పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మధ్యప్రదేశ్ లోని బి.పి.సి.ఎల్. బినా రిఫైనరీలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేసిన - ప్రధానమంత్రి

మధ్యప్రదేశ్ అభివృద్ధిలో కొత్త శిఖరాలకు చేరుకోవడం మన నిరంతర కృషి - ప్రధానమంత్రి నరేంద్ర మోదీ


ఈ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్ తో పాటు బుందేల్‌ఖండ్ ప్రాంతంలో పారిశ్రామికాభివృధి లో విప్లవాత్మక మార్పు తెస్తుంది - హర్దీప్ ఎస్ పూరి


స్వావలంబన, స్థిరమైన పారిశ్రామికాభివృధికి, భారతదేశ నిబద్ధతను బలోపేతం చేయడానికి, పెట్రోకెమికల్స్ రంగంలో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలబెట్టడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుంది - హర్దీప్ ఎస్ పూరి

Posted On: 14 SEP 2023 2:42PM by PIB Hyderabad

మధ్యప్రదేశ్‌లోని బినాలో బి.పి.సి.ఎల్. బినా రిఫైనరీలో డౌన్‌-స్ట్రీమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ తో పాటు, రిఫైనరీ విస్తరణ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు శంకుస్థాపన చేశారు.  దాదాపు 49,000 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేయనున్న ఈ అత్యాధునిక రిఫైనరీ, టెక్స్‌టైల్స్, ప్యాకేజింగ్, ఫార్మా వంటి వివిధ రంగాలకు కీలకమైన దాదాపు 1200 కె.టి.పి.ఏ. (కిలో టన్నులు సంవత్సరానికి) ఇథిలీన్, ప్రొపైలిన్‌ లను ఉత్పత్తి చేస్తుంది.  దేశం దిగుమతులపై ఆధారపడటాన్ని ఇది తగ్గిస్తుంది. 'ఆత్మనిర్భర్ భారత్' సాధించాలన్న ప్రధానమంత్రి దార్శనికతను నెరవేర్చడానికి ఇది ఒక ముందడుగు అవుతుంది.  ఈ మెగా ప్రాజెక్టు ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది.  పెట్రోలియం రంగంలో దిగువ స్థాయి పరిశ్రమల అభివృద్ధికి ఊతం ఇస్తుంది.


ఈ సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మాట్లాడుతూ, “మ‌ధ్య‌ప్ర‌దేశ్ అభివృద్ధిలో కొత్త శిఖ‌రాల‌కు చేరుకోవ‌డం మా నిరంతర ప్ర‌య‌త్నం, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లోని ప్రతి కుటుంబ జీవనం సుల‌భ‌మ‌వుతుంది, ప్రతి ఇల్లు శ్రేయస్సును తెస్తుంది.  మోదీ ఇచ్చిన హామీ ట్రాక్ రికార్డు మీ ముందు ఉంది”. అని పేర్కొన్నారు.  రాష్ట్రంలో పేదలకు 40 లక్షల పక్కా ఇళ్లు, మరుగుదొడ్లు, ఉచిత వైద్యం, బ్యాంకు ఖాతాలు, పొగలేని వంటశాలలు వంటి హామీలను నెరవేర్చామని ప్రధానమంత్రి చెప్పారు.  రక్షా బంధన్ సందర్భంగా గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించిన విషయాన్ని కూడా ప్రధానమంత్రి తమ ప్రసంగంలో ప్రస్తావించారు.  "దీని కారణంగా, ఉజ్వల లబ్ధిదారులైన సోదరీమణులు ఇప్పుడు 400 రూపాయల తక్కువ ధరకు సిలిండర్‌ను పొందుతున్నారు" అని ఆయన చెప్పారు.  "అందుకే, కేంద్ర ప్రభుత్వం నిన్న మరో కీలక నిర్ణయం తీసుకుంది.  ఏ సోదరి కూడా గ్యాస్ కనెక్షన్‌ లేకుండా ఉండకూడదనేది మా లక్ష్యం” అని ప్రధానమంత్రి తెలియజేశారు. 

ప్రభుత్వం తన ప్రతి హామీని నెరవేర్చేందుకు పూర్తి చిత్తశుద్ధితో పని చేస్తోందని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు.  ప్రతి లబ్దిదారునికి పూర్తి ప్రయోజనాలను అందించడానికి వీలుగా, మధ్యవర్తిని తొలగించడాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.   ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజనాలను ఉదాహరణలతో సహా వివరిస్తూ, లబ్ధిదారుడైన ప్రతి రైతు అతని బ్యాంకు ఖాతాకు నేరుగా  28,000 రూపాయల ప్రయోజనాన్ని  పొందినట్లు చెప్పారు.  ఈ పథకం కోసం ప్రభుత్వం 2,60,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని ప్రధానమంత్రి తెలియజేశారు.  గత తొమ్మిదేళ్ళలో రైతుల ఖర్చు తగ్గించి, తక్కువ ధరకే ఎరువులు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేసిందని, గత తొమ్మిదేళ్ళలో ఇందుకోసం పది లక్షల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిన విషయాన్ని ప్రధానమంత్రి మోదీ తెలియజేశారు.  అమెరికా రైతులకు 3,000 రూపాయల వరకు ఖరీదు చేసే యూరియా బస్తాను మూడు వందల రూపాయల కంటే తక్కువ ధరకే భారతీయ రైతులకు అందుబాటులో ఉంచారని పేర్కొన్నారు.  గతంలో వేల కోట్ల రూపాయల యూరియా కుంభకోణాలను ఎత్తిచూపిన ఆయన అదే యూరియా ఇప్పుడు అన్ని చోట్లా సులువుగా లభిస్తోందని చెప్పారు. 

