ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీనగర్‌లో జరిగిన 'వికసిత్‌ భారత్‌ వికసిత్‌ జమ్ము&కశ్మీర్‌' కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ


దాదాపు రూ.5000 కోట్ల సమగ్ర వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాన్ని దేశానికి అంకితం చేసిన ప్రధాని

స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకం కింద రూ.1400 కోట్లకు పైగా విలువైన 52 పర్యాటక ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, జాతికి అంకితం

శ్రీనగర్‌లోని 'హజరత్‌బాల్‌ క్షేత్ర సమగ్ర అభివృద్ధి' ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన పీఎం

'ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్‌మెంట్ స్కీమ్' కింద ఎంపిక చేసిన పర్యాటక ప్రదేశాలు పేర్లు ప్రకటన

'దేఖో అప్నా దేశ్ పీపుల్స్ ఛాయిస్ 2024', 'చలో ఇండియా గ్లోబల్ డయాస్పొర క్యాంపెయిన్' ప్రారంభం

జమ్ముకశ్మీర్‌లో కొత్తగా నియమితులైన ప్రభుత్వ ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేత

"ఈ ప్రేమానుబంధాన్ని తీర్చుకోవడానికి వచ్చిన ఏ అవకాశాన్ని మోదీ వదిలిపెట్టడు. మీ మనస్సులు గెలుచుకోవడానికి నేను కష్టపడుతున్నా, నేను సరైన మార్గంలోనే ఉన్నానని నమ్ముతున్నా"

"జమ్ముకశ్మీర్‌ అభివృద్ధి శక్తి, పర్యాటక సామర్థ్యం,రైతుల నైపుణ్యాలు, యువత నాయకత్వం అభివృద్ధి చెందిన జమ్ముకశ్మీర్‌కు మార్గం సుగమం చేస్తాయి"

"జమ్ముకశ్మీర్‌ అంటే కేవలం ఒక ప్రాంతం మాత్రమే కాదు,

Posted On: 07 MAR 2024 2:48PM by PIB Hyderabad

దాదాపు రూ.5,000 కోట్ల సమగ్ర వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అంకితం చేశారు. శ్రీనగర్‌లోని 'ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హజరత్‌బాల్‌ క్షేత్రం' ప్రాజెక్టు సహా స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకం కింద రూ.1400 కోట్ల విలువైన పర్యాటక రంగ ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ రోజు, జమ్ము&కశ్మీర్‌లోని శ్రీ న‌గ‌ర్‌లో జరిగిన 'వికసిత్‌ భారత్‌ వికసిత్‌ జమ్ముకశ్మీర్‌' కార్యక్రమంలో శ్రీ న‌రేంద్ర మోదీ ప్రసంగించారు. 'దేఖో అప్నా దేశ్ పీపుల్స్ ఛాయిస్ టూరిస్ట్ డెస్టినేషన్ పోల్', 'చలో ఇండియా గ్లోబల్ డయాస్పొర క్యాంపెయిన్'ను ప్రధాని ప్రారంభించారు. 'ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్‌మెంట్' (సీబీడీడీ) పథకం కింద ఎంపిక చేసిన పర్యాటక ప్రాంతాల పేర్లను ప్రకటించారు. జమ్ముకశ్మీర్ నుంచి కొత్తగా ఎంపికైనా 1000 మంది ఉద్యోగులకు నియామక పత్రాలను కూడా శ్రీ మోదీ పంపిణీ చేశారు. మహిళా లబ్ధిదార్లు, లఖ్‌పతి దీదీలు, రైతులు, పారిశ్రామికవేత్తలు సహా వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదార్లతో సంభాషించారు.

