ప్రధాన మంత్రి కార్యాలయం

అమెరికా పార్లమెంటు ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

Posted On: 23 JUN 2023 7:17AM by PIB Hyderabad

గౌరవనీయులైన స్పీకర్ గారికి

వైస్ ప్రెసిడెంట్ గారికి,

గౌరవ అమెరికన్ పార్లమెంట్ సభ్యులకు,

సోదరసోదరీమణులందరికీ

నమస్కారం!

అమెరికా సంయుక్త రాష్ట్రాల పార్లమెంటునుద్దేశించి ప్రసంగించటం ఎప్పుడూ  గొప్ప గౌరవమే.  ఆలా రెండు సార్లు ప్రసంగించే అవకాశం రావటం చాలా అరుదైన గౌరవం.  ఈ గౌరవం దక్కినందుకు 140 కోట్ల భారతీయుల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా.  మీలో దాదాపు సగం మంది 2016 లో కూడా ఇక్కడ ఉన్నారనుకుంటా.  పాత మిత్రులుగా మీ ఆప్యాయత కనబడుతోంది. మిగిలిన సగం మందిలో కొత్త  స్నేహపు ఉత్సాహం కనబడుతోంది. 2016 లో నేనిక్కడ కలిసిన వారిలో సెనేటర్ హారీ రీడ్, సెనేటర్ జాన్   మెకేయిన్, సెనేటర్ ఓరిన్ హాచ్, ఎలిజా కమ్మింగ్స్, ఆల్సీ  హేస్టింగ్స్ తదితరులు నాకు గుర్తున్నారు. కొంతమంది మనల్ని విడిచి వెళ్ళటం బాధాకరం.

సభాపతి గారూ,

ఇదే స్థానంలో నిలబడి ఏడేళ్ళకిందట ఇదే జూన్ మాసంలో .. అంటే హామిల్టన్ అన్ని అవార్డులనూ కొల్లగొట్టినప్పుడు మనం గత చరిత్రలోని మరకలను మరచిపోవాలని చెప్పాను.  ఇప్పుడు మన శకం నాలుగురోడ్ల కూడలిలో ఉండగా ఈ శతాబ్దానికి మనం ఇవ్వాల్సిన పిలుపు గురించి మాట్లాడబోతున్నా. మనం ప్రయాణించిన  సుదీర్ఘమైన మలుపుల బాటలో స్నేహ పరీక్షలు ఎదురుకున్నాం.  ఏడు వేసవులకు ముందు నేనిక్కడికి వచ్చినప్పటి పరిస్థితులకూ, ఇప్పటికీ చాలా మారిపోయింది. భారత్-అమెరికా మధ్య స్నేహ సంబంధాలు మరింత బలపరచుకో వాలన్న పట్టుదల వంటి విషయాలలో మాత్రం మార్పు లేదు. గడిచిన కొద్ది సంవత్సరాలలో కృత్రిమ మేథ లాంటి విషయాలో ఎంతో పురోగతి చూశాం. అదే సమయంలో మరో ఏఐ – అమెరికా,  ఇండియా లో కూడా చరిత్రాత్మక మార్పులు వచ్చాయి.

గౌరవ సభాపతిగారు, విశిష్ట సభ్యులారా,  

ప్రజలతో నిరంతర అనుసంధానం, వారి మాటలు వినటం, వారి నాడిని అనుభూతి చెందటం అనేవి ప్రజాస్వామ్యపు ప్రత్యేకతలు. దీనికి చాలా సమయం, శక్తి, కృషి, ప్రయాణం అవసరమవుతాయని నాకు తెలుసు. ఇది గురువారం మధ్యాహ్న సమయం. చాలామందికి దూరప్రాంతాలకు వెళ్ళే సమయం. అందుకే, నాకు  సమయమిచ్చిన మీకందరికీ నా ధన్యవాదాలు. ఈ నెలలో మీరెంత  బిజీగా ఉంటారో కూడా నాకు తెలుసు.

సభాపతిగారూ, ఒక చురుకైన ప్రజాస్వామ్య దేశ పౌరునిగా నాకు తెలుసు, మీ పని ఎంత క్లిష్టమైనదో. ఆసక్తి, బుజ్జగింపు, విధానాల ఘర్షణలు ఎలా ఉంటాయో తెలుసు.   ఆలోచనలూ, సిద్ధాంతాల చర్చలను అర్థం చేసుకోగలను. కానీ, ప్రపంచపు రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యాలైన అమెరికా, భారత్ ల బంధాన్ని వేడుకగా జరుపుకునే ఈ వేళ  మీరు కలసి రావటం  నాకెంతో ఆనందంగా ఉంది. ద్వైపాక్షిక ఏకాభిప్రాయం అవసరమైనప్పుడు సహకరించటం నాకెంతో సంతోషదాయకమైన విషయం. సొంత దేశాలలో ఆలోచనల వైరుధ్యం ఉంటుంది, ఉండాలి కూడా. కానీ మన దేశం కోసం మాట్లాడేటప్పుడు ఒకటిగా నిలబడాలి. ఆ పని చేయగలరని మీరు నిరూపించారు. అభినందనలు!

