సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
అయోధ్య రూపాంతరం: ఆధునిక రవాణా సౌకర్యాలతో ఆధ్యాత్మిక ప్రయాణంలో మరింత మెరుగుదల
Posted On:
19 JAN 2024 2:20PM by PIB Hyderabad
అయోధ్య నడిబొడ్డున, పవిత్రమైన రామమందిరాన్ని మించి, అద్భుతమైన మార్పు కనిపిస్తోంది. అయోధ్యకు రవాణా మార్గాల అనుసంధానంలో దూరదృష్టితో వ్యవహరించిన భారతదేశ ప్రభుత్వం, ఒక సమగ్ర మార్పును తీసుకొచ్చింది. పురాతన నగరాన్ని కొత్త యుగంలోకి నడిపించింది.
అయోధ్యలో కొత్త అమృత్ భారత్ రైళ్లు, వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని
ఈ పరిణామ క్రమంలో, అయోధ్యలో పునర్నిర్మించి, కొత్తగా ప్రారంభించిన రైల్వే స్టేషన్ గురించి మొదట చెప్పుకోవాలి. దాని పేరును ఇప్పుడు అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్‌గా పేరు మార్చారు. రూ.240 కోట్లకు పైగా వ్యయంతో అభివృద్ధి చేసిన ఈ రైల్వే స్టేషన్, భారత ప్రభుత్వ నిబద్ధతకు ప్రతీక. మూడు అంతస్తులుగా నిర్మించిన ఈ స్టేషన్‌లో లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఆహారశాలలు, పూజ సామగ్రి దుకాణాలతో ఆధునికత-ఆధ్యాత్మికత మిళితమై కనిపిస్తుంది. ఇంకా, వస్తువులు దాచుకునే గదులు, పిల్లల సంరక్షణ గదులు, ప్రయాణీకులు వేచివుండే గదులతో ఆధునిక సౌకర్యాలన్నీ ఇక్కడ అందరికీ అందుబాటులో ఉంటాయి. అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్‌కు 'ఐజీబీసీ సర్టిఫైడ్ గ్రీన్ స్టేషన్ బిల్డింగ్' హోదా దక్కింది. అయోధ్య-ఆనంద్ విహార్ టెర్మినల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కూడా ప్రధాని ప్రారంభించారు.
2023 డిసెంబర్‌లో, మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంతో అయోధ్య రూపాంతరం రైల్వేలను దాటి విస్తరించింది. రూ.1450 కోట్లకు పైగా వ్యయంతో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. మొదటి దశలో, 6500 చ.మీ. విస్తీర్ణంలో అత్యాధునిక టెర్మినల్ నిర్మించారు, ఏటా 10 లక్షల మంది ప్రయాణికులకు ఇది సేవలు అందిస్తుంది. శ్రీరామ మందిరాన్ని ప్రతిబింబిస్తూ టెర్మినల్ ముఖభాగాన్ని నిర్మించారు. లోపలి భాగంలో, స్థానిక కళ & నగర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే కుడ్యచిత్రాలను ప్రదర్శించారు. రెండో దశలో, ఏటా 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించే లక్ష్యంతో ఈ విమానాశ్రయాన్ని విస్తరిస్తారు. మెరుగైన అనుసంధానత వల్ల, ఈ ప్రాంతంలో పర్యాటకం, వ్యాపార కార్యకలాపాలు పెరుగుతాయి, కొత్త ఉపాధి అవకాశాలు పుట్టుకొస్తాయి.
అయోధ్యలో మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
అయోధ్యలో మార్పు కేవలం రవాణా రంగానికే పరిమితం కాలేదు, మొత్తం అయోధ్య నగరం అభివృద్ధికి అది విస్తరించింది. కొత్తగా పునర్నిర్మించిన, విస్తరించిన, సుందరీకరించిన రహదారులు రాంపథ్, భక్తిపథ్, ధర్మపథ్, శ్రీరామ జన్మభూమి పథ్‌ను ఇటీవలి పర్యటనలో ప్రధాన మంత్రి ప్రారంభించారు. యాత్రికులు, పర్యాటకులకు మరింత మెరుగైన అనుభవాన్ని ఇవి అందిస్తాయి.
అనుసంధానతను పెంచడం, సందర్శకుల అనుభవాన్ని మెరుగుపరచడం, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూ నగరంలో అవస్థాపన అభివృద్ధి & పర్యాటక రంగంలో పెట్టుబడులు అయోధ్య రూపాంతరంలో సమగ్ర విధానాన్ని ప్రదర్శిస్తున్నాయి. పుణ్యక్షేత్రం, పర్యాటకం, ఆర్థికాభివృద్ధి కేంద్రంగా మారడానికి ఇప్పుడు అయోధ్య సిద్ధంగా ఉంది.
***
(Release ID: 1998156)
Visitor Counter : 99