నీతి ఆయోగ్
azadi ka amrit mahotsav

వృద్ధి-శ్రేయస్సు కోసం సమగ్ర వాణిజ్యంపై నీతి ఆయోగ్ కార్యగోష్ఠి

Posted On: 07 NOV 2023 11:08AM by PIB Hyderabad

   ‘‘వృద్ధి-శ్రేయస్సు కోసం సమ్మిళిత వాణిజ్యం’’ ఇతివృత్తంగా నీతి ఆయోగ్ కార్యగోష్ఠి (వర్క్‌ షాప్‌) నిర్వహించింది. దేశంలో వృద్ధి-శ్రేయస్సు కోసం సమ్మిళిత వాణిజ్యంసహా ప్రతిరోధక సరఫరా శ్రేణుల పరంగా న్యూఢిల్లీ దేశాధినేతల సంయుక్త ప్రకటన (ఎన్‌డిఎల్‌డి) నిర్దేశాల విస్తరణ, అనుసరణ, అమలు ఆవశ్యకతను ఇది నొక్కిచెప్పింది. భారత అధ్యక్షతన జి-20 శిఖరాగ్ర సదస్సునాటి ‘ఎన్‌డిఎల్‌డి’ నిర్దేశాలకు కొనసాగింపుగా ఈ ఇతివృత్త ఆధారిత కార్యగోష్ఠి నిర్వహించబడింది. కాగా, యావత్ ప్రపంచ వృద్ధి-శ్రేయస్సు కోసం బలమైన, సుస్థిర, సమతుల, సమ్మిళిత వాణిజ్య విధాన అనుసరణ అవసరాన్ని ‘ఎన్‌డిఎల్‌డి’ ఉద్ఘాటించింది.

   కార్యగోష్ఠిలో నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సిఇఒ) శ్రీ బి.వి.ఆర్.సుబ్రహ్మణ్యం ప్రధానోపన్యాసం చేశారు. వృద్ధి-శ్రేయస్సుకు చోదకంగా వాణిజ్యాన్ని సులభతరం చేసే పక్షపాతరహిత, సమ్మిళిత వాణిజ్య వ్యవస్థ అవసరాన్ని ఈ సందర్భంగా ఆయన నొక్కిచెప్పారు. ఇందులో భాగంగా ప్రపంచ విలువ శ్రేణుల (జివిసి)లో భారత్ ఏకీకృతం కావాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టం చేశారు. అలాగే వర్ధమాన వాణిజ్య వ్యవస్థలను వేగంగా అనుసరించాల్సిన ఆవశ్యకత కూడా ఉందన్నారు.

   నీతి ఆయోగ్ గౌరవ సభ్యులు డాక్టర్ అరవింద్ వీరమణి ‘ప్రపంచ విలువ శ్రేణుల గుర్తింపు’ శీర్షికతో  నిర్వహించిన తొలి చర్చాగోష్ఠిలో మాట్లాడారు. కార్మికశక్తి ప్రధాన సరఫరా శ్రేణులు, విధాన రూపకల్పనలో వ్యవస్థాపరమైన అంశాలు, పన్నుల వ్యవస్థ సరళీకరణ వంటి కీలక రంగాలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. ముఖ్యంగా ‘ఎంఎస్ఎంఇ‘ల కోసం చెల్లింపు, వాపసు-ఎగుమతి క్రెడిట్ వ్యవస్థల ఏకీకరణ అవసరమన్నారు. అలాగే అక్రమ నిల్వ సంబంధిత సమస్యలన్నిటికీ పరిష్కారం అన్వేషించాల్సి అవసరాన్ని స్పష్టం చేశారు. సానుకూల సామర్థ్యంగల భాగస్వాములతో ‘స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల’ (ఎఫ్‌టిఎ)ను ప్రోత్సహించాల్సి ఉందని కూడా డాక్టర్ వీరమణి గుర్తుచేశారు.

   సమర్థ సరఫరా శ్రేణుల కోసం రవాణా-సంబంధిత సదుపాయాలను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని ‘ప్రపంచ విలువ శ్రేణుల గుర్తింపు’పై చర్చాగోష్ఠి నొక్కిచెప్పింది. అదేవిధంగా పోటీతత్వాన్ని ప్రోత్సహించే దిశగా విదేశీ మారకం రేటు నిర్వహణ, బహుళజాతి సంస్థల పాత్రను వ్యూహాత్మకంగా వినియోగించుకోవడం, మూలస్థానం సంబంధిత సంచిత నిబంధనల రూపక్పలన, సంభావ్య సమర్థ రంగాల గుర్తింపు, పారదర్శక-అనుసరణీయ ‘జివిసి’లు, అంకురాల గుర్తింపు, పారిశ్రామిక-వాణిజ్య విధానాల ఏకీకరణ వంటి అంశాలపై ఈ గోష్ఠిలో ప్రధానంగా దృష్టి సారించారు.

