పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు బాధ్యతల స్వీకారం
‘విమానయాన సౌలభ్య వాతావరణ’ కల్పనే నా ప్రాథమ్యం: శ్రీ నాయుడు;
ప్రతి పౌరుడికీ గగనయాన సౌకర్యం.. లభ్యతకు కృషి చేయడమే ధ్యేయం
Posted On:
13 JUN 2024 5:38PM by PIB Hyderabad
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇవాళ న్యూఢిల్లీలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ శాఖతోపాటు సహకార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ మురళీధర్ మోహోల్, పౌర విమానయాన శాఖ కార్యదర్శి శ్రీ వుమ్లున్‌మాంగ్ వుల్నామ్, ఇతర సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
.
ఈ సందర్భంగా శ్రీ నాయుడు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ- పౌర విమానయానం కీలక మంత్రిత్వ శాఖ బాధ్యతలను తనకు అప్పగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. శక్తిమంతుడైన, యువ నేతను ఎంచుకోవడం ముందుచూపుగల ఆయన దార్శనికత విధానాన్ని సూచిస్తున్నదని చెప్పారు. ఆ మేరకు రాబోయే 25 ఏళ్లలో విమానయాన రంగ భవితను తీర్చిదిద్దడంపై ఆయనకుగల దూరదృష్టి గురించి నొక్కిచెప్పారు. ఆంధ్రప్రదేశ్... ప్రత్యేకించి శ్రీకాకుళం ప్రజల విశేష మద్దతు తనకు లభించడం అదృష్టమని శ్రీ నాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్.చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ, తన ఎదుగుదలలో తండ్రి దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు పోషించిన పాత్రను గుర్తు చేసుకున్నారు.
దేశంలో ‘విమానయాన సౌలభ్య వాతావరణ’ కల్పనతోపాటు ప్రతి పౌరుడికీ గగనయాన సౌకర్యం, లభ్యతకు కృషి చేయడమే తన ప్రాథమ్యాలని శ్రీ నాయుడు స్పష్టం చేశారు. అలాగే 2, 3వ అంచె నగరాలపై దృష్టి సారిస్తూ దేశంలో ప్రతి మూలకూ విమానయాన ప్రయోజనాలు చేరేలా చూస్తామని నొక్కిచెప్పారు. ‘‘వికసిత భారత్’పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా భారత విమానయాన రంగంలో తక్షణ ప్రగతి సాధనకు మేము 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, అమలు చేయబోతున్నాం’’ అని శ్రీ నాయుడు తెలిపారు. అలాగే ‘‘భారతదేశం 2047లో స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమయ్యేనాటికి వికసిత భారత్ దీర్ఘకాలిక స్వప్న సాకారానికి ఈ ప్రణాళిక పునాది రాయి అవుతుంది’’ అన్నారు. ప్రయాణికుల అనుభవం మెరుగుపరచడంలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ప్రాధాన్యాన్ని కేంద్రమంత్రి ఈ సందర్భంగా నొక్కిచెప్పారు. తదనుగుణంగా ప్రయాణికుల సమస్యలను సమర్థంగా పరిష్కరించే దిశగా కృత్రిమ మేధ పరిజ్ఞానం సహా సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసుకునే ప్రణాళికను రూపొందిస్తామన్నారు. మొత్తంమీద మంత్రిత్వ శాఖ విధాన నిర్ణయాలన్నిటా ప్రయాణిక సౌకర్యం, సౌలభ్యాలకు ప్రాధాన్యం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
గగనయాన అనుసంధానం పెంపు, పర్యావరణ హిత పద్ధతులకు ప్రోత్సాహం, దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగిరపరచడం వంటివి లక్ష్యంగా నిర్దిష్ట కార్యక్రమాలను చేపడతామని శ్రీ నాయుడు విశదీకరించారు. ఈ లక్ష్యాల సాధనలో రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమతోపాటు కూటమి భాగస్వాములతో సంయుక్తంగా కృషి చేస్తామని ఉద్ఘాటించారు. ముఖ్యంగా విజయనగరం జిల్లా భోగాపురంలో కొత్త విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేయడంపై తన వ్యక్తిగత నిబద్ధతను మంత్రి నొక్కిచెప్పారు. భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశీయ విమానయాన మార్కెట్‌గా తీర్చిదిద్దడంపై ప్రభుత్వ అకుంఠిత అంకితభావాన్ని కేంద్ర మంత్రి పునరుద్ఘాటించారు. సుసంపన్న, వికసిత భారతదేశ నిర్మాణానికి ‘ఎన్‌డిఎ’ సుస్థిర, శక్తిమంతమైన నాయకత్వాన్ని అందించగలదని దృఢ విశ్వాసం వ్యక్తం చేశారు.
***
(Release ID: 2025271)
Visitor Counter : 109