ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బి20 సమ్మిట్ ఇండియా 2023లో ప్రసంగించిన ప్రధాన మంత్రి


"భారతదేశ చంద్రయాన్ మిషన్ సైన్స్ పరిశ్రమ రెండింటి విజయం"

బి-20 థీమ్ - ఆర్ ఎ ఐ ఎస్ ఇ (రైజ్) లో 'ఐ' ఇన్నోవేషన్ (సృజనాత్మకత)కు ప్రాతినిధ్యం వహిస్తుంది. కానీ సృజనాత్మకతతో పాటు, నేను దానిలో మరొక ' ఐ‘ కూడా చూస్తున్నాను - అదే ‘ఇన్ క్లూజన్‘ (సమ్మిళితత్వం)

'మన పెట్టుబడిలో ఎక్కువ భాగం 'పరస్పర విశ్వాసం' అవసరం‘.

"ప్రపంచ వృద్ధి భవిష్యత్తు వ్యాపార భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుంది"

“సమర్థవంతమైన, విశ్వసనీయమైన ప్రపంచ సరఫరా గొలుసును నిర్మించడంలో భారతదేశానికి ముఖ్యమైన స్థానం ఉంది.”

"సుస్థిరత అనేది అవకాశం, వ్యాపార నమూనా రెండూ కూడా”

'ప్లానెట్ పాజిటివ్ చర్యలపై దృష్టి సారించే గ్రీన్ క్రెడిట్ ఫర్ బిజినెస్ ఫ్రేమ్ వర్క్ ను భారత్ సిద్ధం చేసింది‘

'అంతర్జాతీయ వినియోగదారుల సంరక్షణ దినోత్సవం' కోసం ఒక వ్యవస్థ గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాలి; ఇది వ్యాపారం,వినియోగదారుల మధ్య నమ్మకాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.‘
“క్రిప్టోకరెన్సీలకు సంబంధించి మరింత సమగ్ర విధానం అవసరం"

“నైతిక కృత్రిమ మేధను ప్రోత్సహించడానికి ప్రపంచ వ్యాపార సంస

Posted On: 27 AUG 2023 1:36PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీ లో జరిగిన బి 20 సమ్మిట్ ఇండియా 2023 ను ఉద్దేశించి ప్రసంగించారు. బి 20 సమ్మిట్ ఇండియా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విధానకర్తలు, వ్యాపార నాయకులు నిపుణులను బి 20 ఇండియా ప్రకటన గురించి చర్చించడానికి ఒకే వేదిక పైకి తీసుకువస్తుంది. బి 20 ఇండియా ప్రకటనలో జి 20 కి సమర్పించడానికి 54 సిఫార్సులు , 172 విధాన చర్యలు ఉన్నాయి.

ప్రధాన మంత్రి ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, ఆగస్ట్ 23న విజయవంతంగా చంద్రయాన్ మిషన్ ల్యాండ్ కావడం తో జరుగుతున్న సంబరాల గురించి ప్రస్తావించారు. భారతదేశ పండుగ సీజన్ ఈ సారి ముందే ప్రారంభం అయిందని సమాజం,  వ్యాపారాలు పండుగ ఉత్సాహం లో ఉన్నాయని ఆయన అన్నారు. విజయవంతమైన లూనార్ మిషన్ లో ఇస్రో పాత్రను ప్రస్తావించిన ప్రధాన మంత్రి, చంద్రయాన్ అనేక భాగాలను ప్రైవేట్ రంగం , ఎంఎస్ ఎమ్ ఇ లు అందించినందున మిషన్ లో పరిశ్రమ పాత్రను గుర్తించామనిఅన్నారు."ఇది సైన్స్, పరిశ్రమ రెండింటి విజయం" అని ఆయన అన్నారు. 

భారత్ తో పాటు యావత్ ప్రపంచం సంబరాలు చేసుకుంటోందని, ఈ వేడుక బాధ్యతాయుతమైన అంతరిక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం గురించి అని ఆయన అన్నారు. ఈ వేడుకలు నేటి బి 20 థీమ్ అయిన బాధ్యత, వేగవంతం, సృజనాత్మకత, సుస్థిరత , సమానత్వానికి సంబంధించినవని, ప్రధాన మంత్రి అన్నారు. ఇది మానవత్వానికి సంబంధించినదని, 'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు' గురించి అని ఆయన అన్నారు.