పుల్వామాకు చెందిన తేనెటీగల రైతు నజీమ్ నజీమ్‌, ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుని తన వ్యాపారాన్ని విస్తరించిన విధానాన్ని ప్రధానికి వివరించారు. తేనెటీగల పెంపకం కోసం 50 శాతం రాయితీతో తొలుత 25 పెట్టెలను కొనుగోలు చేసిన నజీమ్‌, ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం కింద రూ.5 లక్షలు తీసుకుని క్రమంగా 200 పెట్టెలకు విస్తరించే క్రమంలో సాగిన తన ఆర్థికాభివృద్ధి ప్రయాణాన్ని వివరించారు. దీనివల్ల, నజీమ్‌ తనకంటూ సొంతంగా ఒక తేనె బ్రాండ్‌ను సృష్టించుకున్నారు, ఒక వెబ్‌సైట్‌ను రూపొందించారు. తద్వారా, దేశవ్యాప్తంగా దాదాపు 5000 కిలోల సరఫరా కోసం వేల ఆర్డర్లను పొందారు. ఇప్పుడు నజీమ్‌ వ్యాపారం దాదాపు 2000 తేనెటీగల పెంపకం బాక్సులకు పెరిగింది, దాదాపు 100 మంది యువతకు ఉపాధి లభించింది. 2023లో ఎఫ్‌పీవో పొందడం గురించి ప్రధానమంత్రికి నజీమ్‌ వెల్లడించారు, కేవలం దాన్ని వల్లే తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకోగలిగానని చెప్పారు. దేశంలోని ఆర్థిక సాంకేతికతను మార్చిన డిజిటల్ ఇండియా చొరవను ప్రారంభించినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో తీపి విప్లవానికి నాయకత్వం వహించేలా నజీమ్‌ చేసిన కృషిని ప్రధాన మంత్రి ప్రశంసించారు. వ్యాపారాన్ని స్థాపించడానికి ప్రభుత్వం నుంచి పొందిన ప్రాథమిక మద్దతుపై ప్రధాన మంత్రి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన నజీమ్, తాను మొదట్లో ఇబ్బందిని ఎదుర్కొన్నప్పటికీ, వ్యవసాయ విభాగం ముందుకు వచ్చి తనకు తోడుగా నిలిచిందన్నారు. తేనెటీగల పెంపకం దాదాపు ఒక కొత్త రంగం అని చెప్పిన ప్రధాని, దానివల్ల ఒనగూరే ప్రయోజనాలను వివరించారు. తేనెటీగలు వ్యవసాయ కూలీల వలె పనిచేస్తాయని, పంటలకు లాభం చేకూరుస్తాయని అన్నారు. ఈ పద్ధతి రైతులకు కూడా లాభదాయకంగా ఉంటుందని, తేనెటీగల పెంపకానికి భూమిని తక్కువ ధరకే ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని కూడా నజీమ్ చెప్పారు. హిందు కుష్ పర్వతాల చుట్టూ మధ్య ఆసియాలో ఉత్పత్తి అయ్యే తేనె గురించి పరిశోధించాలని నజీమ్‌కు ప్రధాని సూచించారు. తేనెటీగల పెట్టె చుట్టూ ప్రత్యేక పువ్వులు పెంచడం ద్వారా తేనె రుచిని పెంచాలని కూడా కోరారు. ఉత్తరాఖండ్‌లో ఈ తరహా ప్రయత్నాలు విజయవంతం అయ్యాయని కూడా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ కారణంగా, ఆకేసియా తేనె ధర కిలోకు రూ.400 నుంచి రూ.1000కు పెరగడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. నజీమ్‌ ఆలోచనల్లోని స్పష్టతను, వ్యాపార నిర్వహణలో చూపిన ధైర్యాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు, అతని తల్లిదండ్రులను కూడా అభినందించారు. భారతదేశ యువతకు నజీమ్ దిశానిర్దేశం చేస్తారని, స్ఫూర్తిగా నిలుస్తారని చెప్పారు.

శ్రీనగర్‌కు చెందిన అహ్తేషమ్ మాజిద్ భట్ బేకరీ వ్యవస్థాపకురాలు. ఆహార సాంకేతికత అభివృద్ధి కార్యక్రరం ద్వారా బేకరీలో కొత్త ఆవిష్కరణలు తీసుకువచ్చారు. ఆమెకు, గవర్నమెంట్‌ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ స్కిల్ డెవలప్‌మెంట్‌లోని ఇంక్యుబేషన్ కేంద్రం మద్దతుగా నిలిచింది. ప్రభుత్వ ఏకగవాక్ష విధానం ద్వారా ఆమె & ఆమె బృందం వివిధ విభాగాల నుంచి అన్ని ఎన్‌వోసీలను పొందారు. గత పదేళ్లుగా, అంకుర సంస్థల కలలను సాకారం చేసుకునేందుకు కోట్లాది మంది యువతకు కేంద్ర ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు అందజేస్తోందని ప్రధాని ఆమెకు చెప్పారు. వివిధ జిల్లాలకు చెందిన ఆమె స్నేహితులను వ్యవస్థాపకత విభాగాల్లో భాగస్వాములను చేసినందుకు అహ్తేషమ్ మాజిద్ భట్‌ను ప్రధాన మంత్రి అభినందించారు. "ఆలోచనాపరులైన మన యువత వనరులు, డబ్బు కొరతతో బాధపడకూడదు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. జమ్ముకశ్మీర్‌లోని ఈ అమ్మాయిలు దేశ యువతకు కొత్త స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తున్నారు" అని కొనియాడారు. నిరుపేద ఆడపిల్లలను ఆదుకుంటున్నారని మెచ్చుకున్నారు.