   ఇక ‘వృద్ధి కోసం సమ్మిళిత వాణిజ్యానికి ప్రోత్సాహం’ శీర్షికతో నిర్వహించిన రెండో చర్చాగోష్ఠికి నీతి ఆయోగ్ గౌరవ సభ్యులు ప్రొఫెసర్ రమేష్ చంద్ అధ్యక్షత వహించారు. స్వల్పస్థాయి వర్ధమాన దేశాల (ఎల్‌డిసి) సామర్థ్యం పెంపుతోపాటు మౌలిక సదుపాయాల అభివృద్ధి, పన్నేతర అడ్డంకుల తొలగింపు, వాణిజ్య సాయం కోసం వనరుల సమీకరణ పెంపు వంటివాటిపై ఈ గోష్ఠిలో ప్రధానంగా దృష్టి సారించారు. ముఖ్యంగా ‘ఎల్‌డిసి’లలోని ‘ఎంఎస్ఎంఇ‘ల కోసం మౌలిక సదుపాయాల కల్పన, నైపుణ్య కల్పన, సమాచార యాజమాన్యం, ప్రమాణాల నిర్ధారణ, సాంకేతిక ప్రగతి, పారదర్శకత, వాణిజ్య వ్యవస్థలలో వాతావరణ నిబంధనల అమలు వగైరాల ప్రాధాన్యాన్ని నొక్కిచెప్పింది.

   చివరగా ‘సమ్మిళిత వాణిజ్యానికి సవాళ్ల పరిష్కారం’ శీర్షికతో నిర్వహించిన ముగింపు చర్చాగోష్ఠికి  ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) పూర్వ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హర్షవర్ధన్ సింగ్ అధ్యక్షత వహించారు. భారత సంప్రదాయ ఎగుమతులతోపాటు వాణిజ్యంలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్యం పెంపు అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. అలాగే సరఫరా శ్రేణులు-వాణిజ్యంలో రాష్ట్ర/జిల్లా స్థాయి ఏకీకరణ (జిల్లాలను ఎగుమతి కూడళ్లుగా రూపొందించడం); ‘జివిసి’లలో ‘ఎంఎస్ఎంఇ‘ల ఏకీకరణకు తోడ్పాటు; రవాణా-ఆర్థిక చేయూత, ‘ఎంఎస్ఎంఇ‘లకు సమాచార సౌలభ్యం; పోషక తృణధాన్యాలు- సేవల ఎగుమతుల పెంపు, వాతావరణ ప్రతిరోధక వ్యవసాయం; వాణిజ్య సంబంధిత పత్రాల డిజిటలీకరణ; పునఃనైపుణ్య, నైపుణ్యోన్నతి సహా నైపుణ్యాభివృద్ధికి అగ్ర ప్రాధాన్యం తదితర రంగాలపై చివరి చర్చాగోష్ఠి నిశితంగా దృష్టి సారించింది.

    న్యూఢిల్లీ దేశాధినేతల సంయుక్త ప్రకటనలోని కీలక నిర్దేశాలకు అనుగుణంగా దేశ ప్రగతి-శ్రేయస్సుకు ఊతమిచ్చే ఆచరణాత్మక వ్యూహాలు-ప్రణాళికల రూపకల్పన లక్ష్యంగా నీతి ఆయోగ్ వరుసగా ఇతివృత్త ఆధారిత కార్యగోష్ఠులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సుస్థిర ప్రగతి లక్ష్యాలు, పర్యాటకం కోసం మార్గప్రణాళిక రూపకల్పన, జనహిత డిజటల్ మౌలిక సదుపాయాలు, భారత-ఆఫ్రికా సమాఖ్య సహకారం, ప్రగతి కోసం సమాచారం, మహిళా చోదక ప్రగతి తదితర అంశాలపైనా మరిన్ని కార్యగోష్ఠులు దృష్టి సారిస్తాయి.

***


(Release ID: 1975535) Visitor Counter : 68