ప్రధాన మంత్రి కార్యాలయం
అస్సాంలో కజిరంగా జాతీయ పార్కును సందర్శించిన ప్రధాని
ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలని పౌరులకు పిలుపు;
‘వన దుర్గ’ మహిళా అటవీ రక్షణ బృందంతో ప్రధాని మాటామంతీ;
గజత్రయం ‘లఖిమాయి.. ప్రద్యుమ్న.. ఫూల్‌మాయి’లకు చెరకు తినిపించిన ప్రధాని
Posted On:
09 MAR 2024 10:00AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం అస్సాంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కజిరంగా జాతీయ పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా కజిరంగా జాతీయ పార్కును భారత పౌరులంతా సందర్శించాలని, ఇక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలని శ్రీ మోదీ పిలుపునిచ్చారు. ఈ పార్కు పరిరక్షణ ద్వారా పర్యావరణ సంరక్షణలో పాలుపంచుకుంటున్న ‘వన దుర్గ’ మహిళా అటవీ గార్డుల బృందంతో ప్రధాని కొంతసేపు ముచ్చటించారు. ఈ సహజ వారసత్వ సంపద రక్షణలో వారి అంకితభావాన్ని, సాహసాన్ని ఆయన ప్రశంసించారు. పార్కు సందర్శన సమయంలో అక్కడి గజత్రయం ‘లఖిమాయి, ప్రద్యుమ్న, ఫూల్‌మాయి’లకు చెరకు గడలు అందిస్తూ, ఆ దృశ్యాలను ప్రజలతో పంచుకున్నారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పలు సందేశాలు పంపారు:
‘‘ఈ రోజు ఉదయం నేను అస్సాంలోని కజిరంగా జాతీయ పార్కును సందర్శించాను. కనుచూపు మేర పరచుకున్న పచ్చదనం నడుమ ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అరుదైన ఒంటికొమ్ము ఖడ్గమృగాలు సహా వైవిధ్యభరిత వృక్ష-జంతుజాలంతో అలరారుతోంది.’’ అని ప్రధాని పేర్కొన్నారు.
అలాగే ‘‘కజిరంగా జాతీయ పార్కును సందర్శించి, ఇక్కడి అద్భుత ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలని, అస్సాం ప్రజల సౌహార్ద ఆతిథ్యాన్ని చవిచూడాలని, నేను మీ అందర్నీ కోరుతున్నాను. ప్రతి సందర్శన మన ఆత్మను సుసంపన్నం చేస్తూ, అస్సాం హృదయానురాగంతో మిమ్మల్ని లోతుగా మమేకం చేసే ప్రదేశమిది” అని పౌరులకు పిలుపునిచ్చారు.
‘‘ఈ పార్కులో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న ‘వన దుర్గ’ మహిళా అటవీ గార్డుల బృందంతో కొద్దిసేపు ముచ్చటించాను. మన అడవులతోపాటు వన్యప్రాణుల సంరక్షణలో వారెంతో ధైర్యసాహసాలు ప్రదర్శిస్తున్నారు. మన సహజ వారసత్వ సంపద పరిరక్షణలో వారి అంకితభావం, సాహసం అందరికీ నిజంగా స్ఫూర్తిదాయకం’’ అని ప్రధాని ప్రశంసించారు.
‘‘లఖిమాయి, ప్రద్యుమ్న, ఫూల్‌మాయి’లకు చెరకు తినిపించాను. కజిరంగా పార్కు పేరు వినగానే మనకు ఒంటికొమ్ము ఖడ్గమృగాలే గుర్తుకొస్తాయి. కానీ, ఇక్కడ అనేక ఇతర జంతు జాతులతోపాటు పెద్ద సంఖ్యలో ఏనుగులు కూడా ఉన్నాయి’’ అని ప్రధాని పేర్కొన్నారు.
***
(Release ID: 2013377)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam