మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా కిరణ్ రిజిజు బాధ్యతల స్వీకారం

Posted On: 11 JUN 2024 6:06PM by PIB Hyderabad

   కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా శ్రీ కిరణ్ రిజిజు ఇవాళ న్యూఢిల్లీలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆ శాఖ కార్యదర్శి శ్రీ శ్రీనివాస్ కటికితల సహా ఇతర సీనియర్ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. కాగా, 2024 జూన్ 09న రాష్ట్రపతి భవన్‌లో ఆయన చేత రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించిన సంగతి తెలిసిందే.

   లోక్‌స‌భ‌లో పశ్చిమ అరుణాచల్ ప్రదేశ్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ రిజిజు 1971 నవంబర్ 19న జన్మించారు. ఢిల్లీలో బి.ఎ., ఎల్‌ఎల్‌బి చదివిన ఆయన, పార్లమెంటు సభ్యునిగా ఎన్నికవడం ఇది నాలుగోసారి. శ్రీ రిజిజు 2023 నుంచి 2024 జూన్ వరకూ కేంద్ర భూవిజ్ఞాన శాస్త్ర, ఆహార తయారీ పరిశ్రమల శాఖ కేబినెట్ మంత్రిగా పనిచేశారు. అంతకుముందు 2014 నుంచి 2019 వరకూ హోంశాఖ సహాయమంత్రిగా, 2019 నుంచి 2021 వరకూ మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రిగానూ పనిచేశారు. అలాగే 2019 నుంచి 2021 వరకు క్రీడలు-యువజన వ్యవహారాల (స్వతంత్ర బాధ్యత) సహాయమంత్రిగా, 2021 నుంచి 2023 వరకు న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు.

   బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, అథ్లెటిక్స్‌లో ప్రావీణ్యంగల శ్రీ రిజిజు యువ క్రీడాకారుడుగా జాతీయ స్థాయి పోటీల్లోనూ పాల్గొన్నారు. సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలపై వివిధ పత్రికలలో ఆయన పలు వ్యాసాలు రాశారు. వ్యూహాత్మక, భద్రత వ్యవహారాలలో ఆయనకు ప్రత్యేక ఆసక్తి ఉంది. పాఠశాల రోజుల నుంచే క్రియాశీల సామాజిక కార్యకర్తగా, విద్యార్థి నాయకుడిగా శ్రీ రిజిజు అనేక సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. అనేక దేశాలలో నిర్వహించిన వివిధ సామాజిక-సాంస్కృతిక కార్యక్రమాలలో శ్రీ రిజిజు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. కాగా, 14వ లోక్‌సభలో సభ్యుడుగా మీడియా ద్వారా ఉత్తమ యువ పార్లమెంటేరియన్‌గా ఎంపికయ్యారు.

   పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీ రిజిజు కొద్దిసేపు మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. వికసిత భారత్ లక్ష్య సాధన దిశగా సార్వజనీన దృక్పథంతో ‘సబ్కా సాథ్.. సబ్‌కా వికాస్’ అనే ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా కృషి చేస్తానని మంత్రి తెలిపారు. సమాజ ప్రగతి వైపు తన పయనం కొనసాగే అవకాశం ఇచ్చినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా మైనారిటీల సమగ్రాభివృద్ధికి అన్నివిధాలా కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

***



(Release ID: 2024500) Visitor Counter : 23