చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
దేశంలో ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఉన్నత స్థాయి కమిటీ ప్రాథమిక సమావేశం
Posted On:
23 SEP 2023 4:08PM by PIB Hyderabad
దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలు పరిశీలించి, సిఫార్సులు చేసేందుకు భారత మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన నియామకమైన అత్యున్నత స్థాయి కమిటీ ఈ రోజు ప్రాథమిక సమావేశాన్ని నిర్వహించింది. కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా, కేంద్ర చట్ట &న్యాయ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ అర్జున్ రామ్ మేఘ్‌వాల్, రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నేత శ్రీ గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ శ్రీ ఎన్.కె. సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ డా.సుభాష్ సి కశ్యప్, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ శ్రీ సంజయ్ కొఠారి ఈ సమావేశానికి హాజరయ్యారు. సీనియర్ న్యాయవాది శ్రీ హరీష్ సాల్వే వర్చువల్ పద్ధతిలో సమావేశంలో పాల్గొన్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీ నాయకుడు శ్రీ అధిర్ రంజన్ చౌదరి ఈ సమావేశానికి హాజరు కాలేదు.
అత్యున్నత స్థాయి కమిటీ సభ్యులకు స్వాగతం పలికిన కమిటీ చైర్మన్ శ్రీ రామ్ నాథ్ కోవింద్, సమావేశం ఎజెండాను వివరించారు.
కమిటీ పని విధానాలను శ్రీ రామ్ నాథ్ కోవింద్ వివరించారు. దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహణ అంశంపై సూచనలు/అభిప్రాయాలు కోరేందుకు గుర్తింపు పొందిన జాతీయ రాజకీయ పార్టీలు, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీలు, పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం ఉన్న రాజకీయ పార్టీలు, గుర్తింపు పొందిన రాష్ట్ర రాజకీయ పార్టీలను ఆహ్వానించాలని కమిటీ నిర్ణయించింది. దేశంలో ఏకకాల ఎన్నికల అంశంపై సూచనలు/అభిప్రాయాలు రూపొందించడానికి భారత న్యాయ కమిషన్‌ను కూడా కమిటీ ఆహ్వానిస్తుంది.
ధన్యవాదాల తీర్మానంతో సమావేశం ముగిసింది.
***
(Release ID: 1960050)
Visitor Counter : 226