గందర్‌బల్‌కు చెందిన హమిదా బానో, పాల వ్యాపారం చేస్తున్నారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) ద్వారా తాను లబ్ధి పొందానని, పాల ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్‌ ప్రారంభించానని ప్రధానికి వివరించారు. తన వ్యాపారం కోసం మరికొందరు మహిళలను కూడా ఆమె నియమించుకున్నారు. ఉత్పత్తుల నాణ్యత నియంత్రణ, ప్యాకేజింగ్, మార్కెటింగ్ పద్ధతుల గురించి కూడా ఆమె ప్రధానికి వివరించారు. ఆమెకున్న వృత్తిపరమైన నైపుణ్యం, ప్రజలకు పోషకాహారం అందించేందుకు చేస్తున్న నిరంతర కృషిని ప్రధాన మంత్రి ప్రశంసించారు. నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని, పర్యావరణహితంగా వ్యాపారం చేస్తున్నారని అభినందించారు.

జమ్ము&కశ్మీర్‌ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని, భూమిపై ఉన్న స్వర్గానికి చేరుకున్న అనుభూతిని మాటల్లో వర్ణించలేనని అన్నారు. "ఈ ప్రకృతి, గాలి, లోయ ప్రాంతం, పర్యావరణం, కాశ్మీరీ సోదరసోదరీమణుల ప్రేమ, ఆప్యాయతలు అసమానం" అని వ్యాఖ్యానించారు. సభావేదిక వెలుపల కూడా పౌరులు ఉన్నారన్న ప్రధాని, 285 బ్లాక్‌ల నుంచి 1 లక్ష మందికి పైగా ప్రజలు వీడియో లింక్ ద్వారా సభలో పాల్గొన్నారని చెప్పారు. ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నది ఈ కొత్త జమ్ముకశ్మీర్‌ కోసమే అని ప్రధాని ఉద్ఘాటించారు. ఈ జమ్ముకశ్మీర్‌ కోసం డా.శ్యామా ప్రసాద్ ముఖర్జీ ప్రాణత్యాగం చేశారని'' ప్రధాని గుర్తు చేశారు. నూతన జమ్ముకశ్మీర్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని, అన్ని అడ్డంకులను అధిగమించేందుకు కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. జమ్ముకశ్మీర్‌ ప్రజల ముఖంపై చిరునవ్వులు చూస్తున్నప్పుడు 140 కోట్ల మంది ప్రజలు శాంతి సౌఖ్యాన్ని అనుభవిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు.

జమ్ముకశ్మీర్‌ ప్రజల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపిన శ్రీ మోదీ "ఈ ప్రేమానుబంధాన్ని తీర్చుకోవడానికి వచ్చే ఏ అవకాశాన్ని మోదీ వదిలిపెట్టడు. మీ మనస్సులు గెలుచుకోవడానికి నేను కష్టపడుతున్నా, నేను సరైన మార్గంలోనే ఉన్నానని నమ్ముతున్నా. మీ హృదయం గెలవడానికి నా ప్రయత్నాలు కొనసాగిస్తాను. ఇది మోదీ గ్యారెంటీ. మోదీ గ్యారెంటీ అంటే మాట నిలబెట్టుకోవడమేనని మీ అందరికీ తెలుసు" అన్నారు.

