ప్రధాన మంత్రి కార్యాలయం
బిహార్, రాజ్‌గిర్ లో నిర్మించిన నలందా విశ్వవిద్యాలయ క్యాంపస్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
భారతదేశ విద్యారంగ వారసత్వానికి, ఉతృష్టమైన సాంస్కృతిక మార్పిడికి ప్రతీకగా నిలిచిన నలందా.
నలందా అనేది కేవలం పేరు మాత్రమే కాదు. నలందా అంటే ఒక అస్థిత్వం, ఒక గౌరవం, ఒక విలువ, ఒక మంత్రం, ఒక గర్వకారణం, ఒక గొప్ప ప్రయాణం : ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
నలందా విశ్వవిద్యాలయ పునరుద్ధరణతో మొదలవుతున్న భారతదేశ స్వర్ణయుగం : ప్రధాన మంత్రి
నలందా అనేది కేవలం భారతదేశ గతాన్ని పునరుజ్జీవింపచేయడం మాత్రమే కాదు. ప్రపంచంలోని పలు
దేశాల వారసత్వంతో నలందాకు అనుబంధం వుంది : ప్రధాన మంత్రి
శతాబ్దాలుగా భారతదేశం సుస్థిరత్వాన్ని చాటుతూ అందరికీ ఒక ఉదాహరణగా నిలిచింది. ప్రగతి, పర్యావరణం రెండింటినీ సమానంగా భావిస్తూ ముందడుగు వేసిన భారతదేశం: ప్రధాన మంత్రి
భారతదేశాన్ని ప్రపంచానికే విద్యాకేంద్రంగా, విజ్ఙాన కేంద్రంగా తయారు చేయడమే నా లక్ష్యం. ప్రపంచంలోనే భారతదేశానికి మరొకసారి పేరొందిన విజ్ఞాన కేంద్రంగా గుర్తింపు తీసుకురావడమే నా లక్ష్యం : ప్రధాన మంత్రి
ప్రపంచంలోనే భారతదేశాన్ని అత్యంత సమగ్రమైన, సంపూర్ణమైన నైపుణ్య వ్యవస్థ కలిగిన దేశంగా తీర్చిదిద్దడమే మన ప్రయత్నం కావాలి.
ప్రపంచంలోనే భారతదేశం అత్యంత ఉత్కృష్టమైన పరిశోధనాపూర్వక ఉన్నత విద్యా వ్యవస్థ కలిగిన దేశంగా పేరు సంపాదించుకోవాలనేది మన లక్ష్యం.
ప్రపంచానికి ఉపయోగపడే ప్రధానమైన విద్యాకేంద్రంగా నలందా ప్రగతి సాధిస్తుందనే నమ్మకం నాకు వుంది : ప్రధాన మంత్రి
Posted On:
19 JUN 2024 12:51PM by PIB Hyderabad
బిహార్, రాజ్‌గిర్ లో నిర్మించిన నలందా విశ్వవిద్యాలయ క్యాంపస్ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చేతులమీదుగా ప్రారంభమైంది. భారతదేశం, తూర్పు ఆసియా శిఖరాగ్ర దేశాలు కలిసి ఈ విశ్వవిద్యాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ ప్రారంభోత్పవ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 17 దేశాల మిషన్స్ అధ్యక్షుడు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని ఒక మొక్కను నాటారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ దేశ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన పది రోజులకే నలందాను సందర్శించే అదృష్టం లభించిందని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణం సరిగా సాగుతున్నదనడానికి ఇదొక నిదర్శనమని ఆయన అన్నారు.
నలందా అనేది ఒక పేరుమాత్రమే కాదు, ఇది ఒక అస్థిత్వం, ఒక అభినందన,. నలందా అనేది ఒక పునాది, ఇది ఒక మంత్రం. పుస్తకాలు కాలిపోయినంతమాత్రాన వాస్తవాలు, విజ్ఞానం అనేవి నాశనం కావు అని చాటడానికి నలందా ఉదాహరణగా నిలుస్తోందని ప్రధాని స్పష్టం చేశారు. నూతన నలందా విశ్వవిద్యాలయాన్ని నిర్మించడమనేది భారతదేశ స్వర్ణయుగానికి నాంది అని ప్రధాని అన్నారు.
