రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

శ్రీలంకలో రెండు రోజుల పర్యటన పూర్తి చేసుకుని భారత్‌ బయలు దేరిన ఐఎన్‌ఎస్‌ దిల్లీ

Posted On: 03 SEP 2023 6:29PM by PIB Hyderabad

శ్రీలంకలో రెండు రోజుల పర్యటన తర్వాత, ఐఎన్‌ఎస్‌ దిల్లీ ఇవాళ కొలంబో నుంచి భారత్‌ బయలుదేరింది.

పర్యటన సమయంలో, భారత్‌-శ్రీలంక నౌకాదళాల సిబ్బంది మధ్య ఉమ్మడి ప్రయోజనాలు ఉన్న సహకార కార్యక్రమాలు, పరస్పర శిక్షణలు జరిగాయి. క్రో ఐలాండ్ బీచ్‌లో పారిశుద్ధ్య కార్యక్రమాన్ని కూడా రెండు నౌకాదళాల సిబ్బంది చేపట్టారు. 200 మందికి పైగా ఎన్‌సీసీ క్యాడెట్‌లు, 500 మంది స్థానిక సందర్శకులకు ఐఎన్‌ఎస్‌ దిల్లీని సందర్శించే అవకాశాన్ని భారత నౌకాదళ సిబ్బంది కల్పించారు.

పశ్చిమ నౌకాదళం కమాండర్, రియర్‌ అడ్మిరల్‌ సురేష్ డి సిల్వాతో ఐఎన్‌ఎస్‌ దిల్లీ కమాండింగ్ ఆఫీసర్ సమావేశం నిర్వహించారు. 1987-91 కాలంలో, ఐపీకేఎఫ్‌ కార్యకలాపాల్లో పాల్గొని శ్రీలంకలో ప్రాణత్యాగం చేసిన భారతీయ సైనికులకు గౌరవసూచకంగా ఐపీకేఎఫ్‌ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు.

మిత్ర దేశాలకు అవసరమైన వైద్య సామగ్రిని అందించడానికి భారతదేశం చేపట్టిన 'ఆరోగ్య మైత్రి' కార్యక్రమంలో భాగంగా, శ్రీలంకలోని భారత హై కమిషనర్ శ్రీ గోపాల్ బాగ్లే, శ్రీలంక పార్లమెంటు సభాపతికి అత్యాధునిక ఆరోగ్య మైత్రి క్యూబ్‌ను అందించారు. ఐఎన్‌ఎస్‌ దిల్లీలో జరిగిన విందు కార్యక్రమంలో క్యూబ్‌ను అందజేశారు. ఈ వైద్య కూబ్‌లను ప్రాజెక్ట్ భీష్మ్ (భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహ్యోగ్ హిత మరియు మైత్రి) కింద దేశీయంగా అభివృద్ధి చేశారు. శ్రీలంక పార్లమెంటు సభాపతితో పాటు, శ్రీలంక ఓడరేవులు, నౌకా రవాణా శాఖ మంత్రి, అటార్నీ జనరల్, రక్షణ శాఖ కార్యదర్శి, త్రివిధ దళాల అధిపతులు సహా సీనియర్ అధికారులు ఈ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఐఎన్‌ఎస్ దిల్లీ, ఎస్‌ఎల్‌ఎన్ షిప్ విజయబాహు మధ్య కొలంబో సముద్రంలో జరిగిన విన్యాసాలతో ఈ పర్యటన ముగిసింది.

__



(Release ID: 1954523) Visitor Counter : 156