ప్రధాన మంత్రి కార్యాలయం
రాజస్థాన్లోని చిత్తోడ్గఢ్లో రూ.7,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి పథకాలు జాతికి అంకితం.. శంకుస్థాపన చేసిన ప్రధాని
“ప్రాచీన వారసత్వం.. వర్తమాన బలం.. భవిష్యత్ అవకాశాలున్న రాష్ట్రం రాజస్థాన్”;
“రాజస్థాన్ రాష్ట్రాభివృద్ధి కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యాంశం”;
“సాహసం.. కీర్తి.. అభివృద్ధితో ముందుకెళ్లాలని రాజస్థాన్ చరిత్ర బోధిస్తుంది”;
“గతంలో వెనుకబడిన వర్గాలు.. నిర్లక్ష్యానికి గురైన
ప్రాంతాల అభివృద్ధే నేడు దేశ ప్రాధాన్యాలు”
Posted On:
02 OCT 2023 12:21PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్‌లో దాదాపు రూ.7,000 కోట్ల విలువైన అనేక అభివృద్ధి పథకాలను జాతికి అంకితం చేయడంతోపాటు మరికొన్నిటికి శంకుస్థాపన చేశారు. వీటిలో మెహ్‌సానా-భటిండా-గురుదాస్‌పూర్ గ్యాస్ పైప్‌లైన్, అబూ రోడ్‌లో ‘హెచ్‌పిసిఎల్’ ఎల్పీజీ ప్లాంట్, అజ్మీర్‌లోని ‘ఐఒసిఎల్’ ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంటు ప్రాంగణంలో అదనపు నిల్వ సదుపాయం, రైల్వే-రహదారి ప్రాజెక్టులు, నాథ్‌ద్వారాలో పర్యాటక సౌకర్యాలు, కోటాలోని ‘ఇండియన్ ఇన్‌స్టిట్ట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ’ (ఐఐఐటీ) శాశ్వత ప్రాంగణం తదితరాలున్నాయి.
అనంతరం కార్యక్రమానికి హాజరైన వారినుద్దేశించి ప్రసంగం ప్రారంభిస్తూ- జాతిపిత మహాత్మగాంధీ, పూర్వ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి నేపథ్యంలో వారిని సంస్మరించుకున్నారు. అలాగే నిన్న (అక్టోబరు 1న) దేశవ్యాప్తంగా చేపట్టిన పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చడంపై పౌరులకు ధన్యవాదాలు తెలిపారు. పరిశుభ్రత, స్వావలంబన, స్పర్థాత్మక ప్రగతిపై మహాత్ముని ప్రబోధాన్ని ప్రస్తావిస్తూ- ఈ సూత్రాల వ్యాప్తికి గడచిన తొమ్మిదేళ్లుగా దేశం ఎంతగానో కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. ఆ కృషి ఫలితమే రాజస్థాన్‌లో నేడు రూ.7,000 కోట్లకుపైగా విలువైన ప్రగతి ప్రాజెక్టుల రూపంలో ప్రతిఫలిస్తున్నదని అభివర్ణించారు.
గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు మరో ముందడుగులో భాగంగా దేశమంతటా గ్యాస్ పైప్‌లైన్లు వేసే కార్యక్రమం అనూహ్య వేగంతో కొనసాగుతున్నదని చెప్పారు. ఈ మేరకు మెహ్‌సానా-భటిండా-గురుదాస్‌పూర్ గ్యాస్ పైప్‌లైన్ మార్గంలోగల రాజస్థాన్‌లోని పాలి-హనుమాన్‌గఢ్ విభాగాన్ని ఇవాళ జాతికి అంకితం చేశామని వివరించారు. దీనివల్ల రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధితోపాటు యుతకు ఉపాధి అవకాశాలు అందివస్తాయని ఆయన పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో ఇవాళ ప్రారంభించిన రోడ్డు-రైలు ప్రాజెక్టుల గురించి కూడా ప్రధాని ప్రస్తావించారు. వీటివల్ల మేవాడ్ ప్రాంత ప్రజలకు జీవన సౌలభ్యం కలుగుతుందని ఆయన వివరించారు. అంతేకాకుండా వీటిద్వారా కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. విద్యా కూడలిగా ఇప్పటికే పేరున్న కోటా నగరానికి ‘ఐఐఐటీ’ శాశ్వత ప్రాంగణంతో మరింత గుర్తింపు వస్తుందని చెప్పారు.
