సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సీనియర్‌ నటి వహీదా రెహ్మాన్‌కు 'దాదాసాహెబ్ ఫాల్కే జీవితకాల సాఫల్య పురస్కారం' ప్రకటన

Posted On: 26 SEP 2023 2:43PM by PIB Hyderabad

ప్రముఖ సీనియర్‌ నటి శ్రీమతి వహీదా రెహ్మాన్‌కు కేంద్ర ప్రభుత్వం 53వ ‘దాదా సాహెబ్‌ ఫాల్కే జీవితకాల సాఫల్య పురస్కారం’ ప్రకటించింది. 2021 సంవత్సరానికి ఈ అవార్డుతో సత్కరించనున్నట్లు కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఈరోజు ప్రకటించారు. భారతీయ సినిమాకు వహీదా రెహ్మాన్‌ అందించిన సహకారానికి ఆమెకు ఈ అవార్డును ప్రకటించడం పట్ల చాలా సంతోషంగా, గౌరవంగా భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు.

వహీదా రెహ్మాన్ ప్యాసా, కాగజ్ కే ఫూల్, చౌదావిన్ కా చాంద్, సాహెబ్ బీవీ ఔర్ గులామ్, గైడ్, ఖామోషి సహా చాలా హిందీ చిత్రాల్లో పోషించిన పాత్రలకు విమర్శకుల ప్రశంసలు పొందారని మంత్రి చెప్పారు. “ఐదు దశాబ్దాల పాటు సాగిన ఆమె సినీ ప్రయాణంలో, అత్యంత నైపుణ్యంతో తన పాత్రలను పోషించారు. రేష్మ ఔర్‌ షేరా చిత్రంలో నటనకు జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్నారు. పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డుల గ్రహీత అయిన వహీదా జీ, అంకితభావం, నిబద్ధత, కృషితో అత్యున్నత స్థాయి వృత్తిపరమైన నైపుణ్యాన్ని సాధించగల భారతీయ మహిళల శక్తికి ఉదాహరణగా నిలిచారు" అని అన్నారు.

నారీ శక్తి వందన్ అధినియమ్‌ను ఆమోదించిన తర్వాత ఒక నటికి ఈ పురస్కారం రావడంపై మంత్రి మాట్లాడుతూ, “చారిత్రక నారి శక్తి వందన్ అధినియంను పార్లమెంటు ఆమోదించిన తరుణంలో, వహీదా రెహ్మాన్‌ దాదాసాహెబ్ ఫాల్కే జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ప్రకటిస్తున్నాం. భారతీయ చలనచిత్ర రంగంలోని ప్రముఖ మహిళల్లో ఒకరు, సినిమాల తర్వాత తన జీవితాన్ని దాతృత్వానికి & సమాజ సేవకు అంకితం చేసిన వారికి ఈ పురస్కారం దక్కడం సముచిత గౌరవం" అన్నారు.

69వ జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుకలో ఈ అవార్డును అందజేయనున్నారు.

ఈ కింది సభ్యులు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఎంపిక కమిటీలో ఉన్నారు:

  1. ఆశా పరేఖ్
  2. చిరంజీవి
  3. పరేష్ రావల్
  4. ప్రసేన్‌జిత్ ఛటర్జీ
  5. శేఖర్ కపూర్

తమ జీవితకాలంలో కేవలం అతి కొద్ది మంది నటులు మాత్రమే సాధించగల ఘనతలను ఈ సీనియర్‌ నటి సాధించారు. తన నటన నైపుణ్యంతో వహీదా రెహ్మాన్ అనేక అవార్డులు గెలుచుకున్నారు. గైడ్ (1965), నీల్ కమల్‌లో (1968) ఆమె పోషించిన పాత్రలను ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాలు వరించాయి. నటి ఉత్తమ నటిగా (1971) జాతీయ అవార్డును కూడా గెలుచుకున్నారు. భారత ప్రభుత్వం 1972లో ఆమెను పద్మశ్రీతో సత్కరించింది. ఆ తర్వాత 2011లో పద్మభూషణ్‌ అందుకున్నారు. వహీదా రెహ్మాన్, తన ఐదు దశాబ్దాల సినీ జీవితంలో 90కి పైగా చిత్రాల్లో నటించారు, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 

 

***


(Release ID: 1961096) Visitor Counter : 174