రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

జీ20 థింక్


'ది ఇండియన్ నేవీ క్విజ్' - సరిహద్దులు దాటి ప్రయాణం

Posted On: 02 SEP 2023 2:35PM by PIB Hyderabad

'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' సందర్భంగా, భారత నౌకాదళం వివిధ ప్రాంతాల్లో నిర్వహించే పాఠశాలల స్థాయి క్విజ్ పోటీలను 'ది ఇండియన్ నేవీ క్విజ్' (థింక్‌) పేరిట జాతీయ స్థాయికి పెంచింది. ఈ సంవత్సరం భారతదేశం ప్రతిష్టాత్మక జీ20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించింది. ఈ నేపథ్యంలో, థింక్‌ను అంతర్జాతీయ కార్యక్రమంగా మార్చి "జీ20 థింక్"గా పేరును మార్చారు. ఈ కార్యక్రమాన్ని జీ20 సచివాలయం ఆధ్వర్యంలో, ఎన్‌డబ్ల్యూడబ్ల్యూఏ (నేవీ వెల్ఫేర్ అండ్ వెల్‌నెస్ అసోసియేషన్) భాగస్వామ్యంతో నౌకాదళం నిర్వహిస్తోంది. ఇందులో జాతీయ & అంతర్జాతీయ స్థాయుల్లో పోటీ ఉంటుంది.

జీ20 థింక్ జాతీయ దశలో, 9 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న పాఠశాల విద్యార్థులు పాల్గొంటారు. ఈ క్విజ్ కోసం 11,700 పాఠశాలలు పేర్లు నమోదు చేసుకున్నాయి.

ఈ క్విజ్‌లో, రెండు ఆన్‌లైన్ ఎలిమినేషన్ దశలు జరుగుతాయి. మొదటిది సెప్టెంబర్ 12న, రెండోది అక్టోబర్ 03న ఉంటుంది. ఆ తర్వాత, అక్టోబర్ 10న ఆన్‌లైన్ క్వార్టర్ ఫైనల్ జరుగుతుంది. ఈ పోటీలో నెగ్గిన 16 జట్లు సెమీ ఫైనల్ దశకు  (ప్రతి జోన్‌ నుంచి నాలుగు పాఠశాలలు) అర్హత సాధిస్తాయి. సెమీ ఫైనల్‌ చేరిన జట్లు, నవంబర్ 17న ఎన్‌సీపీఏ ఆడిటోరియంలో జరిగే జాతీయ సెమీ ఫైనల్‌ పోటీల కోసం ముంబైలో కలుస్తాయి. 'గేట్‌ వే ఆఫ్ ఇండియా' వద్ద నవంబర్‌ 18న జరగనున్న జాతీయ ఫైనల్ దశలో అగ్రశ్రేణి 8 జట్లు తలపడతాయి. జాతీయ దశ పూర్తయిన తర్వాత, అంతర్జాతీయ పోటీలో టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించడానికి ఫైనలిస్టులందరిలో ఇద్దరు ఉత్తమ విద్యార్థులను ఎంపిక చేస్తారు.

జీ20 థింక్ అంతర్జాతీయ స్థాయి పోటీలకు ప్రపంచ దేశాల నుంచి తెలివైన విద్యార్థులు ప్రాతినిథ్యం వహిస్తారు, జీ20 దేశాల మధ్య స్నేహ బంధాన్ని బలోపేతం చేస్తారు. ఈ దశలో జీ20+9 దేశాల జట్లు పాల్గొంటాయి, ఒక్కో జట్టులో ఇద్దరు విద్యార్థులు ఉంటారు. 16 మంది జాతీయ సెమీ ఫైనలిస్ట్‌లతో పాటు అంతర్జాతీయ పోటీలో పాల్గొనే వారందరికీ భారతదేశ విభిన్న వారసత్వం, సంస్కృతిని చూసే అవకాశం ఉంటుంది. ఆ విద్యార్థులను దేశంలోని వివిధ సుప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలకు తీసుకెళతారు. అంతర్జాతీయ స్థాయి తుది పోటీ నవంబర్ 22న దిల్లీలో జరుగుతుంది.

పాఠశాలల నమోదు కోసం, క్విజ్‌ సంబంధిత సమాచారాన్ని అందించడానికి, జీ20 థింక్ కోసం ప్రత్యేక వెబ్‌సైట్ www.theindiannavyquiz.in ప్రారంభించారు.

భారతదేశం, డిసెంబర్ 1న, జీ20 అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్‌కు అప్పగిస్తుంది. ఈ నేపథ్యంలో, మన దేశంలో 2022 డిసెంబర్ నుంచి జరిగిన జీ20 కార్యక్రమాల పరంపరకు ముగింపు అధ్యాయంలా జీ20 థింక్ మారుతుంది.

***



(Release ID: 1954478) Visitor Counter : 137