ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
హాజ్ యాత్రికులకోసం ఆరోగ్య భద్రతా ఏర్పాట్లపై డాక్యుమెంట్ ను విడుదల చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ
సౌదీ అరేబియాలో హాజ్ యాత్ర చేసే యాత్రికులకోసం విడుదలైన డాక్యుమెంట్ ద్వారా వారికి వ్యవస్థీకృత ఆరోగ్య భద్రతా ప్రణాళిక
డాక్యుమెంట్ కారణంగా ఆరోగ్య సేవలకు సంబంధించిన రోడ్ మ్యాప్ , యాత్రికులు ఆ సేవలను ఎలా పొందవచ్చో తెలిపే డాక్యుమెంట్: కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి
రోగులను, ఓపీడీలను, అత్యవసర భద్రతా చికిత్సలను వాస్తవ పరిస్థితుల్లో పర్యవేక్షించడానికి ఎన్ ఐ సి పోర్టల్ ను అభివృద్ధి చేయడం జరిగింది.
హాజ్ యాత్రికుల ఆరోగ్య భద్రతకోసం 356 మంది వైద్యులను, పారామెడికల్ సిబ్బందిని నియమించిన ప్రభుత్వం. 2 లక్షల ఓపీడీలను నిర్వహించారు. ఈ ఏడాది 1, 75,025 మంది యాత్రికులు మక్కా యాత్రను చేపట్టారు.
Posted On:
21 JUN 2024 2:10PM by PIB Hyderabad
హాజ్ యాత్రికలకోసం ఆరోగ్య భద్రతా ఏర్పాట్లు అనే పేరుగల డాక్యుమెంటును కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర విడుదల చేశారు. మైనారిటీ వ్యవహారల మంత్రిత్వశాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జెడ్డాలో నివసిస్తున్న భారత కాన్సులేట్ జనరల్ శ్రీ మొహమ్మద్ సాహిద్ ఆలం ( విర్చువల్ గా పాల్గొన్నారు), ఇంకా ఇతర భాగస్వాములు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
హాజ్ కార్యక్రమమనేది ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది భారీగా జరిగే కార్యక్రమం. యాత్రికులు ఎంతో శ్రమకోర్చి ఈ యాత్రను చేస్తారు. హాజ్ యాత్రికుల వైద్య ఆరోగ్య భద్రతా ఏర్పాట్లనేవి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పరిధిలోని ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ కు చెందిన అత్యవసర వైద్య ఉపశమన విభాగం, అంతర్జాతీయ ఆరోగ్య విభాగాల బాధ్యత.
ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర, హాజ్ యాత్రికులకు అందించాల్సిన ఆరోగ్య సేవల రోడ్ మ్యాప్ ను ఈ డాక్యుమెంట్ రూపొందించిదని అన్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖకు యాత్రికుల ఆరోగ్యభద్రతా బాధ్యతలను అప్పగించి ఇది రెండో ఏడాదేనని ఆయన వివరించారు. ఇంతవరకూ వచ్చిన అనుభవంతో ఆరోగ్యభద్రతా సేవలను మెరుగుపరుస్తున్నామని అన్నారు. ఈ ఏడాది ఇండియానుంచి 1,75, 025 మంది యాత్రికులు హజ్ యాత్ర చేపట్టారని అన్నారు. వారిలో 60 ఏళ్లకు పైబడి వయస్సున్నవారు 40 వేల మందిదాకా వున్నారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు చాలా దుర్భరంగా వుండడంతో ఆరోగ్యపరమైన సవాళ్లు అనేకం తలెత్తాయి. దాంతో అధికారులు 24 గంటలూ యాత్రికులకు అందుబాటులో వుంటూ ఆరోగ్యసేవలందించాల్సి వచ్చింది. ఈ ఏడాది 2 లక్షల ఓపీడీలను నిర్వహించారు. ఆయా వైద్య బృందాలు యాత్రికులను కలుసుకొని వారికి సేవలందించాయి.
