సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

వాస్తవాలకు విలువ ఇస్తూ జర్నలిస్టులు, మీడియా నిపుణులు విధులు నిర్వర్తించాలి.. ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధంఖర్


కృత్రిమ మేధస్సు అనేక సవాళ్లు, నైతిక ప్రశ్నలు కలిగి ఉంటుంది .. ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధంఖర్

మీడియా రంగంలో కీలకంగా మారే కృత్రిమ మేధస్సు అనుభవం గల న్యూస్ ఎడిటర్ల స్థానాన్ని భర్తీ చేయలేదు... శ్రీ అనురాగ్ ఠాకూర్

కొన్ని పాశ్చాత్య మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్న అపోహలను భారత ప్రసార మాధ్యమాలు తిప్పి కొట్టాలి.. శ్రీ ఠాకూర్
జాతీయ పత్రికా దినోత్సవం 2023 ని నిర్వహించిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా

Posted On: 16 NOV 2023 6:19PM by PIB Hyderabad

జాతీయ పత్రికా దినోత్సవాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా  ఈ రోజు ఘనంగా నిర్వహించింది. భారత ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధంఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్యక్రమానికి  కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్, కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగ,జీ-20 షెర్పా శ్రీ అమితాబ్ కాంత్ తదితరులు హాజరయ్యారు.  జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ మీడియా రంగ ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మీడియా అనే అంశంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సదస్సు నిర్వహించింది.  కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ విధులను చిత్తశుద్ధితో బాధ్యతాయుతంగా నిర్వర్తించడానికి జాతీయ పత్రికా దినోత్సవం రోజున జర్నలిస్టులు పునరంకితం కావాలని మంత్రి పిలుపు ఇచ్చారు.. మరి కొన్ని సంవత్సరాల్లోనే ప్రపంచంలో  మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనున్న భారతదేశంలో రూపాంతరం చెందుతున్న దేశ కధనాలు మాత్రమే కాకుండా వివిధ ప్రాంతాలు,రంగాలకు చెందిన   ప్రజల  ఆశలు, ఆకాంక్షలు ప్రతిబింబించేలా కధనాలు ప్రచురించి  మీడియా మరింత నిర్మాణాత్మక పాత్ర పోషించాలని ఆయన అన్నారు. 

ప్రజాస్వామ్య పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తున్న పాత్రికేయుల గౌరవార్ధం జాతీయ పత్రికా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి అన్నారు. 

ఈ రోజు ప్రాముఖ్యతను ఎత్తిచూపుతూ శ్రీ ఠాకూర్ మాట్లాడుతూ, మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అంకితభావంతో ఉన్న పాత్రికేయుల అవిశ్రాంత నిబద్ధతను జాతీయ పత్రికా దినోత్సవం గౌరవిస్తుందని అన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మీడియా అనే అంశంపైమాట్లాడిన మంత్రి   “సాంకేతికత అభివృద్ధి వల్ల ప్రపంచ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి.  ప్రపంచ చరిత్రలో కీలకమైన ఘట్టం నడుస్తోంది. వార్తల సారాంశాన్ని సిద్ధం చేయడానికి    డిజిటల్ యుగంలో కృత్రిమ మేధస్సు (ఏఇ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కృత్రిమ మేధస్సు  నిస్సందేహంగా న్యూస్ రిపోర్టింగ్‌కు కొత్త కోణాన్ని జోడిస్తుంది.  అయితే కృత్రిమ మేధస్సు పరిమితులను గుర్తించాల్సి ఉంటుంది." అని మంత్రి అన్నారు.  వార్తల సేకరణ, వార్తల వ్యాప్తిలో కృత్రిమ మేధస్సు పోషిస్తున్న పాత్రను ప్రస్తావించిన మంత్రి అపారమైన అనుభవం కలిగిన  ఒక ఎడిటర్  పర్యవేక్షణ, సూక్ష్మ నైపుణ్యాలు కృత్రిమ మేధస్సు   కంటే ఎల్లప్పుడూ ఒక అడుగు ముందుంటాయని మంత్రిస్పష్టం చేశారు. కృత్రిమ మేధస్సును సరైన  విధానంలో, తగిన విధంగా ఉపయోగించాల్సి ఉంటుందన్నారు. పరిమితి, పర్యవేక్షణ లేకుండా కృత్రిమ మేధస్సును ఉపయోగించడం వల్ల మీడియా సమగ్రత దెబ్బ తింటుందని మంత్రి హెచ్చరించారు. 

