అంతరిక్ష విభాగం
azadi ka amrit mahotsav

పి ఎస్ ఎల్ వి -ఎక్స్ఎల్ తో భారతదేశ మొట్టమొదటి సోలార్ మిషన్ ప్రయోగం “ఇండియాకు సూర్యుని కాంతి క్షణం": డాక్టర్ జితేంద్ర సింగ్


నక్షత్రాలను చేరుకోవడానికి , విశ్వ రహస్యాలను కనుగొనడానికి మనకు సంకల్ప బలం ఇచ్చినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు: డాక్టర్ జితేంద్ర సింగ్

‘చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండ్ అయిన తక్కువ సమయం లోనే ఆదిత్య ఎల్1 ప్రయోగం విజయవంతం కావడం యావత్ సైన్స్, యావత్ దేశం దృక్పథానికి నిదర్శనం ‘

140 కోట్ల మంది ప్రజల సమిష్టి సంకల్పం, సమిష్టి కృషితో రాబోయే 25 ఏళ్ల అమృత్ కాల్, భరతమాత ప్రతిజ్ఞలతో ప్రపంచ పీఠంపై గర్వించదగ్గ స్థానాన్ని చేరుకోవడానికి, ఆక్రమించడానికి ఈ రోజు, 2023 సెప్టెంబర్ 2వ తేదీ లెక్కించదగిన రోజు: డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 02 SEP 2023 3:04PM by PIB Hyderabad

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత విశ్వసనీయ ఉపగ్రహ వాహక నౌక- పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పిఎస్ఎల్ వి - ఎక్స్ఎల్) ఈ రోజు భారతదేశ మొట్టమొదటి సోలార్ మిషన్ - ఆదిత్య ఎల్ 1 ను శ్రీహరికోట రేంజ్ నుండి విజయవంతంగా ప్రయోగించింది, కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ దీనిని భారతదేశ " ఉషా కిరణ క్షణం" గా అభివర్ణించారు.

భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పీఎస్ఎల్వీ-సీ57 ద్వారా ఆదిత్య ఎల్1ను ప్రయోగించిన వెంటనే మిషన్ కంట్రోల్ రూమ్ లో ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లనుద్దేశించి ప్రసంగిస్తూ, అత్యంత ఉత్కంఠ తో ఎదురు చూసిన యావత్ ప్రపంచం ప్రయోగం విజయవంతం కాగానే ఊపిరి పీల్చుకున్న క్షణం దేశానికి ఒక్కసారిగా సూర్యుని వెలుగు ప్రసరించిన సమయమని డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. 

'భారతీయ శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తున్నారు.  ఇప్పుడు ఫలితం వచ్చిన క్షణం. జాతి తన ప్రతిజ్ఞను పునరుద్ధరించే క్షణం వచ్చింది" అని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), పి ఎం ఒ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, స్పేస్ అండ్ అటామిక్ ఎనర్జీ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 

‘భారత అంతరిక్ష రంగానికి కొత్త దారులు తెరవడం ద్వారా, ఆకాశం హద్దు కాదని చెప్పడం ద్వారా‘ దీనిని సాధ్యం చేసినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి డాక్టర్ జితేంద్ర సింగ్ కృతజ్ఞతలు తెలిపారు.

"నక్షత్రాలను చేరుకోవడానికి , విశ్వ రహస్యాలను కనుగొనడానికి మనకు విశ్వాసం, ధైర్యం మరియు నమ్మకాన్ని ఇచ్చినందుకు కూడా గౌరవ ప్రధానికి ధన్యవాదాలు. మన అంతరిక్ష రంగంలోని అపారమైన సామర్థ్యాన్ని గుర్తించేలా చేసినందుకు కూడా ధన్యవాదాలు' అని ఆయన పేర్కొన్నారు.

చంద్రయాన్ -3 విజయవంతంగా ల్యాండ్ అయిన స్వల్ప సమయం లోనే ఆదిత్య ఎల్ 1 ప్రయోగం విజయవంతమవడం మన ప్రపంచ సంస్కృతిలో మనం అవలంబించాలని అనుకుంటున్న 'మొత్తం సైన్స్, యావత్ దేశం' విధానానికి నిదర్శనమని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.

ఈ విజన్ ను అమలు చేసిన ఘనత ఇస్రోకే దక్కగా, దేశవ్యాప్తంగా ఉన్న సైన్స్ ఇన్ స్టిట్యూట్ లు ఈ విజన్ కు చిన్నా పెద్దా ఏదో ఒక రూపంలో సహకారం అందించేందుకు ముందుకొచ్చాయి. ఈ జాబితా చాలా పెద్దది అని, వాటిలో - ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, బెంగళూరు, నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీస్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ముంబై, ఎన్జీఆర్ఐ నాగపూర్ , ఐఐటీ ఖరగ్ పూర్ , ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ ముంబై కొన్ని సంస్థలని కేంద్రమంత్రి తెలిపారు. 

