బొగ్గు మంత్రిత్వ శాఖ

రాజస్థాన్‌లో 810 మెగావాట్ల గ్రిడ్ అనుసంధానిత సౌర విద్యుత్‌ ప్రాజెక్టును దక్కించుకున్న ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్

Posted On: 09 OCT 2023 12:34PM by PIB Hyderabad

కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని నవరత్న హోదా సంస్థ అయిన ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్, రాజస్థాన్ రాజ్య విద్యుత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌వీయూఎన్‌ఎల్‌) నుంచి 810 మెగావాట్ల సౌర పీవీ ప్రాజెక్టు కాంట్రాక్టును గెలుచుకుంది.

రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లా పుగల్ తహసీల్‌లో 2000 మెగావాట్ల అల్ట్రా మెగా సోలార్ పార్కు ఏర్పాటు కోసం, 2022 డిసెంబర్‌లో ఆర్‌ఆర్‌వీయూఎన్‌ఎల్‌ నుంచి 810 మెగావాట్ల టెండర్‌ను ఎన్‌ఎల్‌సీఐఎల్‌ పొందింది. ఈ ప్రాజెక్టు కోసం 'లెటర్ ఆఫ్ ఇంటెంట్'ను ఆర్‌ఆర్‌వీయూఎన్‌ఎల్‌ జారీ చేసింది. శుద్ధ, స్థిరమైన ఇంధన పరిష్కారాల పట్ల ఎన్‌ఎల్‌సీఐఎల్‌ నిబద్ధతను ఈ విజయం సూచిస్తుంది.

ఈ ప్రాజెక్టు కోసం భూమిని, ఎస్‌టీయూకి అనుసంధానించిన విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఆర్‌ఆర్‌వీయూఎన్‌ఎల్‌ అందిస్తుంది, తక్కువ వ్యవధిలో ప్రాజెక్టు పూర్తి చేయడానికి మార్గం సుగమం చేస్తుంది. కంపెనీ అభివృద్ధి చేయనున్న అతి పెద్ద పునరుత్పాదక ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టుతో, రాజస్థాన్‌లోని విద్యుత్‌ ప్రాజెక్టు సామర్థ్యం 1.1 గిగావాట్ల హరిత విద్యుత్‌తో కలిపి 1.36 గిగావాట్లకు చేరుతుంది.

రాజస్థాన్‌లోని ఎండ తీవ్రత వల్ల ఈ ప్రాజెక్టులో అధిక సీయూఎఫ్‌ సాధ్యమవుతుంది, 50 బిలియన్ యూనిట్లకు పైగా హరిత విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రాజెక్టు జీవితకాలంలో 50,000 టన్నులకు పైగా కార్బన ఉద్గారాలు తగ్గుతాయి.

ప్రస్తుతం, గని ప్రాంతాల్లో 50 మెగావాట్ల సౌర ప్రాజెక్టు, దేశవ్యాప్త ఉనికి ప్రాతిపదికన సీపీఎస్‌యూ పథకం కింద 200 మెగావాట్ల సౌర ప్రాజెక్టు, బికనీర్ జిల్లా బార్సింగ్‌సర్ వద్ద సీపీఎస్‌యూ పథకం కింద 300 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు, భుజ్ జిల్లా ఖవ్డా సౌర ప్రాజెక్ట్ వద్ద 600 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును ఈ సంస్థ ఏర్పాటు చేస్తోంది.

"కంపెనీ 1 గిగావాట్ల పునరుత్పాదక శక్తి సామర్థ్యాన్ని వ్యవస్థాపించిన మొదటి సీపీఎస్‌యూ. ఎన్‌ఎల్‌సీఐఎల్‌ ప్రస్తుతం భారతదేశంలో 2 గిగావాట్ల పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోందని, ప్రస్తుత ప్రాజెక్టుతో సహా 2030 నాటికి 6 గిగావాట్ల పునరుత్పాదక శక్తి సామర్థ్యాన్ని చేరుకోవాలనే లక్ష్యంతో ఉంది" అని కంపెనీ సీఎండీ శ్రీ ప్రసన్న కుమార్ మోటుపల్లి చెప్పారు.

ఎన్‌ఎల్‌సీఐఎల్‌ గురించి:

ఆరు దశాబ్దాలకు పైగా, ఇంధన రంగంలో, దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ అగ్రగామిగా ఉంది. లిగ్నైట్ ఉత్పత్తిలో సింహభాగం, బొగ్గు ఆధారిత & పునరుత్పాదక శక్తి ఉత్పత్తిలో పెద్ద వాటాను కలిగి ఉంది. మరింత సమాచారాన్ని https://www.nlcindia.inలో చూడవచ్చు.

 

***



(Release ID: 1965909) Visitor Counter : 140