సభాపతి గారూ,

ప్రజల సమానత్వమే దేశ దార్శనికత కావటం అమెరికా స్ఫూర్తికి పునాది. మీ యావత్ చరిత్ర ప్రపంచం నలుమూలల నుంచి  ప్రజలను ఆహ్వానిస్తూ సాగింది. పైగా, అమెరికా కలలో వారందరినీ సమాన భాగస్వాములను చేశారు.  భారత మూలాలున్న కోట్లాదిమంది ఇక్కడున్నారు. కొంతమంది గర్వంగా ఇదే ఛాంబర్ లో కూర్చొని ఉన్నారు. నా వెనుక కూర్చున్న ఒకరు  చరిత్ర సృష్టించారు!  సమోసా కాకస్ ఇప్పుడు సభను ఆకట్టుకున్న  రుచిగా మారిందని విన్నాను. అది ఇంకా ఇంకా పెరిగి భారత వైవిధ్యపు వంటకాల రుచులన్నిటినీ  ఇక్కడికి తెస్తుందని ఆశిస్తా.  రెండు దశాబ్దాలకు పైగా మహనీయులైన అమెరికా, భారత ప్రముఖుల జీవితాల నుంచి పరస్పరం స్ఫూర్తి పొందుతూ వచ్చాం.  మహాత్మా గాంధీకి, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కూ నివాళులర్పిస్తూ వస్తున్నాం. స్వేచ్చకూ, సమానత్వానికీ, న్యాయానికీ  కృషి చేసిన మరెందరినో  స్మరించుకుంటున్నాం. ఈరోజు పార్లమెంట్ సభ్యుడు జాన్  లెవీస్ కు నా హృదయ పూర్వక  శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.

సభాపతి గారూ,

పవిత్రమైన ప్రజాస్వామ్య విలువలను మనం పంచుకున్నాం. కాలక్రమంలో అది ఎన్నో రూపాలు సంతరించుకుంటూ, వ్యవస్థలుగా ఏర్పడుతూ పరిణామం చెందింది. చరిత్ర అంతటా ఒక విషయం  మాత్రం స్పష్టం:  

సమానత్వాన్ని, గౌరవాన్ని  పెంపొందించే స్ఫూర్తి ప్రజాస్వామ్యం

చర్చను, విశ్లేషణను స్వాగతించే ఆలోచన ప్రజాస్వామ్యం

ఆలోచనకూ, మాటకూ రెక్కలు తొడిగే సంస్కృతి ప్రజాస్వామ్యం

అనాదిగా ఇలాంటి విలువలు ఉండటం భారతదేశానికి వరం.

ప్రజాస్వామ్య స్ఫూర్తి పెంపొందుతున్న క్రమంలో భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అయింది.

వేల ఏళ్ల కిందటే మా పురాతన గ్రంథాలు ఇలా పేర్కొన్నాయి:

‘ఏకమ్ సత్ విప్రా బహుధా వదంతి’

దీనర్థం – నిజం ఒక్కటే అయినా, తెలివైనవారు బహువిధాలుగా చెబుతారు అని.

ఇప్పుడు అమెరికా అత్యంత పురాతనమైన ప్రజాస్వామ్యమైతే, భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్యం.

ప్రజాస్వామ్య భవిష్యత్తుకు మన భాగస్వామ్యం బాగా పనికొస్తుంది.

కలసికట్టుగా మనం ప్రపంచానికి మెరుగైన భవిష్యత్తును, భవిష్యత్తుకు మెరుగైన ప్రపంచాన్ని ఇస్తాం.

సభాపతి గారూ,

నిరుడు భారతదేశం తన స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుపుకుంది.  ప్రతి మైలురాయీ ముఖ్యమే అయినా, ఇది మాత్రం ప్రత్యేకం. ఏదో ఒక రూపంలో వెయ్యేళ్ళ విదేశీ పాలన సాగిన అనంతరం 75 ఏళ్ల విశిష్టమైన స్వాతంత్ర్యానంతర యాత్రను వేడుకగా జరుపుకున్నాం.   ఇది కేవలం ప్రజాస్వామ్యపు వేడుక కాదు, వైవిధ్యపు వేడుక కూడా.  రాజ్యాంగానికి మాత్రమే కాదు, సామాజిక సాధికారత స్ఫూర్తికి కూడా. పోటీతత్వపు సహకార సమాఖ్య స్ఫూర్తికి మాత్రమే కాదు, మా  ఐక్యతకు, సమగ్రతకు కూడా వేడుక.