రూ.32,000 కోట్ల విలువైన మౌలిక సదుపాయాలు, విద్యా ప్రాజెక్టులను ప్రారంభించినప్పటి జమ్ము పర్యటనను గుర్తు చేసిన పీఎం, ఈ రోజు పంపిణీ చేసిన నియామక పత్రాలతో పాటు పర్యాటకం, అభివృద్ధి, వ్యవసాయానికి సంబంధించిన ప్రాజెక్టుల గురించి ప్రస్తావించారు. "జమ్ముకశ్మీర్‌ అభివృద్ధి శక్తి, పర్యాటక సామర్థ్యం,రైతుల నైపుణ్యాలు, యువత నాయకత్వం అభివృద్ధి చెందిన జమ్ముకశ్మీర్‌కు మార్గం సుగమం చేస్తాయి. జమ్ముకశ్మీర్‌ అంటే కేవలం ఒక ప్రాంతం మాత్రమే కాదు, భారతదేశానికి తల భాగం. తల ఉన్నతంగా ఉంటే అది అభివృద్ధికి, గౌరవానికి చిహ్నం. అందుకే, వికసిత్‌ భారత్‌కు వికసిత్‌ జమ్ము&కశ్మీర్‌ అత్యంత కీలకం" అని అన్నారు.

దేశంలో అమలయ్యే చట్టాలను జమ్ముకశ్మీర్‌లో అమలు చేయలేకపోయిన సమయాన్ని, పేదలకు అందని సంక్షేమ పథకాల గురించి ప్రధాని గుర్తు చేశారు. ఇప్పుడు వచ్చిన కొత్త మార్పులను ప్రస్తావిస్తూ, ఈ రోజు మొత్తం దేశానికి సంబంధించిన ప్రణాళికలు శ్రీనగర్ నుంచి ప్రారంభమ్యయ్యాయని చెప్పారు. పర్యాటక రంగంలో, జమ్ముకశ్మీర్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. అందువల్లే, భారతదేశంలోని 50కి పైగా ప్రాంతాల ప్రజలు ఈ సభలో పాల్గొన్నారని వెల్లడించారు. స్వదేశ్ దర్శన్ యోజన కింద ఈ రోజు దేశానికి అంకితం చేసిన ఆరు ప్రాజెక్టులు, వాటి తదుపరి దశ ప్రారంభం గురించి శ్రీ మోదీ మాట్లాడారు. శ్రీనగర్‌ సహా దేశంలోని వివిధ నగరాల కోసం దాదాపు 30 ప్రాజెక్టులు ప్రారంభించామని, ప్రసాద్ యోజన కింద 3 ప్రాజెక్టులు ప్రారంభించామని, 14 ఇతర ప్రాజెక్టులు ప్రారంభించామని వివరించారు. పవిత్ర హజరత్‌బాల్‌ దర్గాలో ప్రజల సౌకర్యార్థం జరుగుతున్న అభివృద్ధి పనులు కూడా పూర్తి చేశామన్నారు. 'దేఖో అప్నా దేశ్ పీపుల్స్ ఛాయిస్' ప్రచారం గురించి ప్రధాని మాట్లాడారు. ఇందులో, వచ్చే రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం 40 ప్రదేశాలను పర్యాటక ప్రాంతాలుగా గుర్తిస్తుందని చెప్పారు. ప్రజాభిప్రాయం ఆధారంగా, ప్రజలు అత్యంత ఇష్టపడే పర్యాటక ప్రాంతాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంద్ననారు. ప్రవాస భారతీయులను భారత్‌కు వచ్చేలా ప్రోత్సహించేందుకు 'చలో ఇండియా' ప్రచారాన్ని కూడా శ్రీ మోదీ ప్రస్తావించారు. జమ్ముకశ్మీర్‌ ప్రాంతంలో పర్యాటక పరిశ్రమ అభివృద్ధికి, కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయని ప్రధాన మంత్రి చెప్పారు.

"ఉద్దేశాలు ఉదాత్తమైనవి అయినప్పుడు, కట్టుబాట్లను నెరవేర్చాలనే దృఢ సంకల్పం ఉన్నప్పుడు ఫలితాలు తప్పకుండా వస్తాయి" అని ప్రధాన మంత్రి చెప్పారు. జమ్ముకశ్మీర్‌లో జీ20 సదస్సు విజయవంతంగా నిర్వహించడాన్ని ఆయన గుర్తు చేశారు.

