ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖలో సహాయ మంత్రిగా శ్రీ ప్రతాపరావు గణపత్‌రావు జాదవ్ బాధ్యతల స్వీకారం

Posted On: 11 JUN 2024 1:53PM by PIB Hyderabad

   కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖలో సహాయమంత్రిగా శ్రీ ప్రతాపరావు జాదవ్ ఇవాళ న్యూఢిల్లీలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. అలాగే ఆయుష్ మంత్రిత్వ శాఖలోనూ (స్వతంత్ర బాధ్యతగల) సహాయ మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆరోగ్య శాఖలో బాధ్యతలు చేపట్టడానికి ముందు తన నివాసంలో ఒక మొక్కను నాటిన శ్రీ జాదవ్ ఆ తర్వాత అవయవ దానం చేస్తానని ప్రతిజ్ఞ కూడా చేశారు.

 

   శ్రీ ప్రతాపరావు జాదవ్ మూడుసార్లు మహారాష్ట్ర శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. క్రీడలు-యువజన సంక్షేమం, నీటిపారుదల శాఖ మంత్రిగానే కాకుండా వివిధ హోదాల్లో రాష్ట్ర ప్రజలకు సేవలందించారు. ఆయన 2009, 2014, 2019, 2024 సంవత్సరాల్లో బుల్దానా నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికవడం విశేషం. కాగా, 1997 నుంచి 1999 వరకు మహారాష్ట్ర క్రీడలు-యువజన సంక్షేమం, నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. లోక్‌సభకు ఎన్నికైన నాటినుంచీ  గ్రామీణాభివృద్ధి-పంచాయతీరాజ్‌ స్థాయీ సంఘం చైర్‌పర్సన్‌గా, కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై స్థాయీ సంఘం చైర్‌పర్సన్‌గా కీలక పదవులు నిర్వహించారు.

 

   ఆరోగ్య మంత్రిత్వశాఖలో ఇవాళ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆ శాఖ కేబినెట్ మంత్రి శ్రీ జె.పి.నడ్డాతోపాటు సీనియర్ అధికారులతో శ్రీ జాదవ్ కూడా కొద్దిసేపు ముచ్చటించారు. అంతకుముందు శ్రీ నడ్డాకు ఆ శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర, అదనపు కార్యదర్శి (ఆరోగ్య విభాగం) శ్రీమతి రోలీ సింగ్, ఇతర సీనియర్ అధికారులు స్వాగతం పలికారు.

 

****



(Release ID: 2024498) Visitor Counter : 14