మాకు రెండున్నర వేలకు పైగా రాజకీయ పార్టీలున్నాయి. అవును- మీరు విన్నది నిజమే- రెండున్నర వేల రాజకీయ పార్టీలు. భారతదేశపు వివిధ రాష్ట్రాలను పాలించే దాదాపు 20 వేరువేరు పార్టీలున్నాయి. మాకు ఇరవై రెండు అధికారిక భాషలున్నాయి,  వేలాది మాండలికాలున్నాయి.  అయినా సరే, మేమంతా ఒకే గొంతుక వినిపిస్తాం. ప్రతి వంద మైళ్ళకూ మా వంటకాలు మారతాయి. దోసె నుంచి ఆలూ పరోటా దాకా శ్రీఖండ్ నుంచి సందేశ్ దాకా అన్ని రుచులనూ మేం ఆస్వాదిస్తాం. ప్రపంచంలోని అన్ని మతవిశ్వాసాలకూ భారత్ ఆలవాలం. మేం అన్ని మతాల వేడుకలూ జరుపు కుంటాం. భారతదేశంలో వైవిధ్యం ఒక సహజమైన జీవన విధానం.    

ఈరోజు యావత్  ప్రపంచం భారతదేశం గురించి మరింతగా తెలుసుకోవాలనుకుంటోంది.  అలాంటి ఉత్సాహం ఈ సభలో కూడా కనబడుతోంది. గత దశాబ్ద కాలంలో వందమందికి పైగా అమెరికా పార్లమెంట్ సభ్యులకు భారతదేశంలో స్వాగతం పలకటం మాకు గర్వకారణం. ప్రతి ఒక్కరూ భారతదేశ అభివృద్ధిని, ప్రజాస్వామ్యాన్ని, వైవిధ్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు. ప్రస్తుతం భారతదేశం ఏం  చేస్తున్నదో తెలుసుకోవాలన్న ఉత్సాహమే అందరిదీ.  అత్యంత సన్నిహితులతో అదే విషయం పంచుకోవటం సంతోషంగా ఉంది.

సభాపతి గారూ,

ప్రధానిగా నేను మొదటిసారిగా అమెరికా సందర్శించినప్పుడు భారతదేశం ప్రపంచంలో  పదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.  ఈ రోజు భారతదేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. త్వరలోనే మూడో స్థానం చేరుకుంటుంది. మేం పెద్దగా ఎదగటమే కాదు, వేగంగా కూడా ఎదుగుతున్నాం. భారతదేశం ఎదిగినప్పుడు యావత్ ప్రపంచం ఎదుగుతుంది. ఎంతైనా, మేం ప్రపంచ జనాభాలో ఆరో వంతు! గడిచిన శతాబ్ద కాలంలో భారతదేశం  స్వాతంత్ర్యం సాధించి అది అనేక దేశాలకు స్ఫూర్తి ప్రదాతగా మారి వలసపాలకుల నుంచి అవి  విముక్తం కావటానికి దోహదపడింది. పురోగతిలో భారతదేశం ఒక ప్రమాణాన్ని నెలకొల్పటం ద్వారా అనేక దేశాలకు మార్గదర్శి అయింది. మా దార్శనికత ఒకటే – సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ , సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్. దానర్థం-అందరి ఎదుగుదలకోసం, అందరి విశ్వాసంతో, అందరి కృషితో కలసికట్టుగా ఉందాం - అని.

ఈ దార్శనికత వేగంగానూ, పరిమాణాత్మకం గానూ కార్యాచరణగా ఎలా మారుతున్నదో మీతో పంచుకోవాలను కుంటున్నా. మేం మౌలిక వసతుల అభివృద్ధి మీద దృష్టి పెడుతున్నాం.   దాదాపు పదిహేను కోట్ల  మందికి నివాస సౌకర్యం కల్పించటానికి 4 కోట్ల ఇళ్ళు కట్టించి ఇచ్చాం.  అంటే, అది ఆస్ట్రేలియా  జనాభాకు దాదాపు ఆరు రెట్లు!  మేం నడిపే జాతీయ ఆరోగ్య బీమా పథకం దాదాపు 50 కోట్లమంది ప్రజలకు ఉచిత వైద్య చికిత్స అందిస్తుంది. ఇది దక్షిణ అమెరికా జనాభా కంటే ఎక్కువ! బాంకింగ్ ఎరుగని వారి ముంగిట బాంకింగ్ చేర్చాం. ఆ విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళితి సాధించాం. దాదాపు యాభై కోట్లమంది లబ్ధిపొందారు.  

ఇది దాదాపు ఉత్తర అమెరికా జనాభాకు సమానం!  మేం డిజిటల్ ఇండియా నిర్మాణం కోసం కృషి చేశాం. ఈరోజు భారతదేశంలో 85 కోట్ల మంది స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ వాడకందారులు ఉన్నారు. ఇది యూరప్ జనాభా కంటే ఎక్కువ! భారత్ లో తయారైన  220 కోట్ల కోవిడ్  టీకా డోసులతో  మా ప్రజలను కాపాడుకున్నాం. అది కూడా ఉచితంగా!  ఖండాంతరాలకు వెళతానేమోనని ఇక్కడితో ఆపుతున్నా!