పర్యాటక రంగంలో వచ్చిన పరివర్తనాత్మక వృద్ధిని ప్రస్తావిస్తూ, "పర్యాటకం కోసం జమ్ముకశ్మీర్‌కు ఎవరు వస్తారని ప్రజలు ప్రశ్నించిన సమయం ఒకప్పుడు ఉంది. ఇప్పుడు, జమ్ముకశ్మీర్ అన్ని పర్యాటక రికార్డులను బద్దలు కొడుతోంది. 2023లోనే జమ్ముకశ్మీర్‌ 2 కోట్లకు పైగా పర్యాటకులను స్వాగతించింది, గత రికార్డును అధిగమించింది. గత పదేళ్లలో అమర్‌నాథ్ యాత్రకు అత్యధిక సంఖ్యలో యాత్రికులు తరలివచ్చారు, వైష్ణోదేవికి కూడా భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పుడు సుప్రసిద్ధ వ్యక్తులు, విదేశీ అతిథులు కూడా జమ్ముకశ్మీర్ లోయలను పరిశోధించడానికి, వీడియోలు & రీల్స్ చేయడానికి వస్తున్నారు" అని ప్రధాన మంత్రి చెప్పారు.

వ్యవసాయ రంగంపై మాట్లాడిన శ్రీ మోదీ, జమ్ముకశ్మీర్‌ ప్రత్యేకమైన కుంకుమ పువ్వు, ఆపిల్స్, డ్రై ఫ్రూట్స్, చెర్రీలు సహా వ్యవసాయ ఉత్పత్తుల బలగాన్ని వివరించారు. ఈ ప్రాంతం ఒక ముఖ్యమైన వ్యవసాయ కేంద్రం అన్నారు. రూ.5,000 కోట్లతో చేపట్టిన సమగ్ర వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమం, వచ్చే ఐదేళ్లలో జమ్మూకశ్మీర్‌ వ్యవసాయ రంగంలో అపూర్వమైన అభివృద్ధిని తీసుకువస్తుందని, తోటల పెంపకం & పశువుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతుందని చెప్పారు. "ఈ చొరవ, ముఖ్యంగా ఉద్యానవనాలు & పశు సంవర్ధక రంగాల్లో వేలాది కొత్త అవకాశాలను సృష్టిస్తుంది" అని ప్రధాని అన్నారు.

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా జమ్ముకశ్మీర్‌ రైతుల ఖాతాల్లోకి దాదాపు రూ. 3,000 కోట్లను నేరుగా బదిలీ చేశామని ప్రధాని చెప్పారు. పండ్లు & కూరగాయల నిల్వ సామర్థ్యాన్ని పెంచడానికి, దీర్ఘకాలం పాటు పాడైపోకుండా ఉండేలా చూసేందుకు జమ్ముకశ్మీర్‌లో గిడ్డంగి సౌకర్యాలను పెంచడానికి భారీ పెట్టుబడులు వచ్చాయన్నారు. జమ్ముకశ్మీర్‌లో భారీ సంఖ్యలో గిడ్డంగుల నిర్మాణాలు 'ప్రపంచంలోనే అతి పెద్ద గిడ్డంగుల పథకం'లో భాగంగా ఉన్నాయని కూడా ప్రధాన మంత్రి వెల్లడించారు.

జమ్ముకశ్మీర్‌లో వేగవంతమైన అభివృద్ధిని ప్రస్తావించిన శ్రీ మోదీ, ఎయిమ్స్‌ జమ్ము ఇప్పటికే ప్రారంభమైందని, ఎయిమ్స్‌ కశ్మీర్ పురోగతిలో ఉందని చెప్పారు. ఈ ప్రాంతంలో ఏర్పాటైన 7 కొత్త వైద్య కళాశాలలు, 2 క్యాన్సర్ ఆసుపత్రులు, ఐఐటీ, ఐఐఎం వంటివాటి గురించి మాట్లాడారు. జమ్ముకశ్మీర్‌లో 2 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయని, శ్రీనగర్ నుంచి సంగల్దాన్, సంగల్దాన్ నుంచి బారాముల్ వరకు రైలు సేవలు ప్రారంభమయ్యాయని వివరించారు. దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయన్నారు. జమ్ము, శ్రీనగర్‌ను స్మార్ట్ సిటీలుగా మార్చే కొత్త ప్రాజెక్టులపై మాట్లాడుతూ, "జమ్ముకశ్మీర్‌ విజయగాథ భవిష్యత్తులో ప్రపంచం మొత్తానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది" అని ప్రధాని అన్నారు.

ఈ ప్రాంతంలోని హస్తకళలు, పరిశుభ్రతను 'మన్ కీ బాత్' కార్యక్రమంలో చెప్పానని గుర్తు చేసిన ప్రధాని, కమలంతో జమ్ముకశ్మీర్ అనుబంధాన్ని మరోమారు ప్రస్తావించారు.

