ప్రధాన మంత్రి కార్యాలయం

మహర్షి దయానంద సరస్వతి 200వ జయంతి కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం


‘‘మన సాంప్రదాయిక, ఆధ్యాత్మిక విలువలు కనుమరుగవుతున్న తరుణంలో ‘‘వేదాల వైపు వెనక్కి వెళ్లాలి’’ అని పిలుపు ఇచ్చిన స్వామి దయానంద

‘‘స్వామి దయానంద వేద రుషి మాత్రమే కాదు, జాతీయ రుషి’’

‘‘భారతదేశం గురించి స్వామీజీకి గత విశ్వాసాన్ని ఆసరా చేసుకుని మనం ఆ విశ్వాసాన్ని అమృత కాలంలో ఆత్మ-విశ్వాసంగా మార్చుకోవాలి’’

‘‘నిజాయతీతో కూడిన ప్రయత్నాలు, కొత్త విధానాల ద్వారా జాతి తన కుమార్తెల పురోగతికి సహాయపడుతోంది’’

Posted On: 11 FEB 2024 12:32PM by PIB Hyderabad

గుజరాత్ లోని స్వామి దయానంద జన్మస్థలం మోర్బి సమీపంలోని టంకారాలో నిర్వహించిన స్వామి దయానంద సరస్వతి 200వ జయంతి వేడుకలనుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో సందేశం  ద్వారా ప్రసంగించారు.

సమాజానికి స్వామీజీ  సేవలకు గౌరవపూర్వకంగా, ఆయన సందేశాన్ని ప్రజలందరికీ చేర్చడం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఆర్య సమాజ్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం ప్రకటించారు. ‘‘అలాంటి మహోన్నతులు అందించిన సేవలు అసాధారణమైనవైనప్పుడు దానికి సంబంధించిన వేడుకలు కూడా అంతే విస్తారంగా ఉండాలి’’ అని గత ఏడాది కార్యక్రమాల ప్రారంభ సమయంలో తాను పాల్గొనడాన్ని గుర్తు చేసుకుంటూ అన్నారు.

‘‘మన కొత్త తరానికి మహర్షి దయానంద బోధనలు తెలిసేలా చేసేందుకు సమర్థవంతమైన సాధనంగా ఈ కార్యక్రమం నిలుస్తుందన్న విశ్వాసం నాకుంది’’ అన్నారు. అటువంటి అద్భుతమైన వ్యక్తుల వారసత్వాన్ని దిగువ తరాలకు అందించాల్సిన ప్రాధాన్యత ఎంతైనా ఉన్నదని ప్రధానమంత్రి శ్రీ మోదీ నొక్కి చెప్పారు.

స్వామి దయానంద గుజరాత్ లో జన్మించి  హర్యానాలో క్రియాశీలంగా పని చేశారని ప్రధానమంత్రి శ్రీ మోదీ తెలిపారు. రెండు ప్రాంతాలకు మధ్య గల అనుసంధానతను కూడా ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావిస్తూ స్వామి దయానంద ప్రభావం తన జీవితంపై ఎంతో ఉన్నదని చెప్పారు. ‘‘ఆయన బోధనలు నా వైఖరిని తీర్చి దిద్దాయి, ఆయన వారసత్వం నా జీవనయానంలో అంతర్భాగం’’ అన్నారు. స్వామీజీ జయంతి సందర్భంగా దేశవిదేశాల్లోని కోట్లాది మంది ఆయన అనుచరులకు  శుభాకాంక్షలు తెలియచేశారు.

స్వామి దయానంద పరివర్తిత ప్రభావం గురించి ప్రస్తావిస్తూ ‘‘భవిష్యత్తు గతిని తిప్పే సంఘటనలు చరిత్రలో అప్పుడప్పుడూ సంభవిస్తూ ఉంటాయి. రెండు వందల సంవత్సరాల క్రితం వచ్చిన అలాంటి అరుదైన సంఘటనే స్వామి దయానంద జననం’’ అని ప్రధానమంత్రి శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. అజ్ఞానం, మూఢనమ్మకాల బంధనాల నుంచి సమాజాన్ని చైతన్యవంతం చేసి ఆ దుస్థితి నుంచి విముక్తం చేసేందుకు వేదిక జ్ఞానాన్ని పునరుజ్జింపచేసే దిశగా స్వామి పోషించిన పాత్రను ఆయన ప్రత్యేకంగా నొక్కి చెప్పారు.  ‘‘మన సాంప్రదాయాలు, ఆధ్యాత్మికత కనుమరుగవుతున్న సమయంలో స్వామి దయానంద తన పాండిత్యంతో వేదాలపై వ్యాఖ్యలు చేస్తూ వాటి హేతుబద్దత గురించి వివరిస్తూ సమాజాన్ని ‘‘తిరిగి వేదాల వైపు’’ నడిపించారని ప్రధానమంత్రి అన్నారు.  సామాజిక దురాగతాలను స్వామీజీ నిర్భీతిగా ఖండించే వారని, భారత తత్వశాస్ర్తంపై ఆయన కల్పించిన చైతన్యం ఆత్మ-విశ్వాసాన్ని ఉద్దీపింపచేసిందని చెప్పారు. సమాజంలో ఐక్యత సాధించడం, ప్రాచీన భారత వారసత్వం పట్ల గర్వపడే భావాన్ని నెలకొల్పడంలో స్వామి దయానంద బోధనల ప్రాధాన్యత ఎంతైనా ఉన్నదని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