గౌరవ సభ్యులారా ,

వేదాలు ప్రపంచపు అతి పురాతన గ్రంథాలలో కొన్ని. వేలాది సంవత్సరాల క్రితం రూపుదిద్దుకున్న  మహోన్నత మానవతావాద  సంపద అవి. అప్పట్లో మహిళా రుషులు వేదాలలో ఎన్నో శ్లోకాలకు కర్తలు. భారతదేశ దార్శనికత కేవలం మహిళలకు లబ్ధి చేకూర్చే అభివృద్ధి మాత్రమే కాదు, మహిళల సారధ్యంలో జరిగే అభివృద్ధి.  అందులో పురోగతి యాత్రను మహిళలే ముందుండి నడుపుతారు. అతి సామాన్యమైన గిరిజన నేపథ్యంలో ఎదిగిన మహిళ మా దేశాధిపతి.

దాదాపు 15 లక్షలమంది ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధులు వివిధ స్థాయిలలో స్థానిక ప్రభుత్వాలు నడుపుతున్నారు.  ఈరోజు మహిళలు సైన్యం, నావికాదళం, వైమానిక దళంలో దేశానికి సేవలందిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా భారతదేశంలో మహిళా విమాన పైలెట్లు ఉన్నారు. మా అంగారక గ్రహ యాత్రకు మహిళలు సారధ్యం వహించారు.  బాలిక మీద పెట్టే ఖర్చు,  మొత్తం కుటుంబాన్ని ఉన్నత స్థితికి తెస్తుందని నమ్ముతాను. మహిళా సాధికారత దేశాన్ని మార్చేస్తుంది.

సభాపతి గారూ,

భారతదేశం యువజనాభాతో కూడిన పురాతన దేశం. భారతదేశం సంప్రదాయాలకు పెట్టింది పేరు. కానీ యువతరం భారతదేశాన్ని సాంకేతికతకు నిలయంగా మారుస్తోంది. ఇన్ స్టాలో సృజనాత్మకమైన రీల్స్ తయారుచేయటం కావచ్చు, రియల్ టైమ్ చెల్లింపులు కావచ్చు,  కోడింగ్ లేదా క్వాంటమ్ కంప్యూటింగ్ కావచ్చు, మెషీన్ లెర్నింగ్ లేదా మొబైల్ యాప్స్ కావచ్చు, ఫిన్ టెక్ లేదా డేటా సైన్స్ కావచ్చు  .. సమాజం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంత వేగంగా అందుకుంటుందనటానికి భారత యువత ఒక ఉదాహరణ. భారతదేశంలో టెక్నాలజీ అంటే, కొత్త  ఆవిష్కరణ మాత్రమే కాదు, అందులో అందరినీ కలుపుకుపోయే సమ్మిళితి ఉంది. ఈరోజు డిజిటల్ వేదికలు  ప్రజల హక్కులను సాధికారం చేస్తూనే వారి వ్యక్తిగత గోప్యతను కాపాడుతున్నాయి.

గడిచిన తొమ్మిదేళ్లలో వందకోట్లమందికి పైగా విశిష్ట డిజిటల్ బయోమెట్రిక్ గుర్తింపు పొంది తమ బాంకు ఖాతాలతో, మొబైల్ ఫోన్లతో అనుసంధానమయ్యారు. ఈ రకమైన డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయం మా ప్రజలకు క్షణాల్లో ఆర్థిక  సహాయం అందించే వెసులుబాటు కల్పిస్తుంది. ఎనభై ఐదు కోట్ల మంది ఖాతాల్లోకి  ప్రత్యక్ష నగదు బదలీ సౌకర్యం కలిగింది. ఏడాదికి మూడుసార్లు 10 కోట్లమందికి పైగా రైతులు, ఒక మీట నొక్కగానే తమ ఖాతాల్లో ప్రభుత్వ సాయం అందుకోగలుగుతున్నారు. అలాంటి బదలీల విలువ  320 బిలియన్ డాలర్లను మించిపోయింది. ఈ ప్రక్రియలో 25 బిలియన్ డాలర్లకు పైగా ఆదా చేసుకోగలిగాం. మీరు భారతదేశం సందర్శిస్తే, వీధి వర్తకులు సహా అందరూ చెల్లింపులకు ఫోన్లు వాడటం చూడవచ్చు.

నిరుడు ప్రపంచంలో జరిగిన  ప్రతి 100 రియల్ టైమ్ డిజిటల్  చెల్లింపులలో 46 భారతదేశంలోనే జరిగాయి.  దాదాపు నాలుగు లక్షల మైళ్ళ మేరకు ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వేయటం, కారు చౌకగా డేటా అందుబాటు కారణంగా  అవకాశాల విప్లవం వచ్చింది.  రైతులు తాజా వాతావరణ సమాచారం తెలుసుకోగలుగుతున్నారు. కేవలం ఫోన్ మీద ఒకసారి నొక్కితే చాలు - వృద్ధులకు సామాజిక భద్రతా చెల్లింపుల సమాచారం అందుతుంది. విద్యార్థులకు స్కాలర్ షిప్పుల సమాచారం, డాక్టర్లకు టెలీ మెడిసిన్ సేవల వివరాలు, మత్స్య కారులకు చేపలవేట ప్రదేశాలు తెలుస్తాయి. చిన్న వ్యాపారులకు  ఋణ  సమాచారం అందుతుంది.

