ఆయుష్

భువనేశ్వర్ లో అత్యాధునిక ' ఆయుష్ దీక్ష' భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయుష్ శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్

Posted On: 20 JAN 2024 3:54PM by PIB Hyderabad

ఆయుష్ రంగానికి అవసరమైన మానవ వనరుల అభివృద్ధి కోసం నిర్మించనున్న  ' ఆయుష్ దీక్ష' భవన నిర్మాణానికి  ఈ రోజు కేంద్ర ఆయుష్,ఓడ రేవులు, షిప్పింగ్ శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ శంకుస్థాపన చేశారు. దేశంలో తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న అత్యాధునిక ' ఆయుష్ దీక్ష' కేంద్రాన్ని భువనేశ్వర్ లో ఉన్న కేంద్ర ఆయుష్ పరిశోధన కేంద్రంలో నిర్మిస్తారు. 

ఈ సందర్భంగా శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో  ఆయుష్  ప్రాముఖ్యతను సంతరించుకుందని తెలిపారు. , ఆధునిక వైద్య వ్యవస్థతో పాటు సాధికార ఆయుష్ వైద్య విధానాన్ని కూడా ఉపయోగించే సమగ్ర వైద్య విధానం అభివృద్ధి కోసం కృషి జరుగుతున్నదని తెలిపారు.  .   ఆయుష్ నిపుణులు వారి నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి ఆయుష్ దీక్షా కేంద్రం వీలు కల్పిస్తుందని మంత్రి అన్నారు. నైపుణ్యం  పెంపొందించుకుని ఆయుష్   నిపుణులు ప్రపంచ స్థాయి రోగి సంరక్షణ సేవలను ప్రజలకు  అందించాలని ఆయన సూచించారు.శక్తివంతమైన ఆయుష్ ఉద్యమానికి, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితానుభవం దిశగా ప్రపంచవ్యాప్త ఉద్యమానికి ఇది ఉత్ప్రేరకంగా నిలుస్తుందని ఆయన అన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  నాయకత్వంలో ఆయుష్ ఉద్యమం పూర్వ వైభవం సంతరించుకుందని  మంత్రి పేర్కొన్నారు.  'ఆరోగ్యకరమైన జీవనం దిశగా యోగా  ప్రపంచానికి మార్గం చూపింది. దేశంలో  సాంప్రదాయ వైద్య విధానాలను పునరుద్ధరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆరోగ్య భారతదేశం నిర్మాణం జరగాలి అన్న ప్రదానమంత్రి ఆశయం నెరవేర్చడానికి ప్రభుత్వం చర్యలు అమలు చేస్తోంది.   . సమీకృత వైద్య విధానం దేశ ప్రజలకు ఒక వరంగా ఉంటుంది. సమీకృత వైద్య విధానంలో ప్రజలు వ్యాధుల బారి నుంచి బయట పడి శారీరక , మానసిక శాంతి పొందుతారు. దీనివల్ల ప్రజల  జీవన నాణ్యత పెరుగుతుంది' అని శ్రీ సోనోవాల్ అన్నారు. 

ఆయుష్ నిపుణులకు ముఖ్యంగా ఆయుర్వేదానికి చెందిన వారికి ఈ సంస్థ శిక్షణ కార్యక్రమాలు అందిస్తుంది,  సామర్థ్య అభివృద్ధి, మానవ వనరులను బలోపేతం చేయడం, పరిశోధన , అభివృద్ధిని సులభతరం చేయడం, ఆదాయాన్ని సంపాదించే లక్ష్యంతో స్వయం సుస్థిరత సాధించడం లక్ష్యంగా కేంద్రం పని చేస్తుంది. రూ.30 కోట్లతో ఆయుష్ దీక్షా కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు ఆడిటోరియంలు, సకల సౌకర్యాలతో కూడిన 40 ఆధునిక గదులు, వీఐపీల కోసం సూట్లు, సహజ లైబ్రరీ కోసం ప్రత్యేక స్థలం, సమావేశ మందిరాలు , మాడ్యులర్ కిచెన్, డైనింగ్ లాంజ్ తదితర అత్యాధునిక సౌకర్యాలు ఇందులో ఉంటాయి.
ఈ కార్యక్రమంలో భువనేశ్వర్ ఎంపీ (లోక్ సభ) అపరాజిత సారంగి, సీసీఆర్ ఏఎస్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ వైద్య రబీనారాయణ్ ఆచార్య, మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, విద్యార్థులు, ఆయుష్ నిపుణులు పాల్గొన్నారు.  కేంద్ర  ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధిలో స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ గా పనిచేస్తున్న  సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ (సీసీఆర్ఏఎస్) పరిధిలోని  భువనేశ్వర్  సీఏఆర్ఐ ఏర్పాటు అయింది.  ఆయుర్వేదంలో పరిశోధనలను శాస్త్రీయ ప్రాతిపదికన ప్రోత్సహించడానికి, ఆయుష్ రంగం అభివృద్ధి కోసం జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగా   అత్యాధునిక ' ఆయుష్ దీక్ష' కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. 

***



(Release ID: 1998249) Visitor Counter : 108


Read this release in: English , Urdu , Hindi , Odia , Tamil