జమ్ముకశ్మీర్‌ యువత కోసం ప్రతి రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి గురించిన మాట్లాడిని శ్రీ మోదీ, నైపుణ్యాభివృద్ధి నుంచి క్రీడల వరకు కొత్త అవకాశాల సృష్టి జరుగుతోంది, జమ్ముకశ్మీర్‌లోని ప్రతి జిల్లాలో ఆధునిక క్రీడా సౌకర్యాలు వస్తున్నాయని వెల్లడించారు. జమ్ము, కాశ్మీర్‌లోని 17 జిల్లాల్లో నిర్మించిన మల్టీపర్పస్‌ ఇండోర్ స్పోర్ట్స్ హాళ్లను ఉదాహరణగా చెప్పారు. అవి అనేక జాతీయ క్రీడాపోటీలకు ఆతిథ్యం ఇచ్చాయన్నారు. "జమ్ముకశ్మీర్ ఇప్పుడు దేశానికి శీతాకాలపు క్రీడా రాజధానిగా అవతరిస్తోంది. ఇటీవల జరిగిన ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌లో సుమారు 1000 మంది క్రీడాకారులు పాల్గొన్నారు" అని ప్రధాన మంత్రి తెలిపారు.

"జమ్ముకశ్మీర్‌ ఈరోజు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటూ కొత్త శిఖరాలకు చేరుకుంటోంది" అని ప్రధాని అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్ల ఈ ప్రాంత యువకుల ప్రతిభకు గౌరవం దక్కిందని, అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు వచ్చాయని ప్రధాని చెప్పారు. పాకిస్థాన్ నుంచి వస్తున్న శరణార్థులు, వాల్మీకి సామాజికవర్గం & పారిశుధ్య కార్మికులకు ఓటు హక్కు కల్పన, ఎస్సీ కేటగిరీలో కలపాలన్న వాల్మీకి సంఘం డిమాండ్‌, షెడ్యూల్డ్ తెగలు, పద్దరి తెగకు శాసనసభ స్థానాల రిజర్వేషన్‌, పద్దరి తెగ, పహారీ జాతి, గడ్డ బ్రాహ్మణ, కోలీ వర్గాలను షెడ్యూల్డ్ తెగల్లో చేర్చడం గురించి మాట్లాడారు. జమ్ముకశ్మీర్‌ రాజవంశ రాజకీయాల వల్ల పంచాయితీలు, మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్లలో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ హక్కును లేకుండా పోయిందని ప్రధాన మంత్రి విమర్శించారు. "ఈ రోజు ప్రతి వర్గానికి హక్కులు తిరిగి ఇచ్చాం" అని ప్రధాని మోదీ చెప్పారు.

జమ్ముకశ్మీర్ బ్యాంక్‌ దుర్వినియోగం గురించి మాట్లాడిన ప్రధాని, వంశపారంపర్య రాజకీయాలు, అవినీతికి అది బాధితురాలిగా మారిందని అభివర్ణించారు. బ్యాంకును పునరుద్ధరించడానికి చేపట్టిన సంస్కరణల గురించి ప్రధాన మంత్రి వివరించారు. బ్యాంకుకు రూ.1000 కోట్ల సాయం, అక్రమ నియామకాలపై చర్యల గురించి చెప్పారు. ఇలాంటి వేలాది నియామకాలపై అవినీతి నిరోధక శాఖ ఇంకా విచారణ జరుపుతోందన్నారు. గత ఐదేళ్లలో జరిగిన పారదర్శక నియామకాలను ఆయన హైలైట్ చేశారు. దీని కారణంగా జే&కే బ్యాంక్ లాభం రూ. 1700 కోట్లకు చేరుకుందని, వ్యాపారం 5 సంవత్సరాల క్రితం నాటి రూ.1.25 కోట్ల నుంచి ఇప్పుడు రూ. 2.25 లక్షల కోట్లకు చేరుకుందన్నారు. డిపాజిట్లు కూడా రూ.80,000 కోట్ల నుంచి రూ.1.25 లక్షల కోట్లకు పెరిగాయన్నారు. ఐదేళ్ల క్రితం 11 శాతం దాటిన ఎన్‌పీఏలు ఇప్పుడు 5 శాతం దిగువకు తగ్గాయని. 5 ఏళ్ల క్రితం రూ.12గా ఉన్న బ్యాంక్ షేర్ 12 రెట్లు పెరిగి దాదాపు రూ.140కి చేరుకుందన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఉండే నిజాయితీ గల ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రజలు ప్రతి కష్టం నుంచి గట్టెక్కుతారని ప్రధాని మోదీ అన్నారు.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి వంశపారంపర్య రాజకీయాలకు అతి పెద్ద బాధితురాలిగా జమ్ముకశ్మీర్ మారిందని ప్రస్తావిస్తూ, ఈ ప్రాంతం కోసం చేపట్టిన అభివృద్ధి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని, రాబోయే 5 సంవత్సరాలలో ఈ ప్రాంతం ఇంకా వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రధాని ప్రజలకు హామీ ఇచ్చారు.