సభాపతి గారూ,

ప్రజాస్వామ్య స్ఫూర్తి, సమ్మిళితి, సుస్థిరత మమ్మల్ని నిర్వచిస్తాయి. ప్రపంచం పట్ల మా దృక్పథాన్ని కూడా అది తీర్చిదిద్దుతుంది. భారతదేశం ఎదుగుతూనే భూగోళం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తుంది.

మేం నమ్మేది:

మాతా భూమిః  పుత్రో అహం పృధివ్యాః

దీనర్థం -  “భూమి మా తల్లి, మేం ఆమె బిడ్డలం”

భారత సంస్కృతి పర్యావరణాన్ని, మన భూగోళాన్ని గౌరవిస్తుంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారుతూనే సౌర శక్తిలో  2300 శాతం పెరిగాం! అవును-మీరు విన్నది నిజమే- రెండు వేల మూడు వందల శాతం!  

పారిస్ తీర్మానానికి కట్టుబడిన జి-20 దేశం మేము మాత్రమే.  40 శాతం పునరుత్పాదక ఇంధన వనరుల మీద ఆధారపడటానికి 2030  లక్ష్యం కాగా, భారతదేశం 9 సంవత్సరాలు ముందుగానే ఈ లక్ష్యాన్ని సాధించింది. కానీ మేం అక్కడితో ఆగలేదు. గ్లాస్గో శిఖరాగ్ర సదస్సులో మిషన్ లైఫ్ – పర్యావరణం కోసం జీవన శైలి ని ప్రతిపాదించాను. సుస్థిరతను నిజమైన ప్రజా ఉద్యమగా మార్చే పద్ధతి ఇది. కేవలం ప్రభుత్వానికే వదిలేయలేదు.

ఏ ఎంపిక జరిగేటప్పుడైనా ఆలోచించటం ద్వారా ప్రతి ఒక్కరూ ఒక సకారాత్మక మార్పుకు దోహదం చేయగలరు. సుస్థిరతను ఒక ప్రజా ఉద్యమగా మార్చటం ద్వారా ప్రపంచం నెట్ జీరో లక్ష్యాన్ని వేగంగా సాధించగలుగుతుంది. మన దార్శనికత భూగోళ పురోగతికి దారితీయాలి.  భూగోళ సుసంపన్నతకు దోహదపడాలి. భూగోళ ప్రజలకు అనుకూలం కావాలి.  

సభాపతి గారూ,

మా జీవన ప్రాతిపదిక ‘వసుధైవ కుటుంబకమ్’. అంటే – ‘ ప్రపంచమంతా ఒక కుటుంబం’ అని.  మేం చేసే ప్రతి పనీ అందరి ప్రయోజనం కోసం.  “ఒక సూర్యుడు, ఒక ప్రపంచం, ఒక గ్రిడ్” అనే సూత్రం కాలుష్య రహిత విద్యుదుత్పత్తి దిశలో అందరినీ ఏకం చేస్తుంది. ఈ దార్శనికత అంతర్జాతీయ చర్యను ప్రోత్సహించి జంతువులు, వృక్షాలతో సహా  ప్రాణులందరికీ నాణ్యమైన ఆరోగ్య సేవలందిస్తుంది.  అదే రకమైన స్ఫూర్తి మేం అధ్యక్షత వహిస్తున్న జి-20 నినాదం – “ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు” లోనూ ప్రతిఫలిస్తుంది. ఐక్యతా స్ఫూర్తిని మేం యోగా ద్వారా కూడా ముందుకు తీసుకు వెళుతున్నాం. నిన్ననే యావత్ ప్రపంచం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటూ ఒక్కటైంది. శాంతి రక్షకులకు ఒక స్మారక కుడ్యం  నిర్మించాలని గతవారమే ఐక్యరాజ్య సమితిలో మేం చేసిన ప్రతిపాదనకు అన్ని దేశాలూ మద్దతు ప్రకటించాయి.

ఈ సంవత్సరం యావత్ ప్రపంచం అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం పాటిస్తోంది. దీనివల్ల సుస్థిర వ్యవసాయంతోబాటు పౌష్టికాహారానికి కూడా  అండ లభిస్తుంది. కోవిడ్  సమయంలో మేం 150 కి పైగా దేశాలకు మందులు, టీకాలు అందజేశాం. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ముందుగా స్పందించి అక్కడికి  చేరుకున్నాం.  మాకున్న పరిమిత వనరులతోనే అక్కడి బాధితుల కనీస అవసరాలు తీర్చగలిగాం. మేం సామర్థ్యాలు నిర్మిస్తాం తప్ప ఆధారపడటం నేర్పం.  

