది. బంగ్లాదేశ్ వాయవ్య ప్రాంతంలోని ప్రజల సౌకర్యం కోసం రంగ్ పూర్  లో కొత్తగా అసిస్టెంట్ హై కమిషన్ కార్యాలయం ప్రారంభించాలని మేం నిర్ణయించాం.

నేడు క్రికెట్ వరల్డ్ కప్ లో పాల్గొంటున్న రెండు టీమ్ లకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.

మిత్రులారా,

భారత్ కు బంగ్లాదేశ్ అతి పెద్ద అభివృద్ధి భాగస్వామి. బంగ్లాదేశ తో సంబంధాలకు మేం అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. సుస్థిరమైన, సుసంపన్నమైన, ప్రగతిశీల దేశంగా బంగ్లదేశ్ ను తీర్చిదిద్దాలన్న బంగబంధు విజన్ ను సాకారం చేసేందుకు నేను కట్టుబాటును పునరుద్ఘాటిస్తున్నాను. 2026 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది.  ‘‘సోనార్ బంగ్లా’’గా దేశాన్ని మార్చేందుకు ప్రధానమంత్రి శ్రీమతి షేక్ హసీనాజీ కృషిని నేను ప్రశంసిస్తున్నాను. ఉభయులం కలిసి ‘‘2047 నాటికి వికసిత్ భారత్’’, ‘‘2041 నాటికి స్మార్ట్ బంగ్లాదేశ్’’ విజన్ సాకారం చేయగలమన్న విశ్వాసం నాకుంది.

ధన్యవాదాలు.

గమనిక : ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది అనువాదం.

***



(Release ID: 2028854) Visitor Counter : 17