ప్రాచీన వారసత్వం, వర్తమాన బలం, భవిష్యత్ అవకాశాలున్న రాష్ట్రంగా రాజస్థాన్‌ను ఆయన అభివర్ణించారు. నాథ్‌ద్వారా పర్యాటక-సాంస్కృతిక ప్రదేశం గురించి ప్రస్తావిస్తూ- ఇది జైపూర్‌లోని గోవింద్ దేవ్ ఆలయం, సికార్‌లోని ఖతూ శ్యామ్ ఆలయం, రాజ్‌సమంద్‌లోని నాథ్‌ద్వారా ఆలయాలతో కూడిన పర్యాటక వలయమని ప్రధాని వివరించారు. దీనివల్ల రాజస్థాన్ ప్రతిష్ట పెరగడంతోపాటు రాష్ట్ర పర్యాటక రంగానికి ఊపు లభిస్తుందని పేర్కొన్నారు.
“శ్రీకృష్ణునికి అంకితమైన చిత్తోడ్‌గఢ్ సమీపంలోని సావరియా సేఠ్ ఆలయం ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం” అని ప్రధానమంత్రి గుర్తుచేశారు. శ్రీకృష్ణుని ఆరాధించేందుకు ఏటా లక్షలాది యాత్రికులు వస్తుంటారని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దీని ప్రాముఖ్యాన్ని వ్యాపార సంస్థల యజమానులకు వివరిస్తూ- స్వదేశ్ దర్శన్ పథకం కింద ఆలయానికి ఆధునిక సౌకర్యాలు కల్పించబడ్డాయని తెలిపారు. ఇందులో భాగంగా జలయంత్ర-లేజర్ ప్రదర్శన, పర్యాటక సదుపాయాల కేంద్రం, యాంఫీథియేటర్, ఫలహారశాల వంటివి ఏర్పాటయ్యాయని చెప్పారు. ఇవన్నీ యాత్రికులకు మరింత సౌకర్యం సమకూరుస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
“రాజస్థాన్ ప్రగతికి కేంద్ర ప్రభుత్వం అగ్ర ప్రాధాన్యం ఇస్తోంది. రాష్ట్రంలో ఎక్స్‌ప్రెస్ వేలు, హైవేలు, రైల్వేలవంటి ఆధునిక మౌలిక సదుపాయాల సృష్టికి మేమెంతో కృషి చేశాం. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వే లేదా అమృత్‌సర్-జామ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ వే వంటివి రాజస్థాన్‌లో రవాణా సదుపాయాలకు కొత్త బలాన్నిస్తాయి. ఇటీవలే జెండా ఊపి సాగనంపిన ఉదయ్‌పూర్-జైపూర్ వందే భారత్ రైలు విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అలాగే భారత్‌మాల ప్రాజెక్టు ద్వారా అత్యధికంగా లబ్ధి పొందుతున్న రాష్ట్రాల్లో రాజస్థాన్ కూడా ఒకటి” అని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
“సాహసం, కీర్తి, అభివృద్ధితో ముందుకెళ్లాలని రాజస్థాన్ చరిత్ర మనకు బోధిస్తుంది”అని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. అలాగే “నేటి భారతం కూడా అదే బాటలో నడుస్తోంది. అందరి కృషితో వికసిత భారతం నిర్మించడంలో మమేకమయ్యాం. గతంలో వెనుకబడిన వర్గాలతోపాటు నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాల అభివృద్ధే నేడు దేశానికి ప్రథమ ప్రాధాన్యాలు” అని ఆయన వివరించారు. దేశంలో ఐదేళ్ల నుంచి విజయవంతంగా అమలవుతున్న ఆకాంక్షాత్మక జిల్లాల కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ- దీనికింద మేవాడ్ సహా రాజస్థాన్‌లోని పలు జిల్లాలు ప్రుగతి పథంలో పయనిస్తున్నాయని ప్రధాని తెలిపారు. ఈ కృషిని మరో అడుగు ముందుకు తీసుకెళ్లే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆకాంక్షాత్మక సమితులను గుర్తించి, వాటి సత్వర అభివృద్ధిపై దృష్టి సారించిందని ఆయన వెల్లడించారు. రాబోయే రోజుల్లో రాజస్థాన్‌లోని పలు సమితులను ఈ ఆకాంక్షాత్మక సమితుల కార్యక్రమం కింద అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
అణగారిన వర్గాలకు ప్రాధాన్యంలో భాగంగా శక్తిమంతమైన గ్రామాల కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని ప్రధాని తెలిపారు. ఒకనాడు దేశానికి “చివరి అంచునగల గ్రామాలుగా పరిగణించబడిన సరిహద్దు గ్రామాలు నేడు మొదటి గ్రామాలుగా పరిగణించి అభివృద్ధి చేస్తున్నాం. దీనికింద రాజస్థాన్‌లోని డజన్ల కొద్దీ సరిహద్దు గ్రామాలు కూడా ఎంతో ప్రయోజనం పొందుతాయి” అని శ్రీ మోదీ అన్నారు.
