రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

తుర్కియేలో జరిగిన 19వ 'హెడ్స్‌ ఆఫ్‌ ఏసియన్‌ కోస్ట్ గార్డ్ ఏజెన్సీస్‌ మీటింగ్'లో పాల్గొన్న భారతీయ తీర రక్షణ దళం

Posted On: 10 SEP 2023 6:54PM by PIB Hyderabad

ఈ నెల 05-08 తేదీల్లో, తుర్కియేలోని ఇస్తాంబుల్‌లో జరిగిన 19వ 'హెడ్స్‌ ఆఫ్‌ ఏసియన్‌ కోస్ట్ గార్డ్ ఏజెన్సీస్‌ మీటింగ్'లో (హాక్గామ్‌) భారతీయ తీర రక్షణ దళం (ఐసీజీ) పాల్గొంది. భారతీయ తీర రక్షణ దళం డైరెక్టర్ జనరల్ డి.జి. రాకేష్ పాల్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల ఐసీజీ బృందం, ఈ స్వతంత్ర ఫోరం వార్షిక కార్యక్రమంలో భాగస్వామి అయింది. 23 దేశాల తీర రక్షణ దళాలు, రీకాప్‌, యూఎన్‌వోడీసీ నుంచి రెండు అనుబంధ సంస్థలు కూడా పాల్గొన్నాయి.

మూడు రోజుల ఉన్నత స్థాయి సమావేశంలో, సముద్ర చట్టాల అమలు, సముద్ర జీవుల రక్షణ & భద్రత, సముద్ర పర్యావరణ పరిరక్షణ, మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, మనుషుల అక్రమ రవాణా నియంత్రణ వంటి అంశాలపై చర్చించారు. పరస్పరం మరింత సహకరించుకునేలా అజెండా రూపొందించారు. 'ఆసియన్ కోస్ట్ గార్డ్స్' సభ్య దేశాల మధ్య సముద్ర రంగ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఫోరం నిర్ణయించింది.

1999 నవంబర్‌లో ఎంపీ అలోండ్రా రెయిన్‌బో అనే సముద్ర దొంగల నౌకను భారతీయ తీర రక్షణ దళం స్వాధీనం చేసుకున్న తర్వాత, ప్రాంతీయ తీర రక్షణ దళాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించడానికి జపాన్‌ తీసుకున్న చొరవ ఫలితంగా ఈ బహుళ దేశాల ఫోరం ఏర్పడింది. సురక్షితమైన, భద్రతతో కూడిన, కాలుష్యం లేని సముద్ర జలాలు ఉండేలా చూడడం హాక్గామ్‌ విధి. ఇందుకోసం ఈ ఫోరంలో నాలుగు కార్యాచరణ బృందాలు పని చేస్తుంటాయి. అన్వేషణ &సహాయం (సార్‌) బృందానికి భారతీయ తీర రక్షణ దళం నేతృత్వం వహిస్తోంది. సముద్ర పర్యావరణ పరిరక్షణ, సముద్ర జలాల్లో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను నియంత్రించడం, సమాచారాన్ని పంచుకోవడం వంటి విధులు నిర్వర్తిస్తున్న ఇతర బృందాల్లో చురుకైన సభ్య సంస్థగా ఉంది. హాక్గామ్‌ గత సమావేశం 2022లో న్యూదిల్లీలో జరిగింది.

 

****



(Release ID: 1956081) Visitor Counter : 119