నలందా విశ్వవిద్యాలయాన్ని దాని పురాతన శిథిలాల దగ్గరే పునరుద్దరించడమనేది ప్రపంచానికి భారతదేశ సామర్థ్యం అంటే ఏంటో పరిచయం చేస్తోందని ప్రధాని అన్నారు. బలమైన మానవీయ విలువల్ని కలిగిన దేశాలు చరిత్రను పునరుజ్జీవంప చేయడంద్వారా మెరుగైన ప్రపంచాన్ని తయారు చేయగలవనే విషయాన్ని భారతదేశం చాటిందని ఆయన అన్నారు.
నలందా అనేది ప్రపంచ వారసత్వాన్ని తనతోపాటు తీసుకొచ్చిందని ప్రధాని స్పష్టం చేశారు. ఇందులో ఆసియాతోపాటు అనేక దేశాలున్నాయని అన్నారు. దీని పునరుద్ధరణ అనేది భారతదేశ అంశాలకు సంబంధించినది మాత్రమే కాదు అని ఆయన వివరించారు. ఈ రోజుప్రారంభోత్సవ కార్యక్రమంలో పలు దేశాలు పాల్గొనడమే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు. నలందా ప్రాజెక్టులో భాగమైన భారతదేశ స్నేహ దేశాల కృషిని ప్రస్తావించారు. బిహార్ ప్రజలు తమ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి చేసిన కృషిని ప్రధాని ప్రశంసించారు. వారి కృషి నలందా రూపంలో ప్రతిఫలిస్తోందని అన్నారు.
భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు ఒకప్పుడు సజీవ కేంద్రంగా నలందా వుందనే విషయాన్ని ప్రత్యేకంగా పేర్కొన్న ప్రధాని నలందా అంటే విద్యతో, విజ్ఞానంతో నిరంతరం వెలుగొందిన ప్రాంతమని అన్నారు. ఇది విద్యపట్ల భారతదేశానికి వున్న దృక్పథమని ఆయన స్పష్టం చేశారు. విద్య అనేది హద్దులు లేనిది. ఇది విలువల్ని పెంపొందింప చేసి ఆలోచనలకు రూపమిచ్చేదని అన్నారు. ప్రజల అస్థిత్వాలు, జాతీయతలతో పని లేకుండా నలందా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు చేరేవారని ప్రధాని ప్రత్యేకంగా పేర్కొన్నారు. అవే పురాతన సంప్రదాయాలను నేటి నూతన నలందా యూనివర్సిటీలో కూడా బలోపేతం చేయాల్సిన ఆవశ్యకతత వుందని ప్రధాని ప్రత్యేకంగా దిశానిర్దేశం చేశారు. నలందా విశ్వవిద్యాలయంలో ఇప్పటికే 20 దేశాలకు చెందిన విద్యార్థులు చేరి చదువుకుంటున్నారని ప్రధాని సంతోషంగా అన్నారు. వసధైక కుటుంబకం అనే భావనకు ఇది సరైన ఉదాహరణ అని ఆయన అన్నారు.
