బొగ్గు మంత్రిత్వ శాఖ
2022 ఏప్రిల్-డిసెంబర్ కాలంతో పోలిస్తే, 2023లోని అదే కాలంలో 10.13% పెరిగిన బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి
2022 సమీక్ష కాలంతో పోలిస్తే, 2023 ఏప్రిల్-డిసెంబర్ కాలంలో 40.66% తగ్గిన బ్లెండింగ్ బొగ్గు దిగుమతి
బొగ్గు రంగంలో స్వయంసమృద్ధి దిశగా భారత్ దిశగా అడుగులు
Posted On:
22 JAN 2024 4:03PM by PIB Hyderabad
దేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. 2022 ఏప్రిల్-డిసెంబర్ కాలంతో పోలిస్తే, 2023లోని అదే కాలంలో దేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి 10.13% వృద్ధిని సాధించింది. అదే సమయంలో, మొత్తం విద్యుత్ ఉత్పత్తి 6.71% పెరిగింది.
2023 ఏప్రిల్-డిసెంబర్ కాలంలో దేశీయ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి 872 బిలియన్ యూనిట్లకు చేరుకుంది. అంతకుముందు సంవత్సరం అదే కాలంలో ఉత్పత్తయిన 813.9 బిలియన్ యూనిట్లతో పోలిస్తే 7.14% వృద్ధి కనిపించింది. ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చేందుకు దేశంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నాయన్న విషయాన్ని ఇది తెలియజేస్తుంది.
దేశంలో ఏటా విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, సమీక్ష కాలంలో, బ్లెండింగ్ బొగ్గు దిగుమతి 28.78 మిలియన్ టన్నుల నుంచి 28.78 మిలియన్ టన్నులకు, 40.66% తగ్గింది. దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంచి, విదేశీ బొగ్గు దిగుమతులను తగ్గించడం ద్వారా స్వయంసమృద్ధి సాధించాలన్న భారతదేశ నిబద్ధతకు ఈ గణాంకాలు తార్కాణం.
మన దేశంలో సాంప్రదాయ (బొగ్గు, అణు &జల), పునరుత్పాదక (గాలి, సౌర, బయోమాస్ వంటివి) వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అయితే, దేశంలో విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన వనరు బొగ్గు. మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో దీనిదే 70% పైగా వాటా.
భారతదేశ ఇంధన డిమాండ్‌ను తీర్చడంలో బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి గణనీయమైన పాత్రను పోషిస్తోంది. పారిశ్రామిక వృద్ధి, సాంకేతిక పురోగతి, జనాభా పెరుగుదల, ఆర్థికాభివృద్ధి మొదలైన కారకాల వల్ల దేశంలో విద్యుత్ డిమాండ్ ఏటా పెరుగుతోంది.
దేశీయంగా బొగ్గు లభ్యతను పెంచడం, దిగుమతి చేసుకునే బొగ్గుపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడం భారత ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం, దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచేందుకు ప్రభుత్వం పట్టుదలగా ఉంది.
***
(Release ID: 1998686)
Visitor Counter : 130