 

 

మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్;  మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు, కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పెట్రోలియం, సహజ వాయువు, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పురి మాట్లాడుతూ,  "ఈ పెట్రోకెమికల్ ప్లాంట్ బినాకు మాత్రమే కాకుండా బుందేల్‌ ఖండ్ తో పాటు మధ్యప్రదేశ్‌ ప్రజలకు గౌరవనీయులైన ప్రధానమంత్రి ఇచ్చిన బహుమతి." అని అభివర్ణించారు. 

ఈ సందర్భంగా పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి శ్రీ పురి మాట్లాడుతూ, ప్లాస్టిక్, ప్యాకేజింగ్ మెటీరియల్, ప్లాస్టిక్ షీట్లు, గృహ, పారిశ్రామిక అవసరాలకు సంబంధించిన ఇతర వస్తువుల రంగంలో వివిధ క్షేత్ర స్థాయి యూనిట్లను మధ్యప్రదేశ్‌ లోని బుందేల్‌ ఖండ్ ప్రాంతంలో నెలకొల్పే ఈ కొత్త పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ప్రోత్సహిస్తుందని చెప్పారు.   ఇది బులంద్ బుందేల్‌ ఖండ్‌ కు పునాది వేస్తుందని ఆయన అన్నారు.

గుజరాత్‌ లోని దహేజ్ ప్రాంత అభివృద్ధికి దోహదపడిన ఓ.పి.ఏ.ఎల్. ప్లాంటు ఉదాహరణను కేంద్ర మంత్రి గుర్తుచేసుకుంటూ,   ఈ ప్రాజెక్ట్ విజయవంతంగా అమలు చేయడం వల్ల మధ్యప్రదేశ్ లో ముఖ్యంగా బుందేల్‌ఖండ్ ప్రాంతంలో పారిశ్రామికాభివృద్ధిలో విప్లవాత్మక మార్పులు వస్తాయని, వికసిత్ భారత్ దార్శనికతను సాధించడంలో సహాయపడుతుందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 

ఈ ప్రాజెక్ట్ స్వావలంబన, స్థిరమైన పారిశ్రామిక వృద్ధికి భారతదేశ నిబద్ధతను బలపరుస్తుందని, దేశాన్ని పెట్రోకెమికల్స్ రంగంలో ప్రపంచ నాయకుడిగా నిలబెడుతుందని కూడా శ్రీ హర్దీప్ సింగ్ పూరి తెలియజేశారు.  ప్రపంచవ్యాప్తంగా, పెట్రోకెమికల్ రంగంలో భారతదేశం 6వ స్థానంలో ఉంది.  ఇది సుమారుగా 15.58 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.  ఇది 2040 నాటికి 82 లక్షల కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం ఉంది.

ఇటీవలి సంవత్సరాల్లో ప్రపంచ చమురు, గ్యాస్ పరిశ్రమలో అస్థిరత గురించి, పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి మాట్లాడుతూ, గత రెండేళ్లలో, ప్రపంచ చమురు, గ్యాస్ పరిశ్రమలో చాలా అస్థిరత నెలకొన్నందువల్ల మన పొరుగు దేశాలతో పాటు, అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇంధన కొరతను ఎదుర్కొన్నాయని చెప్పారు.  కాగా, మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దూరదృష్టి, పౌర కేంద్రీకృత విధానాల కారణంగా, గత 2 సంవత్సరాల్లో మనదేశంలో చమురు, గ్యాస్ కొరత లేదనీ, ఇంధన ధరల్లో పెరుగుదల లేని ఏకైక దేశం భారతదేశమేనని ఆయన పేర్కొన్నారు.   ప్రపంచ చమురు, గ్యాస్ ధరల పెరుగుదల నుండి భారతీయ పౌరులు పూర్తిగా రక్షింపబడ్డారని మంత్రి చెప్పారు.

ఈ కార్యక్రమంలో శ్రీ హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, ఇంధన మౌలిక సదుపాయాలకు సంబంధించిన వివిధ పరిస్థితులపై మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2014 నుండి పురోగతిని కూడా వివరించారు.   రాష్ట్రంలో రిటైల్ అవుట్‌-లెట్‌ లు / పెట్రోల్ పంపుల సంఖ్య 2014 లో 2,854 ఉండగా ప్రస్తుతం 5,938 కి పెరిగిందని ఆయన నొక్కి చెప్పారు.  అదేవిధంగా ఎల్.పి.జి. డిస్ట్రిబ్యూటర్ల సంఖ్య 2014 లో 866 ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 1,551 కి పెరిగినట్లు ఆయన తెలియజేశారు.  2014 లో 44 శాతంగా ఉన్న ఎల్.పి.జి. వ్యాప్తి ఇప్పుడు 100 శాతానికి చేరుకుంది.  రాష్ట్రంలో పి.ఎన్.జి. కనెక్షన్ల సంఖ్య 2014 లో 2,783 ఉండగా, అవి ఇప్పుడు 2,15,185 కి పెరిగాయి.  అదేవిధంగా, సి.ఎన్.జి. స్టేషన్లను 2014 లో కేవలం 15 ఉండగా ఇప్పుడు 275 కి పెరిగాయి.   నేచురల్ గ్యాస్ పైప్‌-లైన్ పొడవు 802 కి.మీ నుండి 6,862 కి.మీ కి పెరగడం ద్వారా గణనీయమైన పురోగతిని సాధించింది.


 

****



(Release ID: 1957588) Visitor Counter : 91