విద్యను మానవ సంక్షేమంగా భావించిన భారతీయ సంప్రదాయాన్ని ప్రధాని తన ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి ఆయన తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ యోగా దినోత్సవం అనేది అంతర్జాతీయ ఉత్సవంగా మారిందని అన్నారు. యోగాలో అనేక విభాగాలున్నప్పటికీ భారతదేశంలో ఎవరూ యోగాపైన తమ గుత్తాధిపత్యాన్ని వ్యక్తం చేయలేదని అన్నారు. అదే విధంగా ప్రపంచానికి భారతదేశం ఆయుర్వేదాన్ని అందించిందని అన్నారు. శతాబ్దాలుగా భారతదేశం సుస్థిరత్వాన్ని చాటుతూ అందరికీ ఒక ఉదాహరణగా నిలిచిందని.. ప్రగతి, పర్యావరణం రెండింటినీ సమానంగా భావిస్తూ భారతదేశం ప్రగతి సాధించిందని ఆయన అన్నారు. దీని కారణంగానే భారతదేశం ప్రపంచానికి మిషన్ లైఫ్, అంత్జాతీయ సౌర వేదికలను అందించిదని అన్నారు. నలందా విశ్వవిద్యాలయంలో అమలవుతున్న నెట్ జీరో ఎనర్జీ, నెట్ జీరో ఎమిషన్, నెట్ జీరో వాటర్, నెట్ జీరో వేస్ట్ మోడల్ అనేది సుస్థిర అభివృద్ధి స్ఫూర్తిని చాటుతుందని అన్నారు.
విద్యారంగ అభివృద్ధి అనేది ఆర్థికరంగంలోను, సాంస్కృతిక రంగంలోనూ గల మూలాలను బలోపేతం చేస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ప్రపంచవ్యాప్త అనుభవాలతోపాటు, అభివృద్ధి చెందిన దేశాల అనుభవం చెబుతోందని ఆయన అన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడానికిగాను కృషి చేస్తున్న భారతదేశం తన విద్యా వ్యవస్థలో మార్పులు చేసుకుంటోందని ఆయన వివరించారు. భారతదేశాన్ని ప్రపంచానికే విద్యాకేంద్రంగా, విజ్ఙాన కేంద్రంగా తయారు చేయడం, భారతదేశానికి మరొకసారి పేరొందిన విజ్ఞాన కేంద్రంగా గుర్తింపు తీసుకురావడం నా లక్ష్యమని ఆయన ఘనంగా చాటారు. ఈ పదేళ్లలో తన ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన కొన్ని విద్యారంగ కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌ద్వారా 1 కోటి మందికి పైగా చిన్నారులకు విజ్ఞానం లభిస్తోందని అన్నారు. చంద్రయాన్, గగన్ యాన్ ప్రాజెక్టులకారణంగా విజ్ఞానశాస్త్రంపట్ల అభిరుచి పెరిగిందని అన్నారు. స్టార్టప్ ఇండియా కారణంగా నేడు దేశంలో 1.30 లక్షల స్టార్టప్‌లు పని చేస్తున్నాయని పదేళ్ల క్రితం దేశంలో కొన్ని మాత్రమే వుండేవని అన్నారు. తన ప్రభుత్వ హయాంలో పేటెంట్లకోసం రికార్డ్ స్థాయిలో దరఖాస్తులు చేసుకున్నారని, పరిశోధన పత్రాలు పెరిగాయని, రూ. 1 లక్ష కోట్లకుపైగా పరిశోధనకు కేటాయించడం జరిగిందని అన్నారు.