యావత్ జాతికి పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. "రంజాన్ మాసం నుంచి ప్రతి ఒక్కరు శాంతి, సామరస్య సందేశాన్ని పొందాలని నా కోరిక. రేపు మహాశివరాత్రి. ప్రతి ఒక్కరికీ ఈ పవిత్ర పండుగ శుభాకాంక్షలు." ప్రధాని మోదీ చివరిగా చెప్పారు.

జమ్ముకశ్మీర్‌ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

నేపథ్యం

జమ్ముకశ్మీర్ వ్యవసాయ-ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ప్రోత్సాహం ఇచ్చే ప్రయత్నంలో భాగంగా, 'హోలిస్టిక్ అగ్రికల్చర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్'ను (హెచ్‌ఏడీపీ) ప్రధాన మంత్రి దేశానికి అంకితం చేశారు. జమ్ముకశ్మీర్‌ వ్యవసాయ-ఆర్థిక వ్యవస్థలోని మూడు ప్రధాన రంగాలు ఉద్యానవన, వ్యవసాయం, పశు సంవర్ధక కార్యకలాపాలకు పూర్తిగా మద్దతుగా నిలిచే ఒక సమగ్ర కార్యక్రమం హెచ్‌ఏడీపీ. ఈ కార్యక్రమం, ప్రత్యేక దక్ష్ కిసాన్ పోర్టల్ ద్వారా దాదాపు 2.5 లక్షల మంది రైతులకు నైపుణ్యాభివృద్ధిని అందిస్తుంది. దాదాపు 2000 కిసాన్ ఖిద్మత్ ఘర్‌లను ఏర్పాటు చేస్తారు. జమ్ముకశ్మీర్‌లోని లక్షలాది వ్యవసాయ అనుబంధ కుటుంబాలకు ఉపాధి లభిస్తుంది, ప్రయోజనం పొందుతారు.

ఈ ప్రాంతంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను నిర్మించడం ద్వారా తీర్థయాత్ర & పర్యాటక ప్రదేశాలను సందర్శించే పర్యాటకులు, యాత్రికుల అనుభవాన్ని పెంచాలన్నది ప్రధాన మంత్రి దృక్పథం. ఈ ప్రకారం, ప్రధాని దేశానికి అంకితం చేసిన రూ.1400 కోట్ల స్వదేశ్ దర్శన్, ప్రసాద్ యోజన కింద వివిధ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ప్రధానమంత్రి ఆవిష్కరించిన ప్రాజెక్టుల్లో, శ్రీనగర్‌లోని 'ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హజరత్‌బాల్ ష్రైన్‌' అభివృద్ధి; మేఘాలయలో ఈశాన్య సర్క్యూట్ అభివృద్ధి, బిహార్ & రాజస్థాన్‌లో ఆధ్యాత్మిక సర్క్యూట్‌లు; బీహార్‌లోని గ్రామీణ & తీర్థంకర్ సర్క్యూట్‌లు; తెలంగాణలోని జోగులాంబ దేవి ఆలయ అభివృద్ధి; మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంటక్ ఆలయ అభివృద్ధి కోసం పర్యాటక సౌకర్యాలు వంటివి ఉన్నాయి.

