వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ఫ్లిప్‌కార్ట్, భారతీయ బొమ్మల పరిశ్రమతో కలిసి వర్క్‌షాప్ నిర్వహించిన డీపీఐఐటీ
భారతీయ బొమ్మల పరిశ్రమను బలోపేతం చేయడానికి ఈ-కామర్స్ నుంచి ఉత్పన్నమౌతోన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
Posted On:
12 JUN 2024 4:10PM by PIB Hyderabad
అభివృద్ధి చెందుతోన్న భారతీయ బొమ్మల రంగానికి ఉత్తేజాన్ని అందించే లక్ష్యంతో ఫ్లిప్‌కార్ట్,ఇండియన్ టాయ్ ఇండస్ట్రీతో డీపీఐఐటీ ఈ రోజు న్యూఢిల్లీలో వర్క్‌షాప్ నిర్వహించింది. బొమ్మల రంగం మరింత వృద్ధి సాధించేందుకు, దేశీయ వినియోగాన్ని పెంచడానికి, మానవ వనరులకు సంబధించి నైపుణ్యాభివృద్ధి/నైపుణ్య శిక్షణలో రోడ్ మ్యాప్ వేయటంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషించింది. భారతీయ బొమ్మల పరిశ్రమ వృద్ధికి ఊతమిచ్చేందుకు ఈ-కామర్స్ మార్కెట్ నుంచి ఉద్భవిస్తున్న అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకోవచ్చనే అంశంపై ఇక్కడి చర్చలు ప్రత్యేక దృష్టి సారించాయి.
డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. "బొమ్మల పరిశ్రమకు మెరుగైన వాతావరణాన్ని కల్పించే గట్టి నిబద్ధతతో ప్రభుత్వం ఉందని, అందులో భాగంగా 'మేడ్ ఇన్ ఇండియా' బొమ్మలకు ప్రపంచ మార్కెట్‌ను సృష్టించే దీర్ఘకాలిక దార్శనికతతో భారత ప్రభుత్వం ఈ రంగాన్ని ఛాంపియన్ రంగాలలో ఒకటిగా గుర్తించింది” అని అన్నారు. ఈ రంగం పటిష్ఠతను పెంపొందించడానికి పరిశ్రమలతో అన్ని అంశాలపై కలిసి పనిచేయడం ద్వారా సమిష్టి విధానాన్ని అనుసరిస్తున్నట్లు తెలిపారు.
డీపీఐఐటీ సంయుక్త కార్యదర్శి సంజీవ్ మాట్లాడుతూ, "భారతీయ బొమ్మల పరిశ్రమ యొక్క విజయం పెరుగుతున్న ఎగుమతులు, తయారీ ఎకోసిస్టమ్ ధృడత్వం పెరగటం, దిగుమతులపై ఆధారపడటం తగ్గటంలో ప్రతిబింబిస్తుంది. భారతీయ బొమ్మల పరిశ్రమ తన ప్రపంచ ఉనికిని యుఎస్ఏ, యూకే, జర్మనీ, నెదర్లాండ్స్, డెన్మార్క్, చైనాతో సహా 100కు పైగా దేశాలకు విస్తరించిందని తెలిపేందుకు నేను సంతోషిస్తున్నాను. ఆన్లైన్ సాధనాలను సమర్థవంతంగా ఉపయోగించడం ద్వారా అంతర్జాతీయ వినియోగదారులను చేరుకోవడం అనేది బొమ్మల పరిశ్రమ తదుపరి గమ్యం” అని అన్నారు.
ఫ్లిప్ కార్ట్, భారీతయ బొమ్మల పరిశ్రమ సహకారంతో నిర్వహించిన ఈ వర్క్ షాప్… దేశీయ బొమ్మల తయారీదారులకు ఆన్‌లైన్ అమ్మకాల సూక్ష్మాంశాలను అర్థం చేసుకోవడంలో సహాయపడింది. తద్వారా "టాయ్ ఎకానమీ" నిర్మించే దిశగా ఒక అడుగు ముందుకు వేయడానికి దోహదపడింది. ఈ వర్క్ షాప్ లో ఫ్లిప్ కార్ట్‌తో పాటు దేశీయ బొమ్మల పరిశ్రమ సభ్యులు పాల్గొన్నారు.
***
(Release ID: 2024952)
Visitor Counter : 70