ప్రధాన మంత్రి కార్యాలయం

నూతన పద్ధతులను అవలంబిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 102 ఏళ్ల సహకార సంఘానికి ప్రధాన మంత్రి ప్రశంస


యూరియా, సూక్ష్మ యూరియా రెండింటినీ ఉపయోగిస్తున్నారు, ఎరువుల మితిమీరిన వినియోగాన్ని మానుకోవాలని రైతులకు నా విజ్ఞప్తి: ప్రధాని

Posted On: 08 JAN 2024 3:17PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, ఈ రోజు, వికసిత్‌ భార‌త్ సంక‌ల్ప యాత్ర ల‌బ్దిదార్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు దేశవ్యాప్తంగా వేలాది మంది వికసిత్‌ భార‌త్ సంక‌ల్ప యాత్ర లబ్ధిదార్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

102 ఏళ్ల సహకార సంఘం సభ్యుడు, నంద్యాలకు చెందిన సయ్యద్ ఖవాజా ముయిహుద్దీన్ ప్రధాని శ్రీ మోదీతో మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వ చొరవ వల్లే, వ్యవసాయ మౌలిక సదుపాయాల పథకం కింద నాబార్డు తమ సహకార సంఘానికి గిడ్డంగుల కోసం రూ.3 కోట్ల రుణం ఇచ్చిందని ప్రధానికి చెప్పారు. ఆ ఆర్థిక సాయంతో ఐదు గిడ్డంగులు నిర్మించామన్నారు. వాటిలో ధాన్యాన్ని నిల్వ చేసుకునే రైతులకు ఎలక్ట్రానిక్ గిడ్డంగి రశీదులు లభిస్తాయి. ఆ రసీదులతో బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు పొందొచ్చు. బహుళ ప్రయోజన కేంద్రం రైతులను ఇ-మండీలు, ఇ-నామ్‌లకు అనుసంధానిస్తుంది, వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర పొందేలా చూస్తుంది. దీనివల్ల దళారీ వ్యవస్థ పూర్తిగా తొలగిపోయిందని చెప్పారు. ఆ సహకార సంఘంలో మహిళా రైతులు, చిన్న వ్యాపారులు సహా 5600 మంది రైతులు ఉన్నారు.

100 ఏళ్లకు పైగా సహకార సంఘాన్ని నడుపుతున్న స్థానిక రైతుల స్ఫూర్తిని ప్రధాన మంత్రి అభినందించారు. సహకార బ్యాంకుల వల్ల స్థానిక రైతులు వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి గురించి తెలుసుకున్నారని ప్రధానికి చెప్పారు. నమోదు, నిల్వ సౌకర్యాలు వ్యవసాయ ఉత్పత్తులకు సాధ్యమైనంత ఉత్తమమైన ధరను పొందడంలో చిన్న రైతులకు సాయపడుతున్నాయని వివరించారు. తాను ఒక రైతు సమృద్ధి కేంద్రాన్ని కూడా నడుపుతున్నానని, ప్రభుత్వ చొరవ గత 10 సంవత్సరాల్లో తన పనిని నిజంగా మార్చిందని వ్యవస్థాపకుడు చెప్పారు. కిసాన్ క్రెడిట్ కార్డ్, ఎఫ్‌పీవో ద్వారా విలువ జోడింపు వంటి అనేక సౌకర్యాలు అందుతున్నాయని వివరించారు.

ప్రకృతి వ్యవసాయంపై మాట్లాడి ప్రధాన మంత్రి, అనేక మంది యూరియాతో పాటు సూక్ష్మ యూరియాను కూడా ఉపయోగిస్తున్నారని, ఎరువుల వాడకాన్ని తగ్గించాలని రైతులను కోరారు. రైతుల్లో నిరంతరం అవగాహన కల్పిస్తున్నామని, ఎరువుల వినియోగాన్ని హేతుబద్ధం చేసేందుకు భూసార పరీక్షలు చేయడంతోపాటు రైతులకు భూమి ఆరోగ్య కార్డులు అందజేస్తున్నట్లు ప్రధానికి వివరించారు. యూరియా, సూక్ష్మ యూరియా రెండింటినీ ఉపయోగించవద్దని, అవసరమైన చోట సూక్ష్మ పోషకాలను మాత్రమే వినియోగించాలని రైతులకు శ్రీ మోదీ విజ్ఞప్తి చేశారు. ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’ స్ఫూర్తితో ప్రభుత్వం పని చేస్తోందని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చివరి వ్యక్తికి కూడా అందుతాయని ప్రధాని భరోసా ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా మిగిలిపోతే, 'మోదీ కీ గ్యారెంటీ కీ గాడి' అతనికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందేలా చేస్తుందని చెప్పారు. పీఏసీఎస్‌ల బలోపేతానికి ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తోందని, 2 లక్షల నిల్వ కేంద్రాలను రూపొందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని ప్రధాని వెల్లడించారు.

 

***



(Release ID: 1994379) Visitor Counter : 150