సభాపతి గారూ,

ప్రపంచం పట్ల భారత వైఖరి గురించి నేను మాట్లాడినప్పుడు అందులో యునైటెడ్ స్టేట్స్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. మా సంబంధాలకు అత్యంత ప్రాధాన్యమున్న విషయం మీ అందరికీ తెలుసు. ఈ పార్లమెంట్ లోని ప్రతి సభ్యునికీ అందులో లోతైన ప్రయోజనాలున్నాయి. భారతదేశంలో రక్షణ, అంతరిక్ష రంగాలు ఎదిగితే  వాషింగ్టన్, ఆరిజోనా, జార్జియా, అలబామా, సౌత్ కరోలినా, పెన్సిల్వేనియాలో పరిశ్రమలు  వర్ధిల్లుతాయి. అమెరికా కంపెనీలు ఎదిగితే, భారతదేశంలోని వాటి పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు వర్ధిల్లుతాయి.  భారతీయలు ఎక్కువమంది తరలి వస్తే విమానాలకు ఇచ్చే ఒకే ఒక్క ఆర్డర్ తో అమెరికాలోని 44 రాష్ట్రాలలో పది లక్షల ఉద్యోగాలు వస్తాయి.  

అమెరికా ఫోన్ల తయారీ సంస్థ భారత్ లో పెట్టుబడి పెడితే అది రెండు  దేశాల ఉద్యోగ పర్యావరణంలో అవకాశాలు సృష్టిస్తుంది.  సెమీ కండక్టర్, కీలక ఖనిజాల మీద భారత్, అమెరికా ఉమ్మడిగా కృషి చేస్తే  ప్రపంచంలో సప్లై చెయిన్స్ మరింత వైవిధ్యంగా, సులువుగా కొలుకునేలా, ఆధారపడదగినట్టుగా తయారవుతాయి.  నిజానికి, సభాపతి గారూ, గత శతాబ్దం చివరలో రక్షణ రంగ సహకారానికి మేం కొత్తవాళ్ళం. కానీ, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ మాకు అత్యంత ముఖ్యమైన రక్షణ రంగ భాగస్వామి. ఈరోజు భారత్, అమెరికా దేశాలు అంతరిక్షం, సముద్రగర్భం, సైన్స్, సెమికండక్టర్లు, అంకుర సంస్థలు, సుస్థిరత, టెక్నాలజీ, వాణిజ్యం, వ్యవసాయం , ఆర్థిక సహాయం, కృత్రిమ మేథ, విద్యుత్, విద్య ఆరోగ్య రంగం, మానవతావాద కృషి లాంటి వైవిధ్య భరిత రంగాలలో సహకరించుకుంటున్నాయి.

ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. కానీ స్థూలంగా చెప్పాలంటే ,

మన సహకార పరిధి అపరిమితం.

మన ఉమ్మడి కృషి అవకాశాలు అనంతం,

మన సంబంధాలలో కలయిక అప్రమేయం.

మొత్తంగా అమెరికాలోని భారతీయులు చాలా పెద్ద పాత్ర పోషించారు. వాళ్ళు  కేవలం స్పెల్లింగ్ బీ లో  మాత్రమే కాదు, అన్ని రంగాలో అత్యంత ప్రతిభావంతులు. వాళ్ళ హృదయాలు- మేథస్సుతో, ప్రతిభ- నైపుణ్యంతో మేరరీకా-భారత్ పట్ల ప్రేమతో   మనల్ని అనుసంధానం చేశారు, తలుపులు తెరచారు, మన భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలు చూపారు.

గౌరవ సభాపతి గారు, గౌరవసభ్యులారా,  

గతంలో ప్రతి భారత ప్రధానీ, అమెరికా అధ్యక్షుడూ  మన బంధాన్ని మరింత ముందుకు తీసుకుపోయారు. కానీ మన తరం దాన్ని సమున్నత శిఖరాలకు తీసుకువెళ్ళే గౌరవం దక్కించుకుంది.  ఈ భాగస్వామ్యం ఈ శతాబ్దానికే అత్యంత కీలకమైనదన్న అధ్యక్షుడు బైడెన్  మాటలతో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే ఇది విస్తృత ప్రయోజనాలను ఉద్దేశించినది. ప్రజాస్వామ్యం, జనాభా, లక్ష్యం మనకు అలాంటి పరిస్థితి కల్పించింది. గ్లోబలైజేషన్ వలన కలిగిన ఫలితాలలో ఒకటి – సప్లై చెయిన్ల  గాఢత పెరగటం.

సప్లై చెయిన్లను వైవిధ్య భరితం చేసి, వికేంద్రీకరించి, ప్రజాస్వామ్యయుతం చేయటానికి కలసి కృషి చేద్దాం. ఇరవయ్యొకటో శతాబ్దంలో  భద్రతను, సుసంపన్నతను, నాయకత్వాన్ని నిర్ణయించేది టెక్నాలజీ మాత్రమే.  అందుకే మన రెండు దేశాలూ కీలకమైన, ఎదుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాల మీద దృష్టి సారించాయి.  మన జ్ఞాన భాగస్వామ్యం మానవాళికి సేవలందించి, ప్రపంచం ఎదుర్కుంటున్న వాతావరణ మార్పు, ఆకలి, అనారోగ్య సమస్యలవంటి  సవాళ్ళకు పరిష్కార మార్గాలు వెతికే కృషి చేస్తుంది.  

గౌరవ సభాపతి గారు, గౌరవసభ్యులారా, 

గడిచిన కొద్ది సంవత్సరాలు చాలా విచ్ఛిన్నకరమైన పరిణామాలు చూశాయి. ఉక్రెయిన్ ఘర్షణతో యూరప్ కి మళ్ళీ యుద్ధం తిరిగొచ్చింది. ఆ ప్రాంతంలో ఎంతో బాధకు కారణమైంది. ప్రధాన శక్తులు ఇందులో ఇమిడి ఉండటం వలన ఫలితం కూడా తీవ్రంగానే ఉంది.  ముఖ్యంగా,  గ్లోబల్ సౌత్ గా పిలవబడే అభివృద్ధి చెందుతున్న దేశాలు దెబ్బతిన్నాయి.  యావత్ ప్రపంచం ఐక్యరాజ్య సమితి సూత్రాలైన  శాంతియుత వివాద పరిష్కారం, సార్వభౌమత్వం పట్ల గౌరవం, ప్రాదేశిక సమగ్రత పట్ల గౌరవంతో ఉంది.  

నేను ప్రత్యక్షంగా,  బహిరంగంగా చెప్పినట్టు  ఇది యుద్ధ శకం కాదు. చర్చలు, దౌత్య సమయం. రక్తపాతాన్ని, మానవ వేదనను నిలువరించటానికి మనకు సాధ్యమైనంత చేయాలి. సభాపతి గారూ..  వత్తిడి, ఘర్షణ అనే నీలి మేఘాల నీడలు  ఇండో పసిఫిక్ ప్రాంతం మీద కమ్ముకున్నాయి. ఈ ప్రాంతంలో సుస్థిరత ఇప్పుడు మన భాగస్వామ్యానికి కీలక సమస్యల్లో ఒకటిగా తయారైంది.  

మన దార్శనికత అణచివేయాలనో, తొలగించాలనో కోరుకోవటం లేదు. శాంతి, సౌఖ్యాలకు పాత్రమైన సహకార ప్రాంతాన్ని నిర్మించాలన్నదే లక్ష్యం. ఇక్కడి ప్రాంతీయ సంస్థల ద్వారా, ఈ ప్రాంతంలోని మన భాగస్వాముల ద్వారా కృషి చేద్దాం. ఇందులో  ‘క్వాడ్’ ఒక ప్రధాన శక్తిగా అవతరించింది.

గౌరవ సభాపతి గారూ,

సెప్టెంబర్ 11 నాటి దాడులు జరిగి రెండు దశాబ్దాలకు పైగా, ముంబై దాడులు జరిగి శతాబ్దం పైగా గడిచినా, తీవ్రవాదం ఇప్పటికీ యావత్ ప్రపంచానికి ప్రమాదంగా మిగిలిపోయింది. ఈ సిద్ధాంతాలు ఎప్పటికప్పుడు కొత్త  రూపాలు సంతరించుకుంటున్నాయి. కానీ వాటి ఆలోచనలు మాత్రం అవే. తీవ్రవాదం అనేది మానవత్వానికి శత్రువు.  . దాని రూపుమాపటంలో ‘కానీ, అయితే’ అనే మాటలకు తావులేదు. తీవ్రవాదానికి అండగా నిలిచే, తీవ్రవాదాన్ని ఎగుమతిచేసే  శక్తులను మనం అన్నివిధాలుగా అధిగమించాలి.

గౌరవ సభాపతి గారూ,

కోవిడ్ -19 అతిపెద్ద ప్రభావం ప్రాణ నష్టం, అది తెచ్చిపెట్టిన పెను విషాదం. పార్లమెంట్ సభ్యుడు రాన్  రైట్, మరికొందరు  సిబ్బంది ప్రాణాలు కోల్పోవటం నాకు తెలుసు. ఆ సంక్షోభం నుంచి మనం బైట పడుతున్న  సమయంలో ప్రపంచానికి మనమొక కొత్త రూపం ఇవ్వాలి. లెక్కలోకి తీసుకోవటం, రక్షణ ఇవ్వటం, సానుభూతి తక్షణ కర్తవ్యాలు.  దక్షిణార్థ గోళ  దేశాలకు గొంతుకగా మారటం మన ముందున్న కర్తవ్యం.  అందుకే ఆఫ్రికన్ యూనియన్ కు జి-20 లో పూర్తి సభ్యత్వం ఇవ్వటం సమంజమని నా అభిప్రాయం.

మనం బహుళ పక్ష వాదాన్ని పునరుద్ధరించి మెరుగైన వనరులత,  ప్రాతినిధ్యంతో బహుళపక్ష సంస్థలను సంస్కరించాలి.  అది ఐక్యరాజ్య సమితి తో సహా పాలనలో ఉండే అన్ని సంస్థలకూ వర్తిస్తుంది. ప్రపంచం మారినప్పుడు మన సంస్థలు కూడా మారితీరాలి. లేని పక్షంలో దాని స్థానంలో ఎలాంటి నిబంధనలూ లేని వైరుధ్యాల ప్రపంచాన్ని  ఎదుర్కోవాలి. అంతర్జాతీయ న్యాయసూత్రాలకు అనుగుణంగా కొత్త ప్రపంచ నియమావళి కోసం కృషి చేసేటప్పుడు మన రెండు దేశాలూ భాగస్వాములుగా ముందుండాలి.