‘‘మన సమాజంలోని మూఢవిశ్వాసాలు బ్రిటిష్  ప్రభుత్వం మనని అల్పులుగా చిత్రీకరించేందుకు దోహదపడ్డాయి. సామాజిక మార్పును సాకుగా చూపి కొందరు బ్రిటిష్ పాలను సమర్థించేందుకు ప్రయత్నించారు. స్వామి దయానంద అవతరణ అలాంటి కుట్రలన్నింటికీ కోలుకోలేని దెబ్బ తీసింది’’ అని పిఎం శ్రీ మోదీ చెప్పారు. ‘‘ఆర్య సమాజ ప్రభావంతో లాలా లజపతిరాయ్, రామ్ ప్రసాద్ బిస్మిల్, స్వామి శ్రద్ధానంద వంటి ఎందరో విప్లవకారులు తయారయ్యారు. ఆ రకంగా దయానందజీ ఒక వేద రుషి మాత్రమే కాదు, ఒక జాతీయ రుషి’’ అని ప్రధానమంత్రి అన్నారు.

స్వామి దయానంద 200వ జయంతి అమృత కాల ప్రారంభ సంవత్సరాల్లో వచ్చిందంటూ జాతి సముజ్వల భవిష్యత్తును స్వామి దయానంద ఆకాంక్షించారని ప్రధానమంత్రి శ్రీ మోదీ గుర్తు చేశారు. ‘‘స్వామీజీకి భారతదేశం పట్ల ఎనలేని నమ్మకం ఉండేది. ఆ నమ్మకాన్ని ఈ అమృత కాలంలో మనం ఆత్మవిశ్వాసంగా మార్చుకోవాలి. స్వామి దయానంద ఆధునికతకు మద్దతుదారు, మార్గదర్శి’’ అని ప్రధానమంత్రి చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఆర్య సమాజ్ సంస్థల నెట్ వర్క్ గురించి ప్రస్తావిస్తూ ‘‘2500 పైబడిన పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, 400 పైగా గురుకులాలు విద్యార్థులకు విద్యను బోధిస్తున్నాయి. ఆధునికత, మార్గదర్శకతకు శక్తివంతమైన చిత్రం ఆర్య సమాజం’’ అని ప్రధానమంత్రి శ్రీ మోదీ అన్నారు. 21వ శతాబ్దిలో మరింత ఉత్సాహంగా జాతి నిర్మాణ బాధ్యతను చేపట్టాలని ఆయన సమాజాన్ని అభ్యర్థించారు. డిఏవి విద్యా సంస్థలు స్వామీజీ సజీవ చిహ్నాలంటూ వాటిని నిరంతరం సాధికారం చేస్తూ ఉంటామని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు.

జాతీయ విద్యా విధానం స్వామీజీ దార్శనికతను మరింత ముందుకు నడిపిస్తుంది అని ప్రధానమంత్రి చెప్పారు. స్థానికం కోసం నినాదం, ఆత్మనిర్భర్  భారత్, మిషన్ లైఫ్, జల సంరక్షణ, స్వచ్ఛ భారత్, క్రీడలు, ఫిట్ నెస్  వంటి కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని ఆర్యసమాజ్  కు చెందిన విద్యార్థులు, సంస్థలకు ఆయన విజ్ఞప్తి చేశారు. తొలిసారి ఓటింగ్  హక్కు పొందుతున్న వారు తమ బాధ్యతలను అర్ధం చేసుకోవాలని ఆయన సూచించారు.  

రాబోయే ఆర్య సమాజ్  150వ వార్షికోత్సవ వేడుకలను సంఘటిత పురోగతికి, అవగాహనకు  ఒక మంచి అవకాశంగా ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన పిలుపు ఇచ్చారు.

ప్ర‌కృతి  వ్యవసాయం ప్రాధాన్యతను, ఇందుకోసం ఆచార్య దేవరాట్  జీ చేస్తున్న కృషిని ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ ‘‘స్వామి దయానంద జీ జన్మస్థలం నుంచే ప్ర‌కృతి  వ్యవసాయ సందేశం ప్రతీ ఒక్క రైతుకు చేరేలా చూడాలి’’ అని సూచించారు.

స్వామి దయానంద మహిళల హక్కులకు కూడా గట్టి మద్దతుదారు అని పేర్కొంటూ ఇటీవల తాము తీసుకువచ్చిన నారీ శక్తి వందన్ అధినియమ్ గురించి ప్రస్తావించారు. ‘‘నిజాయతీతో కూడిన కృషి, కొత్త విధానాల ద్వారా జాతి తన కుమార్తెల పురోగతికి బాటలు వేస్తోంది’’ అని చెప్పారు. సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజలందరినీ అనుసంధానం చేయడమే మహర్షి దయానందకు అసలైన నివాళి అని ఆయన నొక్కి చెప్పారు.

కొత్తగా ఏర్పాటైన యువజన  సంఘం మై-భారత్ లో సభ్యులు కావాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని ముగిస్తూ డిఏవి నెట్ వర్క్ యువతకు పిలుపు ఇచ్చారు. ‘‘డిఏవి విద్యాసంస్థల నెట్ వర్క్ విద్యార్థులందరూ మై భారత్  నెట్ వర్క్ లో చేరేలా స్వామీజీ అనుచరులందరూ ప్రోత్సహించాలని నేను కోరుతున్నాను’’ అన్న పిలుపుతో ఆయన తన ప్రసంగం ముగించారు.  

***

DS/TS



(Release ID: 2005503) Visitor Counter : 60