దేశవ్యాప్తంగా వివిధ రకాల పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసే 43 ప్రాజెక్టులను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలోని అన్నవరం దేవాలయం; తమిళనాడులోని తంజావూరు & మైలాడుతురై జిల్లాలు, పుదుచ్చేరిలోని కారైకల్ జిల్లాలోని నవగ్రహ దేవాలయాలు; కర్ణాటక మైసూర్‌ జిల్లాలోని శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయం; రాజస్థాన్‌ బికనీర్‌ జిల్లాలోని కర్ణి మాత ఆలయం;  హిమాచల్ ప్రదేశ్‌ ఉనా జిల్లాలోని మా చింతపూర్ణి ఆలయం; గోవాలోని బోమ్ జీసస్ చర్చి వంటి కీలక ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని మెచుకా అడ్వెంచర్ పార్క్; తెలంగాణలోని అనంతగిరి అడవులు; ఉత్తరాఖండ్ ఎకోటూరిజం జోన్‌లోని గంగి, పితోర్‌ఘర్‌లోని గ్రామీణ పర్యాటక సమూహాల అనుభవం; సోహ్రా, మేఘాలయలో గుహలు & జలపాతం; అసోంలోని సినిమారా టీ ఎస్టేట్; పంజాబ్‌ కపుర్తలాలోని కంజలి చిత్తడి నేలల్లో పర్యావరణ పర్యాటక అనుభవం; లేహ్‌లోని జీవ వైవిధ్య పార్కు వంటి అనేక ఇతర గమ్యస్థానాలు, మెరుగైన అనుభవ కేంద్రాల అభివృద్ధి కూడా ఇందులో భాగమైన ఉన్నాయి.

'ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్‌మెంట్' (సీబీడీడీ) పథకం కింద ఎంపిక చేసిన 42 పర్యాటక ప్రాంతాలను ప్రధాని ప్రకటించారు. కేంద్ర బడ్జెట్ 2023-24లో ప్రకటించిన ఈ పథకం ద్వారా పర్యాటక ప్రాంతాల అభివృద్ధితో పాటు పర్యాటక రంగంలో పోటీతత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా మెరుగైన పర్యాటక అనుభవాలను అందించడం లక్ష్యం. ఈ 42 ప్రదేశాలను నాలుగు కేటగిరీల్లో గుర్తించారు. వాటిలో 16 సంస్కృతి & వారసత్వ ప్రాంతాలు, 11 ఆధ్యాత్మిక ప్రదేశాలు, 10 పర్యావరణ పర్యాటక ప్రాంతాలు, 10 అమృత్ హెరిటేజ్, 5 వైబ్రెంట్ విలేజ్‌లో ఉన్నాయి.

'దేఖో అప్నా దేశ్ పీపుల్స్ ఛాయిస్ 2024' రూపంలో, పర్యాటక రంగంలో దేశ ప్రజల నాడిని గుర్తించే మొట్టమొదటి దేశవ్యాప్త చొరవను ప్రధాని ప్రారంభించారు. దేశవ్యాప్త సర్వే ద్వారా అత్యంత ప్రాధాన్యత పర్యాటక ప్రాంతాలను గుర్తించడం, 5 పర్యాటక వర్గాల్లో ‍‌(ఆధ్యాత్మికం, సాంస్కృతికం & వారసత్వం, పర్యావరణం & అటవీ, సాహసం, ఇతర వర్గం) ప్రజలతో మమేకం కావడం దీని లక్ష్యం. నాలుగు ప్రధాన కేటగిరీలు కాకుండా ఒక 'ఇతర' వర్గం ఉంది. ప్రజలు తమకు ఇష్టమైన వాటికి ఓటు వేయవచ్చు. తద్వారా, ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టని పర్యాటక ఆకర్షణలను వెలికితీయడంలో సాయపడవచ్చు. మైగవ్‌ వేదిక ద్వారా ఓటింగ్‌ జరుగుతుంది.

ప్రవాస భారతీయులను 'ఇన్‌క్రెడిబుల్ ఇండియా అంబాసిడర్‌'లుగా మార్చేందుకు, భారతదేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించిన 'చలో ఇండియా గ్లోబల్ డయాస్పొర అభియాన్'ను కూడా ప్రధాని ప్రారంభించారు. ప్రధాని ఇచ్చిన పిలుపు ఆధారంగా ఈ ప్రచారం ప్రారంభమైంది. ప్రతి వ్యక్తి, కనీసం ఐదుగురు భారతీయేతర స్నేహితులు భారతదేశాన్ని సందర్శించేలా ప్రోత్సహించాలని ప్రధాని అభ్యర్థించారు. విదేశాల్లో నివశిస్తున్న 3 కోట్ల మంది భారతీయులు చేయి చేయి కలిపితే, భారతీయ పర్యాటకానికి శక్తివంతమైన ఉత్ప్రేరకం లభిస్తుంది. 

***


(Release ID: 2012399) Visitor Counter : 128