సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
అయోధ్య రామాలయంలోని ప్రతి ఇటుక, ప్రతి ఆకృతి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కథను చెబుతుంది
Posted On:
21 JAN 2024 3:00PM by PIB Hyderabad
కశ్మీర్‌లోని మంచు శిఖరాల నుంచి కన్యాకుమారిలోని సముద్ర తీరాల వరకు, రామనామ ప్రతిధ్వనులు దేశవ్యాప్తంగా భక్తిరసాన్ని వెదజల్లాయి. ఈ భక్తి, అయోధ్యలోని చారిత్రాత్మక రామ మందిరం ఆకృతిలో ఒక ప్రత్యక్ష రూపం తీసుకుంది. గంభీరమైన రామాలయం, భారతదేశ ఐక్యత & భక్తికి చిహ్నంగా నిలుస్తోంది. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ భావన ఈ ఆలయంలో ప్రతిధ్వనిస్తుంది. ఇది రాష్ట్రాల సరిహద్దులను దాటి, ఒక దేవాలయం కోసం చేసిన తీర్థయాత్రలో దేశం మొత్తాన్ని ఏకం చేసిన అచంచలమైన విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తోంది.
రాజస్థాన్ మక్రానా పాలరాయితో తాపడం చేసిన ఆలయంలోని నడక భాగం, తెల్లటి పాల నురుగులా ప్రకాశిస్తుంది. కర్ణాటకలోని చార్మౌతి ఇసుకరాయితో రూపొందించిన దేవతల శిల్పాలు అత్యంత కనువిందు చేస్తాయి. రాజస్థాన్‌లోని బన్సీ పహర్‌పూర్ నుంచి తీసుకొచ్చిన గులాబీరంగు ఇసుకరాయి గాంభీర్యం ప్రవేశ ద్వారంలోని బొమ్మలలో కనిపిస్తుంది.
2,100 కిలోల భారీ అష్టధాతు గంట, గుజరాత్ దాతృత్వాన్ని ప్రతిధ్వనిస్తుంది. దీంతోపాటు, ప్రత్యేక 'నగాడ'ను మోసుకెళ్లే 700 కిలోల రథాన్ని కూడా గుజరాత్ ఆల్ ఇండియా దర్బార్ సమాజ్ సమర్పించింది. రాముడి విగ్రహం కోసం ఉపయోగించిన కృష్టశిల కర్ణాటక నుంచి వచ్చింది. హిమాలయ పర్వతాల విషయానికి వస్తే, అరుణాచల్ ప్రదేశ్ & త్రిపుర రామ మందిరానికి ద్వారాలయ్యాయి. క్లిష్టమైన పనితనం కూడిన చెక్క తలుపులు, చేతితో నేసిన వస్త్రాలను ఆ రాష్ట్రాలు అందించాయి.
ఈ జాబితా ఇంకా అయిపోలేదు. ఉత్తరప్రదేశ్ నుంచి ఇత్తడి సామగ్రి, మహారాష్ట్ర నుంచి పాలిష్ చేసిన కలప సామగ్రి వచ్చింది. రామ మందిరం అనేది కేవలం వస్తువులు, ప్రాంతాలకు సంబంధించింది కాదు. ఈ పవిత్ర ప్రయత్నంలో తమ ఆత్మలను, నైపుణ్యాలను సమ్మిళితం చేసి అద్భుతాలను ఆవిష్కరించిన వేల మంది ప్రతిభావంతులైన హస్తకళాకారులు కథ ఇది.
రామమందిరం అయోధ్యలో ఒక స్మారక చిహ్నం మాత్రమే కాదు, విశ్వాసానికి సజీవ నిదర్శనం. ప్రతి రాయి, ప్రతి ఆకృతి, ప్రతి గంట, ప్రతి వస్త్రం భౌగోళిక సరిహద్దులను అధిగమించి సాగిన సమష్టి ఆధ్యాత్మిక ప్రయాణంలో ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కథను చెబుతాయి.
***
(Release ID: 1998528)
Visitor Counter : 117