రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న సాయుధ దళాల మహిళా అధికారులు


రియాద్ లో జరిగిన వరల్డ్ డిఫెన్స్ షో 2024లో పాల్గొన్నస్క్వాడ్రన్ లీడర్ భవనా కాంత్, కల్నల్ పొనుంగ్ డోమింగ్, లెఫ్టినెంట్ కమాండర్ అన్ను ప్రకాష్

Posted On: 08 FEB 2024 10:13AM by PIB Hyderabad

 రియాద్‌లో జరుగుతున్న వరల్డ్ డిఫెన్స్ షో (WDS) 2024 లో భారతదేశం నుంచి త్రివిధ దళాలకు చెందిన  మహిళా అధికారులు పాల్గొంటున్నారు. అన్ని రంగాల్లో మహిళలకు సమాన ప్రాతినిధ్యం ఉండాలి అన్న   ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలో భాగంగా త్రివిధ దళాల్లో మహిళా సిబ్బంది, అధికారుల సంఖ్య పెరిగింది.  రియాద్‌లో జరుగుతున్న వరల్డ్ డిఫెన్స్ షో లో  భాగంగా నిర్వహిస్తున్న వివిధ సదస్సుల్లో  భారత సాయుధ దళాలకు చెందిన  స్క్వాడ్రన్ లీడర్ భావన కాంత్, కల్నల్ పొనుంగ్ డోమింగ్,  లెఫ్టినెంట్ కమాండర్ పాల్గొన్నారు.  'ఇంటర్నేషనల్ ఉమెన్ ఇన్ డిఫెన్స్ ' అనే అంశంపై జరిగిన సదస్సులో సాయుధ దళాల తరపున  స్క్వాడ్రన్ లీడర్ భావన కాంత్, కల్నల్ పొనుంగ్ డోమింగ్,  లెఫ్టినెంట్ కమాండర్  ప్రాతినిధ్యం వహించారు. 2024 ఫిబ్రవరి 7న  అమెరికా లోని సౌదీ రాయబారి ప్రిన్సెస్  రీమా బింట్ బందర్ అల్-సౌద్ ఆధ్వర్యంలో   'ఇంటర్నేషనల్ ఉమెన్ ఇన్ డిఫెన్స్ - ఇన్వెస్టింగ్ ఇన్ ఇన్‌క్లూజివ్ ఫ్యూచర్' అనే అంశంపై జరిగిన సదస్సులో భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్ పైలట్ స్క్వాడ్రన్ లీడర్ భావనా కాంత్ పాల్గొని తన విజయ గాధలు వివరించారు.  అడ్డంకులను దాటి వైమానిక దళంలో చేరిన  స్క్వాడ్రన్ లీడర్ భావనా కాంత్ భారతదేశంలోని  ఫైటర్ పైలట్ క్లబ్‌లో స్థానం సంపాదించింది.  నాయకత్వం, స్థితిస్థాపకత , ఆధునిక యుద్ధ రంగంలో పెరుగుతున్న  మహిళల  పాత్రపై ఆమె  చేసిన ప్రసంగం సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. సదస్సుకు హాజరైన వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు భావనతో మాట్లాడి ఆమె అనుభవాలు తెలుసుకోవడానికి ఆసక్తి కనబరిచారు. రిపబ్లిక్ డే పరేడ్ (2021)లో పాల్గొన్న మొదటి మహిళా ఫైటర్ పైలట్ గా భావన చరిత్ర లిఖించారు.  రిపబ్లిక్ డే 2024 ఫ్లైపాస్ట్‌లో కూడా భావన పాల్గొన్నారు. 

భారత సైన్యంలో కల్నల్ గా విధులు నిర్వహిస్తున్న  పొనుంగ్ డోమింగ్ 20 సంవత్సరాలకు పైగా సైన్యానికి సేవలు అందిస్తున్నారు.  నార్తర్న్ సెక్టార్‌లో 15,000 అడుగుల పైన ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బోర్డర్ టాస్క్ ఫోర్స్‌కు నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారి  పొనుంగ్ డోమింగ్ . ఇంజనీరింగ్ అధికారిగా అనేక సవాళ్లతో కూడిన పనులు పూర్తి చేయడానికి సిబ్బందికి  పొనుంగ్ డోమింగ్  నాయకత్వం వహించారు. 
భారత నౌకాదళానికి చెందిన లెఫ్టినెంట్ కమాండర్ అన్ను ప్రకాష్ సముద్ర భద్రత, కార్యకలాపాలలో ఆమెకున్న నైపుణ్యాన్ని వివరించారు. విస్తారమైన భారత  తీర ప్రాంతాన్ని రక్షించడంలో, ప్రాంతీయ స్థిరత్వాన్ని నిర్ధారించడంలో మహిళలు పోషిస్తున్న  కీలక పాత్ర ను ఆమె సవివరంగా వివరించారు. సముద్ర రంగం భారతదేశం, ఇతర దేశాల మధుర్ సంబంధాలు, సహకారం  మరింత బలపడడానికి లెఫ్టినెంట్ కమాండర్ అన్ను ప్రకాష్ కృషి చేస్తున్నారు.  

వరల్డ్ డిఫెన్స్ షో2024లో ఈ ముగ్గురు అసాధారణ మహిళా అధికారులు పాల్గొనడం రక్షణ రంగంలో భారతీయ మహిళల పెరుగుతున్న పాత్రకు నిదర్శనంగా నిలిచింది. ఈ ముగ్గురూ 2024 ఫిబ్రవరి 08 న రియాద్‌లోని ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్‌లో వివిధ పాఠశాలల నుండి దాదాపు 600 మంది పాఠశాల పిల్లలకు వారి అద్భుతమైన ప్రయాణం గురించి స్ఫూర్తిదాయకమైన ప్రసంగాన్ని అందిస్తారు. ఈ కార్యక్రమం యూనిఫాంలో ఉన్న భారతీయ మహిళల విభిన్న ప్రతిభ, నాయకత్వ నైపుణ్యాలు ప్రదర్శించడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుంది, భవిష్యత్ తరాలకు వారి కలలను అనుసరించడానికి, కొత్త అవకాశాలు అన్వేషించడానికి  స్ఫూర్తి అందిస్తుంది. 

2024 ఫిబ్రవరి 04న ప్రారంభమైన  వరల్డ్ డిఫెన్స్ షో   ఫిబ్రవరి 08న ముగుస్తుంది. రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్  నాయకత్వంలో భారత ప్రతినిధి బృందం  రియాద్‌ను సందర్శించింది. 

***


(Release ID: 2003935) Visitor Counter : 130