సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆర్‌టీఐ చట్టం 18వ వార్షికోత్సవాన్ని నిర్వహించిన కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ)


ఈ 18 సంవత్సరాల్లో 3.5 లక్షలకు పైగా విజ్ఞప్తులు, ఫిర్యాదులను పరిష్కరించిన సీఐసీ

Posted On: 12 OCT 2023 3:55PM by PIB Hyderabad

సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చి 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఈ రోజు, కేంద్ర సమాచార కమిషన్‌లో (సీఐసీ) ఒక కార్యక్రమం జరిగింది. సమాచార కమిషనర్లు, కార్యదర్శి, అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆర్‌టీఐ అమలులో కీలకంగా వ్యవహరిస్తూ, కమిషన్ సాధించిన విజయాలను సమాచార కమిషనర్లు వివరించారు. ఈ 18 సంవత్సరాల్లో సీఐసీ 3.5 లక్షలకు పైగా విజ్ఞప్తులు, ఫిర్యాదులను సులభతరం చేసింది, పరిష్కరించింది.

ముఖ్యంగా, వీడియో కాన్ఫరెన్సింగ్ (వీసీ) విధానంలో విచారణలు నిర్వహిస్తూ, సాంకేతికతను సద్వినియోగం చేసుకునేందుకు కమిషన్ చేసిన ప్రయత్నాలు గురించి ఈ సమావేశంలో ఎక్కువగా వివరించారు. కమిషన్, 2020-21 సంవత్సరంలో 4,783, 2021-22 సంవత్సరంలో 7,514, 2022-23లో 11,090 వీసీలను నిర్వహించింది. ఈ ప్రయత్నాలతో, విజ్ఞప్తులు, ఫిర్యాదుల పెండింగ్‌లు 2020-21 సంవత్సరంలో 38,116 నుంచి 2021-22లో 29,213కి; 2022-23 సంవత్సరంలో రికార్డు స్థాయిలో 19,233కి తగ్గాయి.

జమ్ము, కశ్మీర్ యూటీల కోసం 03-07-2023 నుంచి 05-07-2023 వరకు శ్రీనగర్‌లోని జే&కే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో సీఐసీ ప్రజా విచారణ నిర్వహించిన విషయాన్ని కూడా గుర్తుచేసుకున్నారు.
దూరం, వృద్ధాప్యం, ఇతర అవరోధాల కారణంగా దిల్లీలో భౌతిక విచారణకు హాజరు కాలేని, వర్చువల్ విచారణలకు హాజరు కావడానికి ఎన్‌ఐసీ స్టూడియో అందుబాటులో లేని ప్రజల కోసం సీఐసీ ఈ చొరవ తీసుకుంది. 06-07-2023న శ్రీనగర్‌లో “ఆర్‌టీఐ చట్టం అమలులో సవాళ్లు” అంశంపై కార్యశాల కూడా నిర్వహించారు. వివిధ ప్రజా విభాగాలకు చెందిన 150 మంది సీపీఐవోలు, సీఐసీ, జే&కే అధికారులు హాజరయ్యారు.

ఆర్‌టీఐ చట్టంలోని ముఖ్యాంశమైన ‘సువో మోటో డిస్‌క్లోజర్’పై కూడా ఈ సమావేశంలో మాట్లాడారు. దీని కింద, వివిధ ప్రజా విభాగాల పారదర్శకతను ప్రతి సంవత్సరం మదింపు చేస్తారు. దీంతోపాటు, ఎంపిక చేసిన ప్రజా విభాగాల్లో మరింత కఠినమైన, వివరణాత్మక నమూనా పారదర్శకత మదింపును కూడా ఏటా చేపడతారు.

పౌరులకు అవసరమైన సమాచారం అందించడంలో ఆర్‌టీఐ యంత్రాంగాన్ని మరింత ప్రభావవంతంగా మార్చడంలో సీఐసీ కీలక పాత్ర పోషించిందని వక్తలంతా చెప్పారు. ఆర్‌టీఐ చట్టం లక్ష్యాలను నెరవేర్చడంలో, మరింత ఉన్నత స్థాయికి పెంచడంలో పౌరులు, ఇతర వాటాదార్లు చేసిన కృషికి కృతజ్ఞతలు తెలపడంతో సమావేశం ముగిసింది.

                                                     

<><><>


(Release ID: 1967234) Visitor Counter : 65