ప్రపంచంలోనే భారతదేశాన్ని అత్యంత సమగ్రమైన, సంపూర్ణమైన నైపుణ్య వ్యవస్థ కలిగిన దేశంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రపంచంలోనే భారతదేశం అత్యంత ఉత్కృష్టమైన పరిశోధనాపూర్వక ఉన్నత విద్యా వ్యవస్థ కలిగిన దేశంగా పేరు సంపాదించుకునేలా పని చేస్తున్నామని అన్నారు. ప్రపంచస్థాయి ర్యాంకులలో భారతదేశ విశ్వవిద్యాలయాల సామర్త్యం పెరిగిందని ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. గత పదేళ్లలో విద్యారంగంలోను, నైపుణ్యాభివృద్ధి రంగంలోను సాధించిన విజయాలను అందరి దృష్టికి తీసుకొచ్చారు. క్యూఎస్ ర్యాంకులను సాధించిన విద్యాలయాల సంఖ్య 9నుంచి 46కు పెరిగిందని, టైమ్స్ ఉన్నత విద్యా ప్రభావ ర్యాంకులను సాధించిన విద్యారంగ సంస్థల సంఖ్య 13నుంచి వందకు పెరిగిందని ప్రధాని గుర్తు చేశారు. గత పది సంవత్సరాలలో దేశంలో ప్రతివారం ఒక విశ్వవిద్యాలయం చొప్పున ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి రోజూ ఒక ఐటిఐ చొప్పన ఏర్పాటు చేశామని అన్నారు. అలాగే ప్రతి మూడు రోజులకొకసారి దేశంలో ఒక అటల్ టింకరింగ్ ప్రయోగశాలను ప్రారంభించడం జరిగిందని అన్నారు. ప్రతి రోజూ రెండు నూతన కళాశాలల్ని ఏర్పాటు చేశామని గర్వంగా వివరించారు. ప్రస్తుతం దేశంలో 23 ఐటిఐలున్నాయని, ఐఐఎంల సంఖ్య 13నుంచి 21కి చేరుకుందని ఏఐఐఎంఎస్ ల సంఖ్య మూడురెట్లు పెరిగి 22కు చేరుకుందని అన్నారు. గత పదేళ్లలో దేశంలో మెడికల్ కాలేజీల సంఖ్య రెట్టింపయిందని అన్నారు. దేశంలో చేపట్టిన విద్యారంగ సంస్కరణల గురించి మాట్లాడుతూ తన ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం భారతదేశ యువత కలలకు సరికొత్త రూపాన్ని ఇచ్చిందని అన్నారు. విదేశీ విశ్వవిద్యాలయాలతో కలిసి భారతీయ యూనివర్సిటీలు పని చేస్తున్నాయని దేశంలో అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలైన డీకిన్, వొల్లాంగాంగ్ తమ క్యాంపస్సులను ప్రారంభించాయని గుర్తు చేశారు. ప్రభుత్వం చేపట్టిన కృషి కారణంగా భారతీయ విద్యార్థులు ఉత్తమమైన విద్యా సంస్థల్లో చదువుతూ ఉన్నతవిద్యావంతులవుతున్నారని ఆయన స్పష్టం చేశారు. దీని కారణంగా మన మధ్యతరగతివారికి డబ్బు ఆదా అవుతోందిని ఆయన అన్నారు.
దేశంలోని ప్రధానైన భారతీయ విద్యాసంస్థలు అంతర్జాతీయంగా తమ క్యాంపస్సులను ప్రారంభించడాన్ని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు. అదే విధంగా నలందా కూడా చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
భారతదేశ యువతపైన ప్రపంచ దేశాలు కన్నేశాయని ప్రధాని ప్రత్యేకంగా తన ప్రసంగంలో పేర్కొన్నారు. భగవాన్ గౌతమబుద్ధుడు జన్మించిన పుణ్యస్థలం భారతదేశమని, ప్రజాస్వామ్యానికి మాతృమూర్తిగా భాసిల్లుతున్న భారతదేశంతో కలిసి నడవడానికి ప్రపంచ సిద్ధంగా వుందని ప్రధాని అన్నారు. ఒక ధరణి, ఒక కుటుంబం, ఒకే భవిష్యత్తు అని భారతదేశం చెప్పినప్పుడు ప్రపంచం అంగీకరించిందని ఆయన అన్నారు. ఒక సూర్యుడు, ఒక ధరణి, ఒకే గ్రిడ్ అని భారతదేశం పేర్కొన్నప్పుడు అది ప్రపంచ భవిష్యత్తు నినాదంగా అవతరించింది. ఒక ధరణి, ఒకే ఆరోగ్యం అని మనం చెప్పినప్పుడు ప్రపంచం మన అభిప్రాయాలను గౌరవించిందని అన్నారు. నలందా విశ్వవిద్యాలయం విశ్వ సౌభ్రాతృత్వ భావనకు నూతన కోణాన్ని జోడిస్తుందని ఆయన అన్నారు. కాబట్టి నలందా విద్యార్థుల మీద వున్న బాధ్యత చాలా గొప్పదని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు.