భారతదేశం పట్ల కొన్ని పాశ్చాత్య సంస్థలు ప్రచారం చేస్తున్న అవాస్తవాలను మంత్రి ప్రస్తావించారు.  పత్రికా స్వేచ్ఛ పేరిట  జాతి స్ఫూర్తిని దెబ్బ తీయడానికి జరుగుతున్న ప్రయత్నాలను ఉపేక్షించే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు.  భారత్‌కు వ్యతిరేకంగా  జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కొంతమంది వ్యక్తులు, కొన్ని  మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. తప్పుడు  కథనాలను ప్రశ్నించి,  అబద్ధాలను తిప్పి కొట్టి వాస్తవాలు వెలుగు చూసేందుకు ప్రతి ఒక్కరూ కలిసి కృషి చేయాలని మంత్రి సూచించారు.భారతదేశం, దేశానికి చెందిన మీడియా సంస్థలపై  కొన్ని పాశ్చాత్య మీడియా సంస్థలు పక్షపాతంతో వ్యవహరిస్తూ అపోహలు ప్రచారం చేస్తున్నాయని ఆయన అన్నారు. వలసవాద వాసనలు వీడని వ్యక్తులు,సంస్థలు అవాస్తవాలను ప్రసారం చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.  భారతదేశ  మీడియా రంగం పని తీరును ప్రశంసించిన శ్రీ ఠాకూర్ అంకితభావం, చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులు దేశాభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తున్నారని అన్నారు. విభిన్న స్వరాలు, అభిప్రాయాలకు వేదికగా దేశ పత్రికా రంగం ఉందన్నారు.  దేశంలో పత్రికా స్వేచ్ఛ  ఉందని స్పష్టం చేశారు. 

కృత్రిమ మేధస్సు ఉపయోగం పట్ల మీడియా అప్రమత్తంగా ఉండాలని  మంత్రి హెచ్చరించారు.  ఒక బటన్ నొక్కితే  తప్పుడు సమాచారాన్ని విస్తరించే ప్రపంచంలో మనం జీవిస్తున్నామని గుర్తించాలని ఆయన అన్నారు. తప్పుడు కథనాల ప్రసారం, సంచనాలకు కాకుండా వాస్తవాలకు ప్రాధాన్యత ఇస్తూ మీడియా రంగం పనిచేసి  దేశ ప్రయోజనాల రక్షణ,ఐక్యత , సమగ్రతకు ముప్పు కలిగించే భారత వ్యతిరేక అభిప్రాయాలకు చోటు కల్పించకుండా పనిచేయాలని ఆయన కోరారు. 

కార్యక్రమంలో పాల్గొన్న  కేంద్ర సమాచార, ప్రసార శాఖ   సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ మాట్లాడుతూ నైతిక ప్రమాణాలు, విలువలకు కట్టుబడి పత్రికా రంగం పనిచేసేలా చూసేందుకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేస్తున్న కృషిని  ప్రశంసించారు.  మార్పులకు అనుగుణంగా నిరంతరంగా మారాలని ఆయన మీడియాకు సూచించారు. . కాపీరైట్, సృజనాత్మకత, వాస్తవికత అంశాలకు కృత్రిమ మేధస్సు వల్ల పొంచి ఉన్న ప్రమాదం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు.  ప్రతి ఇతర సాంకేతిక పరిజ్ఞానం తరహాలో కృత్రిమ మేధస్సుకు  కూడా నైతిక మానవ పర్యవేక్షణ అవసరమని ఆయన అన్నారు.

కార్యక్రమంలో  ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉప రాష్ట్రపతి  శ్రీ జగదీప్‌ ధన్‌ఖర్‌  తప్పుడు వార్తలు, ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం అందించడం, రాజకీయ ఆశయాలు, ఇష్టాయిష్టాలు, అధికార దళారీల ధోరణి, ధన పరమైన కారణాల వల్ల ప్రజలు  నేడు మీడియాపై  నమ్మకం కోల్పోతున్నారని  అన్నారు. విశ్వసనీయతే నేడు మీడియా ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ అని వ్యాఖ్యానించిన ఉపరాష్ట్రపతి , ఈ అంశాన్ని  విస్మరించడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.