ఎన్ ఐ సి సాయంతో ఒక లైవ్ పోర్టల్ ను అభివృద్ధి చేయడం జరిగిందని శ్రీ అపూర్వ చంద్ర తెలిపారు. దాని ద్వారా యాత్రికుల వాస్తవ పరిస్థితుల సమాచారం, విశ్లేషణ తెలిసిందని తద్వారా వారికి ఆరోగ్యభద్రత, సేవలను అందించడం జరుగుతోందని అన్నారు. మేం నిరంతరం పర్యవేక్షిస్తూ ఆయా సేవలను గణనీయంగా మెరుగుపరుస్తున్నామని అన్నారు. ఇతర దేశాలకు ఆదర్శంగా నిలిచేలా తమ సేవలున్నాయని ఆయన వివరించారు.
మన దేశ పౌరులు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వారికి సహాయం చేయడమనేది దేశానికి గర్వకారణంగా నిలిచే అంశమని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. ఉక్రెయిన్ నుంచి విద్యార్థులను తరలించడంకావచ్చు, కువైట్ అగ్నిప్రమాద బాధితులకు అండగా నిలవడంలోకావచ్చు ఇలా ప్రతి సందర్భంలోనూ తన పౌరులకు సహాయం అందించడంలో భారతదేశం అందరికంటే ముందు వుందని ఆయన అన్నారు. తన దేశ పౌరులకే కాదు ఇతర దేశాల పౌరులకు కూడా వారు అడగ్గానే ఆయా సంక్షోభాల్లో అండగా నిలిచామని ఆయన అన్నారు.
సౌదీ అరేబియా వాతావరణ పరిస్థితులు కఠినంగా వుంటాయని అలాంటి పరిస్థితుల్లో సమగ్రమైన ఆరోగ్యభద్రతా ప్రణాళిక ప్రాధాన్యత చాలా వుంటుందని కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి ఎల్ ఎస్ చాంగ్సన్ అన్నారు. యాత్రికులను వెంటనే చేరుకోవడానికి వీలుగా వ్యూహాత్మక ప్రదేశాలలో వైద్య బృందాలను వుంచడాన్ని ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేంద్ర ఆరోగ్యశాఖకు, ఎన్ ఐసికి మధ్యన సమన్వయంతో పోర్టల్ రూపొందించి వాస్తవ పరిస్థితుల సమాచారాన్ని తెలుసుకొని ఆరోగ్యసేవలందించామని అన్నారు. సౌదీ అరేబియాలో అవిశ్రాంతంగా సేవలందిస్తున్న వైద్య బృందాల సేవలను, ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారందరి అంకితభావాన్ని ఆమె ప్రశంసించారు.
భారతీయ యాత్రికులకోసం ఏర్పాటు చేసిన ఆరోగ్యభద్రతా ఏర్పాట్లను వ్యవస్థీకృతం చేసేందుకుగాను డాక్యుమెంట్ ను ప్రచురించడమనేది చాలా కీలకమైన పని అని జెడ్డాలోని భారతీయ కాన్సులర్ జనరల్ శ్రీ షాహిద్ ఆలం అన్నారు. హాజ్ కార్యక్రమంకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లను ఆయన వివరించారు. భారతీయ వైద్య సిబ్బంది కృషిని ఆయన ప్రశంసించారు. భారతదేశం అందించే ఆరోగ్యసేవలు అత్యున్నతమైనవని సౌదీ అరేబియా ప్రభుత్వం భావిస్తోందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య సేవల అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ జితేంద్ర ప్రసాద్, పౌర విమానయాన జాయింట్ సెక్రటరీ శ్రీ శోభిత్ గుప్తా, ఇఎంఆర్ అడిషనల్ డిజి అండ్ డైరెక్టర్ డాక్టర్ ఎల్ స్వస్తి చరణ్,
మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ డిప్యూటీ కార్యదర్శి శ్రీ అంకుర్ యాదవ్, కేంద్ర ఆరోగ్యశాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
***
(Release ID: 2028145)
Visitor Counter : 56