వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

సులభతర వ్యాపార నిర్వహణకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది... కేంద్ర,వాణిజ్య,పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్


ఆత్మ విశ్వాసంతో పెద్ద లక్ష్యాల సాధన కోసం వ్యాపారవేత్తలు కృషి చేయాలి... బడా బిజినెస్ ఎంట్రప్రెన్యూర్స్ లాంచ్‌ప్యాడ్‌ సమావేశంలో శ్రీ పీయూష్ గోయల్

దేశంలో జరుగుతున్న అభివృద్ధిని జీ-20 అధ్యక్ష హోదాలో ప్రపంచానికి భారతదేశం చాటి చెప్పింది... శ్రీ పీయూష్ గోయల్

త్వరితగతిన అభివృద్ధి చెందాలనే తపనతో భారత యువత కృషి చేస్తోంది... శ్రీ గోయల్ గుర్తించారు.

Posted On: 23 SEP 2023 6:54PM by PIB Hyderabad

సులభతర వ్యాపార నిర్వహణకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని  కేంద్ర,వాణిజ్య,పరిశ్రమలు,  వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం,ప్రజా పంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ అన్నారు. 

 వ్యాపారాలను ప్రారంభించడం,నిర్వహించడం సులభతరంగా జరిగేలా చూడాలన్నది ప్రభుత్వ విధానమని శ్రీ గోయల్ స్పష్టం చేశారు.న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన బడా బిజినెస్  'ఎంట్రప్రెన్యూర్స్ లాంచ్‌ప్యాడ్' కార్యక్రమంలో శ్రో గోయల్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రసంగించిన శ్రీ గోయల్  స్టార్టప్ ఇండియా సాధించిన విజయాన్ని వివరించారు. దేశంలో  2016 నాటికి కేవలం  450 స్టార్టప్‌లు ఉన్నాయని తెలిపిన శ్రీ గోయల్ ఇప్పుడు ఈ సంఖ్య  1 లక్షకు పైగా ఉందన్నారు. గణనీయమైన వృద్ధి సాధించిన స్టార్టప్‌ రంగం  ప్రపంచంలో మూడవ అతిపెద్దది స్టార్టప్‌ రంగంగా గుర్తింపు పొందిందన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న వారికి స్ఫూర్తి కలిగించే విధంగా ప్రసంగించిన శ్రీ గోయల్  తన స్వంత వ్యవస్థాపక అనుభవం, అభివృద్ధి పథంలో ఎదురైన  సవాళ్ళు, సవాళ్ళను పరిష్కరించడానికి అమలు చేసిన విధానాలు వివరించారు. ఆత్మ విశ్వాసంతో  పెద్ద లక్ష్యాల సాధన కోసం వ్యాపారవేత్తలు కృషి చేయాలని శ్రీ పీయూష్ గోయల్ సూచించారు. దేశ పురోగతికి సహకరించాలని వ్యాపారవేత్తలను కోరిన శ్రీ గోయల్ తమ తమ రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు.  

 జీ-20 అధ్యక్ష దేశంగా భారతదేశం అంతర్జాతీయ గుర్తింపు సాధించిందని శ్రీ గోయల్ అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత  నాయకత్వంలో దేశంలోసాధించిన  అభివృద్ధిని జీ-20 అధ్యక్ష హోదాలో ప్రపంచానికి భారతదేశం చాటి చెప్పిందన్నారు. కృషి,అంకితభావంతో పని చేసి  ప్రతిష్టాత్మక లక్ష్యాలను సాధించడానికి,  ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి, సుసంపన్నమైన భవిష్యత్తును సాధించడానికి కృషి జరగాలన్నారు. 

త్వరితగతిన అభివృద్ధి చెందాలనే తపనతో  భారత యువత కృషి చేస్తోందని శ్రీ గోయల్ అన్నారు. అమృత కాలంలో  భారత దేశ అభివృద్ధిలో యువత   కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. భారతదేశం సగటు వయస్సు 30 సంవత్సరాల కంటే తక్కువగా ఉందని వివరించిన శ్రీ గోయల్ జనాభా పరంగా దేశానికి లభిస్తున్న ప్రయోజనాలు  రాబోయే మూడు దశాబ్దాల పాటు కొనసాగుతాయని అన్నారు. 2047 నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

భారతదేశంలో లభిస్తున్న వైవిధ్య  వ్యాపార అవకాశాలు, ఆర్థిక వృద్ధికి గల అవకాశాలను  ప్రపంచ దేశాలు గుర్తించాయని శ్రీ గోయల్ తెలిపారు. భారతదేశంలో వ్యాపారాలు ప్రారంభించడానికి విదేశీ సంస్థలు ముందుకు వస్తున్నాయన్నారు.  భారతదేశానికి చెందిన  STEM గ్రాడ్యుయేట్లకు  ప్రపంచ వ్యాప్తంగా అవకాశాలు లభిస్తున్నాయని శ్రీ గోయల్ పేర్కొన్నారు. 

వలసవాద మనస్తత్వం నుంచి భారతదేశం బయటపడిందని శ్రీ గోయల్ అన్నారు.  భారత్ మండపం, యశో భూమి, కర్తవ్య మార్గం, ప్రధానమంత్రి సంగ్రహాలయ వంటి అనేక ప్రాజెక్టులు పరివర్తన మార్పుకు సంకేతాలుగా పేర్కొన్నారు. విద్యుత్ కనెక్షన్, డిజిటల్ కనెక్టివిటీ, వంట గ్యాస్ సదుపాయం, పైపుల ద్వారా నీటి సరఫరా, ఆరోగ్యం మరియు విద్యా రంగంలో సాధించిన పురోగతి వంటి సంక్షేమ చర్యల ద్వారా 140 కోట్ల మంది భారతీయుల జీవితాలను మెరుగు పరచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. 

దేశాభివృద్ధికి పౌరులందరూ విధి మరియు అంకిత భావంతో పని చేయాలని శ్రీ గోయల్ కోరారు. ఉత్తేజపరిచేందుకు మరియు పాల్గొనేవారికి జ్ఞానాన్ని అందించడానికి, వ్యవస్థాపకత వృద్ధిని పెంపొందించడానికి  ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లాంచ్‌ప్యాడ్‌ను ప్రారంభించడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. 

 

***



(Release ID: 1960053) Visitor Counter : 103