వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

భారత ఆహార సంస్థ అధీకృత మూలధనాన్ని 11,000 కోట్ల రూపాయల నుంచి 21,000 కోట్ల రూపాయలకు పెంచి వ్యవసాయ రంగానికి మరింత ప్రోత్సాహం అందించిన కేంద్ర ప్రభుత్వం

Posted On: 17 FEB 2024 1:14PM by PIB Hyderabad

వ్యవసాయ రంగానికి మరింత ప్రోత్సాహం అందించి, రైతు సంక్షేమం లక్ష్యంగా భారత ఆహార సంస్థ అధీకృత మూలధనాన్ని 11,000  కోట్ల రూపాయల నుంచి 21,000 కోట్ల రూపాయలకు  పెంచాలని కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం  తీసుకుంది. భారత ఆహార సంస్థ అధీకృత మూలధనాన్ని ఎక్కువ చేసి రైతు సంక్షేమం పట్ల తన నిబద్ధత చాటుకున్న కేంద్ర ప్రభుత్వం భారత వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కోసం మరో అడుగు ముందుకు వేసింది. 

భారత ఆహార భద్రత రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న భారత ఆహార సంస్థ ఆహార ధాన్యాల సేకరణ కోసం కనీస మద్దతు ధర చెల్లించడం, దేశ అవసరాలకు అవసరమైన ఆహారధాన్యాలు నిల్వ చేయడం,రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు ఆహార ధాన్యాలు సరఫరా చేయడం, మార్కెట్లో ఆహార ధాన్యాల ధరల స్థిరీకరణ కు చర్యలు అమలు చేయడం లాంటి ముఖ్యమైన కార్యక్రమాలు అమలు చేస్తోంది. 

అధీకృత మూలధనం పెరగడం వల్ల కార్యక్రమాలను  మరింత పటిష్టంగా అమలు చేయడానికి భారత ఆహార సంస్థకు తగిన నిధులు అందుబాటులోకి వస్తాయి. నగదు రుణాలు, స్వల్పకాలిక రుణాలు లాంటి మార్గాల ద్వారా భారత ఆహార సంస్థ అవసరమైన నిధులు సమకూర్చుకుంటుంది. అధీకృత మూలధనం పెరగడం వల్ల భారత ఆహార సంస్థపై వడ్డీ భారం తగ్గుంతుంది. దీనివల్ల ఖర్చు త\తగ్గుతుంది. సబ్సిడీ అంశంపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. అదనపు మూలధనం అందుబాటులోకి రావడంతో గిడ్డంగుల ఆధునీకరణ, రవాణా వ్యవస్థను మెరుగుపరచడం, ఆధునిక సాంకేతిక విధానాలు అమలు చేయడానికి భారత ఆహార సంస్థకు అవకాశం కలుగుతుంది. ఈ చర్యల వల్ల ఆహార ధానయాల వృధా తగ్గడమే కాకుండా వినియోగదారులకు మరింత సమర్థంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేయడానికి వీలు కలుగుతుంది. 

మూలధన అవసరాలు, మూలధన ఆస్తులు అభివృద్ధి చేయడానికి భారత ఆహార సంస్థకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన నిధులు సమకూరుస్తోంది. సమగ్ర ఐటీ వ్యవస్థ అభివృద్ధి, ప్రస్తుతం పనిచేస్తున్న అంతర్గత వ్యవస్థలు (ఎఫ్ఏపీ,హెచ్ ఆర్ ఎం ఎస్), బాహ్య వ్యవస్థలు ( రాష్ట్రాల సేకరణ పోర్టల్ , సిడబ్ల్యుసి, ఎస్ డబ్లుసి)లాంటి అభివృద్ధి కారయ్కర్మాలు అమలు చేయడానికి భారత ఆహార సంస్థ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ-కార్యాలయ వ్యవస్థ పని చేయడం ప్రారంభించడంతో భారత ఆహార సంస్థలో కార్యకలాపాలు కాగిత రహితంగా జరుగుతున్నాయి. భారత ఆహార సంస్థ కార్యకలాపాల్లో కీలకంగా మారిన ఐటీ వ్యవస్థ ఆధునీకరణ వల్ల ఏకగవాక్ష విధానంలో సమాచారం అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల సంస్థ కార్యకలాపాలు మరింత సమర్థంగా, పటిష్టంగా  అమలు చేయడానికి వీలవుతుంది. 

కార్యకలాపాలను మరింత సమర్థంగా, పటిష్టంగా నిర్వహించడానికి సిమెంట్ రోడ్ల నిర్మాణం,పై కప్పుల నిర్వహణ , వెలుతురు, తూనిక యంత్రాల ఆధునీకరణ లాంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ఆహార భద్రత కల్పించడానికి కృషి చేస్తోంది. క్యూ సి పరిశోధన శాలలకు ఆధునిక పరికరాలు, సాఫ్ట్ వెర్ అభివృద్ధి చేయడం ద్వారా నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని భారత ఆహార సంస్థ నిర్ణయించింది. నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఆహార భద్రత కల్పించడానికి భారత ఆహార సంస్థ " అవుట్-టర్న్ రేషియో" "షెల్ఫ్ లైఫ్" " బియ్యంలో పురుగుల నివారణ" అంశాలపై అధ్యయనాలు నిర్వహించింది. డిజిటల్ పరికరాల వినియోగం వల్ల భారత ఆహార సంస్థలో మానవరహిత కార్యకలాపాలు ఎక్కువ అవుతాయి. దీనివల్ల సేకరణ వేగంగా జరుగుతుంది. అనవసర వ్యయం తగ్గడంతో సిబ్బంది వేతనాల భారం, అద్దె భారం తగ్గుతుంది. మిగులు నిధులతో అదనపు ఆస్తులు అభివృద్ధి చేయడానికి సంస్థ కృషి చేస్తుంది. 

ఆహార ధాన్యాలకు కనీస మద్దతు ధర చెల్లించడంతో పాటు భారత ఆహార సంస్థ పని తీరు మరింత మెరుగుపరచడానికి నిధులు సమకూరుస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతులకు సాధికారత కల్పించి, భారత వ్యవసాయ రంగం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ దేశ ప్రజలకు ఆహార భద్రత కల్పించడానికి బహుముఖ వ్యూహం అమలు చేస్తోంది. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలు  వ్యవసాయ రంగానికి ఉజ్వల భవిష్యత్తు అందించి రైతులకు అనేక విధాలుగా ప్రయోజనం కలిగిస్తాయి. 

ఆహార భద్రత కల్పించే అంశంలో భారత ఆహార సంస్థ పాత్ర కీలకమని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తరచూ సమీక్షలు నిర్వహించి ఆహార ధాన్యాల నిల్వ, సెంట్రల్ పూల్, రాష్ట్రాలకు సరఫరా చేయాల్సిన ఆహార ధాన్యాలపై మార్గదర్శకాలు జారీ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, సూచనలు అమలు చేస్తున్న భారత ఆహార సంస్థ దేశంలో ఆహార రంగంలో సమస్యలు తలెత్తకుండా చూసేందుకు అవసరమైన చర్యలు అమలు చేస్తోంది. 

 

***



(Release ID: 2007018) Visitor Counter : 165