కృత్రిమ మేధస్సు వినియోగం పట్ల మాట్లాడిన  ఉపరాష్ట్రపతి  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆవిర్భావంతో వార్తలు, సమాచారం, వినోదాన్ని స్వీకరించి, వినియోగించే విధానాన్ని మార్చిందని అన్నారు. కృత్రిమ మేధస్సు దైనందిన జీవితంలో అంతర్భాగంగా మారిందని ఉపరాష్ట్రపతి  అన్నారు. అనేక సవాళ్లు, ప్రతికూల అంశాలు కలిగి ఉన్న కృత్రిమ మేధస్సు వినియోగం వల్ల  ప్రజాస్వామ్య ప్రక్రియను ప్రభావితం అయ్యే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. దీనివల్ల  గందరగోళ పరిస్థితి ఏర్పడి  అస్థిరత వాటిల్లే ముప్పు ఉందని హెచ్చరించారు.  ఈ సవాళ్ల వల్ల  జర్నలిస్టులు, మీడియా నిపుణుల బాధ్యత మరింత పెరుగుతుందని అన్నారు.వాస్తవాలు  ఖచ్చితత్వం, జవాబుదారీ సూత్రాలకు మరింత ప్రాధాన్యత ఇచ్చి విధులు నిర్వర్తించాలని  ఆయన అన్నారు.

కృత్రిమ మేధస్సు వినియోగం వల్ల ప్రమాదం ఉన్నప్పటికీ  ఈ సాంకేతిక వినియోగం పెరుగుతుందని గుర్తించి మారుతున్న పరిస్థితికి అనుగుణంగా మారడానికి సిద్ధం కావాలని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ఒక సాధనంగా కృత్రిమ మేధస్సును  ఉపయోగించుకోవాలని సూచించిన ఉపరాష్ట్రపతి కృత్రిమ మేధస్సు దుర్వినియోగం కాకుండా చర్యలు అమలు జరగాలని అన్నారు.“జర్నలిస్టులు, మీడియా సంస్థలు  అత్యున్నత ప్రమాణాలు పాటించాలి. వాస్తవాలను పరిశీలించి,  మూల ధృవీకరణ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.  సంపాదకీయ స్వాతంత్ర్యం ఉండాలి. స్వేచ్ఛగా, పటిష్టంగా పనిచేస్తున్న పత్రికా రంగానికి కృతిరుమ మేధస్సు వల్ల ముప్పు వాటిల్ల కూడదు" అని ఆయన అన్నారు.  కృత్రిమ మేధస్సు  శక్తివంతమైన సాధనంగా అందుబాటులోకి వచ్చినప్పటికీ  మానవ ప్రమేయం,, సత్యం పట్ల నిబద్ధత, జర్నలిస్టుల అచంచలమైన అంకితభావం వల్ల మాత్రమే మీడియా సమాజానికి మేలు చేస్తుందని అన్నారు. 

జీ-20 షెర్పా శ్రీ అమితాబ్ కాంత్ మాట్లాడుతూ సాంకేతికతను మానవ ప్రతిభకు మెరుగులు దిద్దే సాధనంగా పనిచేస్తున్న  మీడియా సంస్థలు పరిశోధనాత్మక , డాక్యుమెంటరీ జర్నలిజాన్ని పునరుజ్జీవింప చేశాయని అన్నారు. కృత్రిమ మేధస్సు  రూపొందించిన ఆడియో,  వీడియోల  కథనాల్లో అడ్డంకులు తొలగిపోయాయని ఆయన అన్నారు. పరీక్షించని కృత్రిమ మేధస్సు వినియోగం వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. 

ఈ కార్యక్రమానికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. చైర్‌పర్సన్ శ్రీమతి జస్టిస్ రాజనా ప్రకాష్ దేశాయ్ అధ్యక్షత వహించారు.  

***

 



(Release ID: 1977547) Visitor Counter : 90