వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
పీఎం గతిశక్తి ఆధ్వర్యంలో నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ 72వ సమావేశంలో మూడు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల మదింపు
రోడ్డు, రైలు, పట్టణ రవాణా ప్రాజెక్టులను అంచనా వేసిన ఎన్పీజీ
Posted On:
15 JUN 2024 10:19AM by PIB Hyderabad
నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ (ఎన్ పీజీ) 72వ సమావేశం 12 జూన్ 2024 న న్యూఢిల్లీ వేదికగా జరిగింది. డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) అదనపు కార్యదర్శి శ్రీ రాజీవ్ సింగ్ ఠాకూర్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖల నుంచి ఒక్కొక్కటి చొప్పున మూడు ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల మదింపుపై సమావేశం దృష్టి సారించింది. పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ (ఎన్ఎంపీ) సూత్రాలకు అనుగుణంగా ప్రాజెక్టులు ఉన్నట్లు అంచనా వేయడం జరిగింది. ప్రాజెక్ట్ మదింపులు, వాటి అంచనా ప్రభావాలు ఈ క్రింది విధంగా ఉండనున్నాయి :
1. జమ్మూ& కశ్మీర్‌లో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జాతీయ రహదారి ప్రాజెక్టు
ఈ ప్రాజెక్టులో రఫియాబాద్ నుండి చామ్‌కోట్ వరకు ఎన్‌హెచ్ -701 పై 51 కిలోమీటర్ల విభాగాన్ని నిర్మించడం, అభివృద్ధి చేయడం జరుగుతుంది. గ్రీన్‌ఫీల్డ్ (14.34 కి.మీ), బ్రౌన్ ఫీల్డ్ (36.66 కి.మీ) రెండింటి అభివృద్ధితో ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,405 కోట్లు. ఆధునికీకరణ చేసే మార్గాల్లోని కుప్వారా, చౌకీబాల్ తంగ్ధర్ వంటి గ్రామాలకు అనుసంధానం గణనీయంగా పెరగనుంది. రక్షణ దళాలకు రవాణా సదూపాయాలను మెరుగుపరుస్తుంది. ఆరోగ్యం, విద్య, వ్యాపార అవకాశాలకు మెరుగైన అందుబాటు సౌకర్యాలు అందించడం ద్వారా సామాజిక-ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి.
2. రైల్వే మంత్రిత్వ శాఖలో ఆంధ్రప్రదేశ్‌లోని గూడూరు-రేణిగుంట మూడో రైలు మార్గం
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలోని గూడూరు-రేణిగుంట స్టేషన్ల మధ్య ఇప్పటివరకు ఉన్న డబుల్ లైన్ మార్గంలో మూడవ రైలు మార్గం నిర్మించనున్నారు. 83.17 కి.మీ మేర చేపట్టనున్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 884 కోట్లు. ప్యాసింజర్, కార్గో రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరిచే ఈ ప్రాజెక్టుకు 36.58 హెక్టార్ల భూమి అవసరం అవుతుంది. మౌలిక సదుపాయాల నవీకరణలలో కొత్త వంతెనలు, విస్తరించిన అండర్‌పాస్ లు, అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థలు ఉండనున్నాయి. ఇవి ప్రాంతీయ ఆర్థిక కార్యకలాపాలను గణనీయంగా పెంచుతాయి.
3. గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మహారాష్ట్రలో పుణె మెట్రో లైన్ పొడిగింపు
వనాజ్ నుంచి పుణెలోని రామ్వాడి వరకు ఆపరేషనల్ మెట్రో కారిడార్‌ను విస్తరించాలని గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. వనాజ్-రామ్వాడి మెట్రో కారిడార్ తూర్పు, పడమర చివరల్లో రెండు లైన్ల విస్తరణ ఈ ప్రాజెక్టులో ఉంది. పడమర వైపు వనాజ్ నుంచి చాందినీ చౌక్ వరకు 1.12 కిలోమీటర్ల ఎలివేటెడ్ సెక్షన్ ఉంది. అదేవిధంగా తూర్పున రామ్వాడి నుంచి వాఘోలి/విఠల్వాడి వరకు 11.63 కిలోమీటర్ల ఎలివేటెడ్ సెక్షన్ ఉంది. ఈ ఎలివేటెడ్ మెట్రో కారిడార్ మొత్తం పొడవు 12.75 కిలోమీటర్లు, దీనిని రూ.3,757 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు.
2027 నాటికి రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 3.59 లక్షలకు చేరుకుంటుందని, 2057 నాటికి ఇది 9.93 లక్షలకు పెరుగుతుందని అంచనా. ఈ పొడిగింపు వేగంగా అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాలతో సెంట్రల్ పూణే నగరాన్ని కలుపుతుంది. ప్రయాణ సమయం, రహదారి రద్దీని గణనీయంగా తగ్గిస్తుంది. నగరం ప్రజా రవాణా మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచుతుంది.
పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ (ఎన్ఎంపీ) సూత్రాలకు అనుగుణంగా సమీకృత ప్రణాళిక కోసం అన్ని ప్రాజెక్టులను ఈ సమావేశంలో మదింపు చేపట్టారు. సామాజిక- ఆర్థిక ప్రయోజనాలు, మెరుగైన అనుసంధానత, రవాణా ఖర్చులు తగ్గించడం, సామర్థ్యాన్ని మెరుగుపర్చడం వంటి అంశాలపై దృష్టి సారించారు. ఈ ప్రాజెక్టులు మల్టీమోడల్ ఏకీకరణను ప్రోత్సహించడం, మొత్తం రవాణా, లాజిస్టిక్స్ నెట్‌వరక్ పెంచడాన్ని కూడా లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఈ ప్రాజెక్టులు జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తాయని, వివిధ రవాణా విధానాలను ఏకీకృతం చేస్తాయని, గణనీయమైన సామాజిక-ఆర్థిక ప్రయోజనాలును, జీవన సౌలభ్యాన్ని అందిస్తాయని, తద్వారా ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి దోహదం చేస్తాయని భావిస్తున్నారు.
***
(Release ID: 2025835)
Visitor Counter : 84