ఆదిత్య ఎల్ 1 ప్రయోగాన్ని సమిష్టి కృషిగా పేర్కొంటూ, ఇది ' విలువైన లెక్కించాల్సిన రోజు'గా డాక్టర్ జితేంద్ర సింగ్ అభివర్ణించారు.

“140 కోట్ల మంది ప్రజల సమిష్టి సంకల్పం, సమిష్టి కృషితో రాబోయే 25 ఏళ్ల అమృత్ కాల్, భరతమాత ప్రతిజ్ఞలతో ప్రపంచ పీఠంపై గర్వించదగ్గ స్థానాన్ని చేరుకోవడానికి, ఆక్రమించడానికి ఈ రోజు, 2023 సెప్టెంబర్ 2వ తేదీ లెక్కించదగిన రోజు అని” ఆయన అన్నారు.

కాగా, పీఎస్ఎల్ వి - సి 57 ద్వారా ఆదిత్య-ఎల్1 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశామని, ఈ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు ఇస్రో ధృవీకరించింది. దీనితో, భారతదేశపు మొట్టమొదటి సోలార్ అబ్జర్వేటరీ సూర్యుడు-భూమి ఎల్ 1 బిందువు వద్ద గమ్యస్థానానికి తన ప్రయాణాన్ని ప్రారంభించింది.

సోలార్ ప్యానెళ్లను అమర్చడంతో ఆదిత్య-ఎల్1 విద్యుదుత్పత్తి ప్రారంభించిందని ఇస్రో తెలిపింది.

సూర్యుడిపై అధ్యయనం చేసిన తొలి అంతరిక్ష ఆధారిత భారతీయ మిషన్ ఆదిత్య ఎల్1. వివిధ కక్ష్య పెంపు విన్యాసాలు, క్రూయిజ్ దశ ద్వారా వచ్చే నాలుగు నెలలలో వ్యోమనౌకను భూమికి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్య-భూమి వ్యవస్థ లోని లాగ్రాంజ్ పాయింట్ 1 (ఎల్ 1) చుట్టూ హాలో కక్ష్యలో ఉంచుతారు.

ఎల్ 1 బిందువు చుట్టూ హాలో కక్ష్యలో ఉంచిన ఉపగ్రహం సూర్యుడిని ఎటువంటి ఆచ్చాదనం / గ్రహణాలు లేకుండా నిరంతరం వీక్షించే ప్రధాన ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. ఇది సౌర కార్యకలాపాలను , అంతరిక్ష వాతావరణంపై దాని ప్రభావాన్ని వాస్తవిక సమయం (రియల్ టైమ్) లో పరిశీలించడానికి ఎక్కువ ప్రయోజనాన్ని అందిస్తుంది.

విద్యుదయస్కాంత, కణ, అయస్కాంత క్షేత్ర డిటెక్టర్లను ఉపయోగించి సూర్యుడి ఫోటోస్ఫియర్, క్రోమోస్పియర్, సూర్యుడి (కరోనా) బాహ్య పొరలను పరిశీలించడానికి వ్యోమనౌక ఏడు పేలోడ్లను కలిగి ఉంటుంది.

ప్రత్యేక వాంటేజ్ పాయింట్ L1ను ఉపయోగించి, నాలుగు పేలోడ్ లు నేరుగా సూర్యుడిని చూస్తాయి . మిగిలిన మూడు పేలోడ్ లు లాగ్రాంజ్ బిందువు L1 వద్ద కణాలు, క్షేత్రాల అంతర్గత అధ్యయనాలను నిర్వహిస్తాయి, తద్వారా గ్రహాంతర మాధ్యమంలో సౌర డైనమిక్స్ వ్యాప్తి ప్రభావంపై ముఖ్యమైన శాస్త్రీయ అధ్యయనాలను అందిస్తాయి.

కరోనల్ హీటింగ్, కరోనల్ మాస్ ఎజెక్షన్, ప్రీ-ఫ్లేర్ , ఫ్లేర్ కార్యకలాపాలు , వాటి లక్షణాలు, అంతరిక్ష వాతావరణ డైనమిక్స్, కణాలు,  క్షేత్రాల వ్యాప్తి మొదలైన వాటిని అర్థం చేసుకోవడానికి ఆదిత్య ఎల్ 1 మిషన్ అత్యంత కీలకమైన సమాచారాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.

*****


(Release ID: 1954485) Visitor Counter : 264