నలందా విద్యార్థులను, పరిశోధనా విద్యార్థులను భారతదేశ భవిష్యత్తుగా ప్రశంసించిన ప్రధాని రాబోయే పాతిక సంవత్సరాల అమృత కాల ప్రాధాన్యతను వివరించారు. నలందా విద్యర్థులు నలందా మార్గాన్ని నలందా విలువల్ని తమతోపాటు ముందుకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. నలందా విద్యార్థులు జ్ఞానతృష్ణతో వుండాలని, ధైర్యంగా వుండాలని దిశానిర్దేశం చేశారు. అంతే కాదు అన్నిటికీ మించి తమ యూనివర్సిటీ లోగో ప్రకారం దయతో వుండాలని, సమాజంలో సానుకూల మార్పులకోసం పని చేయాలని కోరారు.
నలందా ఆవిష్కరించిన విజ్ఞానమనేది ప్రపంచమానవాళికి దిశను చూపుతుందని, మన యువత రాబోయే సంవత్సరాల్లో ప్రపంచానికి నాయకత్వం వహిస్తారని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశౄరు. ప్రపంచ ఆకాంక్షల సాధనలో నలందా అనేది కీలకమైన కేంద్రంగా మారుతుందని తాను విశ్వసిస్తున్నట్టు ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బిహార్ గవర్నర్ శ్రీ రాజేంద్ర అర్లేకర్, బిహార్ ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్, విదేశీ వ్యవహారాల కేంద్ర మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్, కేంద్ర సహాయ మంత్రి శ్రీమతి పవిత్ర మార్గరిటె, బిహార్ ఉప ముఖ్యమంత్రులు శ్రీ విజయ కుమార్ సిన్హా, శ్రీ సామ్రాట్ చైదరి , నలందా విశ్వవిద్యాలయ ఛాన్సలర్ ప్రొఫెసర్ అరవింద్ పనగారియా, నలందా విశ్వవిద్యాలయ వీసీ ప్రొఫెసర్ అభయ్‌కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
నేపథ్యం
నలందా విశ్వవిద్యాలయ క్యాంపస్ లో రెండు అకామిక్ బ్లాక్స్ వున్నాయి. 1900 మంది విద్యార్థులు కూర్చోవడానికి వీలుగా 40 తరగతి గదులను నిర్మించారు. ఒక్కోదాంట్లో 300 వందల మంది కూర్చునేలా రెండు ఆడిటోరియాలను నిర్మించారు. 550మంది విద్యార్థులకోసం హాస్టల్ వసతి వుంది. అంతర్జాతీయ కేంద్రం, రెండు వేల మంది సామర్థ్యంగల ఆంపిథియేటర్, ఫాకల్టీ క్లబ్, క్రీడా సముదాయం మొదలైన వసతులు ఈ యూనివర్సిటీలో వున్నాయి.
ఈ క్యాంపస్ పర్యావరణ హితంగా రూపొందింది. సౌర విద్యుత్ తయారీ ప్లాంట్, తాగునీటి శుద్ధి ప్లాంట్, వ్యర్థాలను శుద్ధి చేసే కర్మాగారం, వంద ఎకరాల్లో నీటి వనరులు, ఇంకా అనేక పర్యావరణ హితమైన సౌకర్యాలు ఈ విశ్వవిద్యాలయంలో వున్నాయి.
చరిత్రతో బలమైన అనుబంధం కలిగిన విశ్వవిద్యాలయమిది. పూర్వం అంటే 16 వందల సంవత్సరాల క్రితం పని చేసిన నలందా విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే మొదటి రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయంగా పేరొందింది. నలందా శిథిలాలను ప్రపంచ వారసత్వంగా 2016లో ఐక్యరాజ్యసమతి ప్రకటించింది.
***
DS/TS
(Release ID: 2026866)
Visitor Counter : 84
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam