రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

సింధుదుర్గ్‌ వద్ద భారత నౌకదళ 'ఆపరేషనల్ డెమోన్‌స్ట్రేషన్ 2023'


'జలమేవ్ యస్య, బలమేవ్ తస్య'

"సముద్రాన్ని నియంత్రించేవాడు సర్వశక్తిమంతుడు"

Posted On: 29 NOV 2023 3:35PM by PIB Hyderabad

భారతదేశ పశ్చిమ సముద్ర తీరంలో ఉన్న సింధుదుర్గ్ కోట వద్ద, 04 డిసెంబర్ 2023న, భారత నావికాదళం తన పరాక్రమ ప్రదర్శన చేయబోతోంది. నావికాదళం నౌకలు, విమానాల ద్వారా, 'ఆపరేషనల్ డెమోన్‌స్ట్రేషన్' పేరిట శక్తిసామర్థ్యాలను ప్రదర్శిస్తుంది. నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్, సీనియర్ కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సైనిక ప్రముఖులు, స్థానిక ప్రజలు తార్కర్లీ తీరం నుంచి విన్యాసాలను చూస్తారు. సముద్ర రంగంలో మన ఘన చరిత్రను వేడుకగా జరుపుకోవడం, వలసవాద పద్ధతులకు స్వస్తి పలకడం ఈ కార్యక్రమం ఉద్దేశం.

1660లో, మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ సింధుదుర్గ్ కోటను నిర్మించారు. నౌకాయానంలో ఈ కోటకు గొప్ప చరిత్ర ఉంది. అసామాన్య బలగాలతో ప్రదర్శన నిర్వహించేందుకు నావికాదళానికి కూడా ఉపయోగపడుతోంది.

1971 యుద్ధంలో కరాచీ నౌకాశ్రయంపై భారత నావికాదళం చేసిన సాహసోపేతమైన దాడి "ఆపరేషన్ ట్రైడెంట్"కు గుర్తుగా, ఏటా డిసెంబర్ 04న నావికాదళం దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. నౌకాదళ సిబ్బంది శౌర్యం, ధైర్యం, ప్రతికూల పరిస్థితుల్లోనూ అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల సంకల్పాన్ని ఈ ప్రదర్శన చాటి చెబుతుంది. భారతీయ నావికాదళంలోని అత్యాధునిక నౌకలు, యుద్ధ విమానాలను ఈ కార్యక్రమం ద్వారా సాధారణ ప్రజలు చూస్తారు. ఆన్‌లైన్ వీక్షకుల కోసం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

మిగ్ 29కె, ఎల్‌సీఏ నేవీతో కూడిన 40 విమానాలు, 20 యుద్ధనౌకలు పరాక్రమ ప్రదర్శనలో పాల్గొంటాయి. భారత నౌకాదళానికి చెందిన మెరైన్ కమాండోలు చేపట్టే తీర నిఘా, దాడులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. నావికాదళ బ్యాండ్ సంగీతం, ఎస్‌సీసీ నృత్యాలు, కవాతులు కూడా ఉన్నాయి. సింధుదుర్గ్ కోటలో లేజర్ షోతో ఈ కార్యక్రమం ముగుస్తుంది.

ఇప్పటివరకు ఏ ప్రధాన నావికాదళ స్థావరంలోనూ ఇలాంటి భారీ కార్యక్రమం జరగలేదు. సింధుదుర్గ్ కోట ముంబై నుంచి 550 కి.మీ. గోవాలోని నావికాదళ స్థావరం నుంచి 135 కి.మీ. దూరంలో ఉంది. ఈ కార్యక్రమం కోసం నావికాదళంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేశాయి.

నావికాదళ దినోత్సవం ప్రజల్లో చైతన్యాన్ని రగిలిస్తుంది, దేశ భద్రతకు నౌకాదళం అందిస్తున్న సహకారాన్ని ప్రదర్శిస్తుంది. 

 

***



(Release ID: 1980799) Visitor Counter : 64