గౌరవ సభాపతి గారు, గౌరవసభ్యులారా, 

ఈ రోజు మనం మన సంబంధంలో సరికొత్త ప్రత్యూష వేళలో ఉన్నాం. ఇది మన రెండు దేశాల గమ్యాన్ని నిర్దేశించటానికే పరిమితం కాదు, ప్రపంచానికే మార్గానిర్దేశం చేస్తుంది. యువ అమెరికన్ కవి అమందా గోర్మన్  అన్నట్టు :  

"పగలు కాగానే మనం నీడ నుంచి బైటికొస్తాం,

మండుతూ, నిర్భయంగా,

స్వేచ్ఛగా వదిలేస్తే కొత్త ఉషోదయం విప్పారుతుంది

వెలుతురు  ఎప్పుడూ ఉంటుంది,  

చూసే ధైర్యమే ఉండాలి మనకు”

మన విశ్వసనీయమైన భాగస్వామ్యం ఈ కొత్త ఉషోదయంలో  చుట్టూ వెలుతురు విరాజిమ్మే సూర్యుడి లాంటిది.  

నేను ఒకప్పుడు రాసుకున్న పాట గుర్తుకొస్తోంది:  

ఆస్మాన్  మే సిర్ ఉఠాకర్

ఘనే బాదలోం కో చీర్ కర్   

రోషణీ కా సంకల్ప్ లే

అభీ తో సూరజ్ ఉగా హై |

దృఢ్ నిశ్చయ్ కే సాథ్ చల్ కర్  

హర ముష్కిల్ కో పార్ కర్  

ఘోర్ అంధేరే కో మిటానే

అభీ తో సూరజ్ ఊగా హై ||

 

ఇదే ఇంగ్లీష్ లో చెప్పాలంటే :   

ఆకాశంలోకి తలెత్తి

చిక్కటి మేఘాల గుండా గుచ్చి చూస్తా  

వెలుగు కోసం ఆశతో ,

అప్పుడే సూర్యోదయమైంది

దీక్ష అనే ఆయుధం చేబూని

అవరోధాలు దాటుకుంటూ

చీకటి శక్తులను పటాపంచలు చేయటానికి  

ఇప్పుడే సూర్యోదయమైంది.

 

గౌరవ సభాపతి గారు, గౌరవసభ్యులారా, 

మనం వివిధ నేపథ్యాలనుంచి, చరిత్ర నుంచి వచ్చాం.  కానీ ఒక ఉమ్మడి దార్శనికతతో, ఉమ్మడి లక్ష్యంతో  ఏకమయ్యాం. మన భాగస్వామ్యం  పురోగమించే కొద్దీ ఆర్థికంగా కోలుకోవటం కూడా  పురోగమిస్తుంది. నవకల్పన పెరుగుతుంది. సైన్స్ వృద్ధి చెందుతుంది. జ్ఞానం ముందడుగు వేస్తుంది. మానవాళి లబ్ధిపొందుతుంది. మన సముద్రాలు, ఆకాశం సురక్షితమవుతాయి. ప్రజాస్వామ్యం వెలిగిపోతుంది. జీవనానికి  ప్రపంచం ఒక మెరుగైన ప్రదేశమవుతుంది.   

మన భాగస్వామ్యపు లక్ష్యం అది.  ఈ శతాబ్దానికి మనం ఇచ్చే పిలుపు  అది. గౌరవ సభాపతి గారు, గౌరవసభ్యులారా,  మన భాగస్వామ్యపు అత్యుత్తమ ప్రమాణాల దృష్ట్యా చూసినా ఈ పర్యటన అత్యంత సానుకూల మార్పులో భాగం. ప్రజాస్వామ్యాల ప్రాధాన్యాన్ని, ప్రజాస్వామ్యాల ఆచరణను మనం ఉమ్మడిగా ప్రదర్శించి చూపుదాం. భారత్-అమెరికా భాగస్వామ్యానికి మీ సహకారం కొనసాగాలని కోరుకుంటున్నా.

2016 లో నేనిక్కడ ఉన్నప్పుడు అన్నాను, “మన బంధం చరిత్రాత్మక భవిష్యత్తు కోసం” అని.  ఆ భవిష్యత్తు ఈరోజే. గౌరవ సభాపతి గారు,  వైస్ ప్రెసిడెంట్ గారు, గౌరవసభ్యులారా,  ఈ  గౌరవానికి మరోమారు ధన్యవాదాలు. 

గాడ్ బ్లెస్ అమెరికా.

జై హింద్.

అమెరికా-భారత మైత్రి వర్ధిల్లాలి.

***



(Release ID: 2017763) Visitor Counter : 24