మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

తెలంగాణలో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం స్థాపన కోసం కేంద్రీయ విశ్వవిద్యాలయాల (సవరణ), బిల్లు, 2023 కి ఆమోదం తెలిపిన రాజ్యసభ


ప్రాంతీయ ఆకాంక్షలు తీర్చడానికి, నాణ్యమైన విద్యను అందించడానికి, గిరిజన తెగల్లో పరిశోధనలను ప్రోత్సహించడానికి సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఉపయోగపడుతుంది – శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

Posted On: 14 DEC 2023 8:46AM by PIB Hyderabad

తెలంగాణ రాష్ట్రంలోని ములుగులో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం  స్థాపన కోసం 2009 కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్టం, 2009 ని సవరించడానికి ప్రవేశపెట్టిన కేంద్రీయ విశ్వవిద్యాలయాల (సవరణ), బిల్లు, 2023 ను 2023  డిసెంబర్ 13 న రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లును 7 డిసెంబర్ 2023న లోక్‌సభ ఆమోదించింది.

రాజ్యసభలో బిల్లుపై జరిగిన  చర్చకు సమాధానం ఇచ్చిన కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోకేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మరో హామీ కార్యరూపం దాల్చే విధంగా తెలంగాణలో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన  విశ్వవిద్యాలయం ఏర్పాటు అవుతుందని  అన్నారు. ఈ బిల్లును ఆమోదించిన సభ్యులకుమంత్రి  కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఉన్నత విద్య, ప్రాప్యత, నాణ్యతను మెరుగుపరచడానికి జరుగుతున్న ప్రయత్నాలకు ప్రతి ఒక్కరి నుంచి సహకారం అందుతుందని చెప్పాడానికి బిల్లు నిదర్శనమని  ఆయన అన్నారు.

 భవిష్యతులో ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చడానికి , గిరిజన కళలు, సంస్కృతి, ఆచారాలు , సాంప్రదాయ విజ్ఞాన వ్యవస్థల వంటి అంశాలతో సహా గిరిజనులకు నాణ్యమైన విద్య అందించి, పరిశోధనలను ప్రోత్సహించడానికి సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం కార్యక్రమాలు అమలు చేస్తుందని   శ్రీ ప్రధాన్ తెలిపారు. ఈ విశ్వవిద్యాలయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ ప్రజల  పురోగతికి నాంది పలుకుతుందని ఆయన ఉద్ఘాటించారు.

రాజ్యాంగంలో ఎస్సి/ ఎస్టీ/ ఓబీసీ/ ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు కల్పించిన హక్కులు సెంట్రల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ (టీచర్స్ కేడర్‌లో రిజర్వేషన్) చట్టం, 2019  కింద అమలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. 

బోధన-అభ్యాస పద్ధతులను పెంపొందించడానికి 3-5 సంవత్సరాల పిల్లల కోసం  జాదుయి పితర, బాలవాటికా  వంటి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని   ఆయన తెలియజేశారు. పాఠశాలల్లో నైపుణ్య ఆధారిత విద్య ,శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించామని ఆయన తెలిపారు.

అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ నూతన విద్యా విధానానికి గుర్తింపు లభించిందని శ్రీ ప్రధాన్ తెలిపారు. తమ దేశంలో భారతదేశ విద్యా విధానాన్ని  అమలు చేయడానికి నూతన విద్యా విధానం  2020ని  పర్షియా భాషలో అనువాదం చేసి ఇవ్వాలని ఇరాన్అ కోరిందని మంత్రి వెల్లడించారు.భారతదేశంలో అమలు జరుగుతున్న ఎన్సీఈఆర్టీ తరహాలో  తమ దేశంలో  ఒక సంస్థను అభివృద్ధి చేయడానికి మారిషస్  సహకారాన్ని కోరిందని ఆయన తెలియజేశారు.

 సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం రూ. 889.07 కోట్ల ఖర్చుతో ఏర్పాటు అవుతుంది. 11 విభాగాలతో  ఐదు పాఠశాలల క్రింద గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు డాక్టోరల్ స్థాయి కోర్సులు అందిస్తారు.  ఈ గిరిజన విశ్వవిద్యాలయం లో మొదటి  ఏడు సంవత్సరాల కాలంలో  మొత్తం 2790 యూజీ, పీజీ కోర్సుల్లో  విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తారు.  స్థాపన అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది  రూపంలో విశ్వవిద్యాలయం  ప్రత్యక్ష ఉపాధిని కల్పిస్తుంది.  ఔట్‌సోర్సింగ్ / కాంట్రాక్టు ప్రాతిపదికన ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.  అనేక సేవలు  వాణిజ్య కార్యకలాపాల ద్వారా పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేస్తుంది, తద్వారా పరోక్ష ఉపాధి అవకాశాలు కలుగుతాయి. 

తెలంగాణలోని గిరిజన ప్రజలను  రక్షించేందుకు పంపిన ఆది పరాశక్తి స్వరూపులుగా భావించే తల్లి, కుమార్తె సమ్మక్క, సారలమ్మ (సాధారణంగా సారక్క అని పిలుస్తారు)పై విశ్వవిద్యాలయానికి "సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం  " అని పేరు పెట్టారు.

***


(Release ID: 1986170) Visitor Counter : 164