నేపథ్యం
దేశంలో గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ దిశగా మరో ముందడుగులో భాగంగా రూ.4,500 కోట్లతో నిర్మించిన మెహ్‌సానా-భటిండా-గురుదాస్‌పూర్ గ్యాస్ పైప్‌లైన్‌ను ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. దీంతోపాటు అబూ రోడ్‌లో ‘హెచ్‌పిసిఎల్’ ఎల్పీజీ ప్లాంట్‌ను కూడా ఆయన అంకితం చేశారు. ఈ ప్లాంటు ద్వారా ఏటా 86 లక్షల సిలిండర్లలో గ్యాస్ నింపి, పంపిణీ చేస్తారు. తద్వారా దాదాపు 0.75 మిలియన్ కిలోమీటర్ల మేర సిలిండర్ రవాణా ట్రక్కుల వినియోగం నికరంగా తగ్గుతుంది. ఈ తగ్గుదలతో ఏటా 0.5 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గించే వీలు కలుగుతుంది. మరోవైపు అజ్మీర్‌లోని ‘ఐఒసిఎల్’ ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంటు ప్రాంగణంలో అదనపు నిల్వ సదుపాయాన్ని కూడా ప్రధాని జాతికి అంకితం చేశారు.
జాతీయ రహదారి నం.12 (కొత్త ఎన్‌హెచ్-52)లో భాగంగా రూ.1480 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించిన దారా-ఝలావర్-తీంధర్ విభాగంలో నాలుగు వరుసల రహదారిని ప్రధాని జాతికి అంకితం చేశారు. దీంతో కోట-ఝలావర్ జిల్లాల్లో గనుల నుంచి ఉత్పత్తుల రవాణా సులభమవుతుంది. అంతేకాకుండా సవాయ్ మాధోపూర్‌లో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)ని 2 వరుసల నుంచి 4 వరుసలుగా విస్తరించి నిర్మించే పనులకు శంకుస్థాపన చేశారు. తద్వారా తరచూ సంభవించే ట్రాఫిక్ రద్దీ నుంచి వాహనదారులకు ఉపశమనం లభిస్తుంది.
ప్రధానమంత్రి జాతికి అంకితం చేసిన రైల్వే ప్రాజెక్టులలో చిత్తోడ్‌గఢ్-నీముచ్ రైలు మార్గం, కోటా-చిత్తోడ్‌గఢ్ విద్యుదీకరణ రైల్వే లైన్ల డబ్లింగ్ పనులున్నాయి. వీటిని రూ.650 కోట్లకుపైగా వ్యయంతో పూర్తిచేయగా, ఈ ప్రాంతంలో రైల్వే మౌలిక సదుపాయాలు బలోపేతమై రాజస్థాన్‌లోని చారిత్రక ప్రదేశాలకు పర్యాటకుల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.
మరోవైపు స్వదేశ్ దర్శన్ పథకం కింద నాథ్‌ద్వారా వద్ద నిర్మించిన పర్యాటక సదుపాయాలను కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. వల్లభాచార్య ప్రబోధిత ‘పుష్టిమార్గ్’ను అనుసరించే లక్షలాది భక్తులకు నాథ్‌ద్వారా కీలక విశ్వాస కేంద్రం. ఇక్కడ ఆధునిక ‘పర్యాటక వివరణ-సాంస్కృతిక కేంద్రం’ కూడా నిర్మించబడింది. ఇది శ్రీనాథ జీవిత విశేషాలను వివిధ కోణాల్లో పర్యాటకుల అనుభవంలోకి తెస్తుంది. అలాగే కోటాలోని ‘ఐఐఐటీ’ శాశ్వత ప్రాంగణాన్ని కూడా ప్రధాని జాతికి అంకితం చేశారు.
***
DS/TS
(Release ID: 1963273)
Visitor Counter : 108
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam