నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
అధునాతన బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థతో కవరత్తిలో మొదటి గ్రిడ్ అనుసంధానిత సౌర విద్యుత్ ప్లాంట్ ప్రారంభం; ఇది రూ.250 కోట్లు ఆదా చేస్తుందని, 190 లక్షల లీటర్ల డీజిల్ వినియోగాన్ని & 58,000 టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గిస్తుందని అంచనా
Posted On:
04 JAN 2024 3:20PM by PIB Hyderabad
లక్షద్వీప్ ఇంధన అవసరాలు తీర్చడంలో చారిత్రాత్మక అడుగు పడింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, జనవరి 3, 2024న, కవరత్తిలోని సౌర విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. అధునాతన బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థ (బెస్) సాంకేతికతతో కూడిన ఈ ప్రాజెక్టు, లక్షద్వీప్‌లో మొదటి గ్రిడ్ అనుసంధానిత సౌర విద్యుత్ ప్రాజెక్టు. ఈ రెండు వ్యవస్థలకు 1.7 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యం, 1.4 మెగావాట్ హవర్స్ బ్యాటరీ నిల్వ సామర్థ్యం ఉన్నాయి.
ద్వీపం కోసం తీసుకొచ్చిన స్థిరమైన శక్తి పరిష్కారాల్లో ఇది గొప్ప పురోగతి. సౌర విద్యుత్ కేంద్రం వల్ల, కవరత్తిలోని డీజిల్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌పై ఆధారపడటం తగ్గుతుంది. లక్షద్వీప్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (లెడా) ఇప్పుడు సౌర విద్యుత్ కేంద్రం ఉత్పత్తి చేసే శక్తిని వినియోగించుకుంటుంది.
ఈ ప్రాజెక్టు అంచనా జీవితకాలంలో సుమారుగా రూ.250 కోట్లు ఆదా అవుతాయని, 190 లక్షల లీటర్ల వరకు డీజిల్ వినియోగం & 58,000 టన్నుల కార్బన ఉద్గారాలు తగ్గుతాయని అంచనా వేశారు. అంతేకాదు, లక్షద్వీప్‌కు హరిత ఇంధనాన్ని, పరిశుభ్రమైన, మరింత స్థిరమైన భవిష్యత్తును ఇవ్వడంలో ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యత సంతరించుకుంది.
ఈ ప్రాజెక్టు కోసం ప్రణాళిక, సేకరణ & నిర్మాణం (ఈపీసీ) నైపుణ్యాన్ని సన్‌సోర్స్ ఎనర్జీ అందించింది.
కేంద్ర నూతన & పునరుత్పాదక ఇంధన శాఖ (ఎంఎన్‌ఆర్‌ఈ) ఆధ్వర్యంలో పని చేసే మినీరత్న విభాగం-I సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌ఈసీఐ). వివిధ పునరుత్పాదక ఇంధన వనరుల ప్రోత్సాహం, అభివృద్ధిలో పాల్గొంటోంది. ముఖ్యంగా, సౌర, పవన, పునరుత్పాదక శక్తి-ఆధారిత ఇంధన నిల్వ వ్యవస్థలు, విద్యుత్ వ్యాపారం, ఆర్&డీ, గ్రీన్ హైడ్రోజన్, హరిత అమ్మోనియా, ఆర్‌ఈ-ఆధారిత ఎలక్ట్రిక్ వాహనాలు వంటి వాటిని అభివృద్ధి చేస్తోంది.
కేంద్ర నూతన & పునరుత్పాదక ఇంధన శాఖకు చెందిన అనేక పథకాల అమలు కోసం ఉన్న నోడల్ ఏజెన్సీల్లో ఎస్‌ఈసీఐ ఒకటి. దీనికి కేటగిరీ 1 విద్యుత్ వ్యాపార అనుమతి కూడా ఉంది. సౌర/పవన/హైబ్రిడ్/ఆర్‌టీసీ/బీఎస్‌ఈఎస్ విద్యుత్ వ్యాపారంలో ఈ కంపెనీ చురుగ్గా ఉంది.
***
(Release ID: 1993260)