బి20 థీమ్ 'ఆర్.ఎ.ఐ.ఎస్.ఇ. ' గురించి ప్రస్తావిస్తూ, ఇందులో ' ఐ‘ సృజనాత్మకతకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ, సమ్మిళితత్వానికి సంబంధించిన మరో 'ఐ'ని తాను చిత్రీకరిస్తానని ప్రధాన మంత్రి అన్నారు. జి20లో శాశ్వత సభ్యత్వాలకు ఆఫ్రికా యూనియన్ ను ఆహ్వానించేటప్పుడు కూడా ఇదే దార్శనికతను వర్తింపజేశామని ఆయన తెలిపారు. బి20లో కూడా ఆఫ్రికా ఆర్థికాభివృద్ధిని ప్రధాన అంశంగా గుర్తించినట్లు ప్రధాన మంత్రి తెలిపారు. "ఈ వేదిక సమ్మిళిత విధానం ఈ సమూహంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని భారతదేశం విశ్వసిస్తొంది " అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఇక్కడ తీసుకున్న నిర్ణయాల విజయాలు ప్రపంచ ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడంలో, సుస్థిర వృద్ధిని సృష్టించడంలో ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని ఆయన పేర్కొన్నారు. 

శతాబ్దం లో ఒకసారి సంభవించిన విపత్తు అంటే కోవిడ్ -19 మహమ్మారి నుంచి నేర్చుకున్న పాఠాల గురించి శ్రీ మోదీ మాట్లాడుతూ, మన పెట్టుబడిలో ఎక్కువ భాగం 'పరస్పర విశ్వాసం' అవసరమని మహమ్మారి మనకు నేర్పిందని అన్నారు. మహమ్మారి పరస్పర విశ్వాసం అనే పునాదిని ఛిన్నాభిన్నం చేసినప్పుడు, భారతదేశం ఆత్మవిశ్వాసంతో, వినయంతో నిలబడి పరస్పర విశ్వాసం పతాకాన్ని ఎగురవేసిందని ప్రధాన మంత్రి అన్నారు. 150కి పైగా దేశాలకు భారత్ ఔషధాలను అందుబాటులో ఉంచిందని, ప్రపంచ ఫార్మసీగా తన హోదాను నిలుపుకుందని ప్రధాని అన్నారు. అదేవిధంగా కోట్లాది మంది ప్రాణాలను కాపాడేందుకు వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచినట్టు చెప్పారు. భారత దేశ ప్రజాస్వామిక విలువలు దాని చర్య లోను, దాని ప్రతిస్పందనలోను కనిపిస్తాయ ని ప్రధాన మంత్రి అన్నారు.  భారత్ లోని 50కి పైగా నగరాల్లో జరిగిన జీ20 సమావేశాల్లో భారత ప్రజాస్వామ్య విలువలు కనిపించాయని అన్నారు.

ప్రపంచ వ్యాపార సముదాయానికి భారత దేశంతో భాగస్వామ్యం ఆకర్షణీయతను నొక్కి చెప్పిన ప్ర ధాన మంత్రి, భారత దేశ యువ టాలెంట్ పూల్ ను, దాని డిజిటల్ విప్లవాన్ని ప్రస్తావించారు. భారత్ తో మీ స్నేహం ఎంతగా బలపడితే ఇద్దరికీ అంత శ్రేయస్సు చేకూరుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

"వ్యాపారం సామర్థ్యాన్ని శ్రేయస్సుగా, అడ్డంకులను అవకాశాలుగా, ఆకాంక్షలను విజయాలుగా మార్చగలదు. చిన్నదైనా, పెద్దదైనా, గ్లోబల్ అయినా, లోకల్ అయినా వ్యాపారం ప్రతి ఒక్కరికీ పురోభివృద్ధిని అందిస్తుంది. అందువల్ల ప్రపంచ వృద్ధి భవిష్యత్తు వ్యాపార భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుంది” అని ప్రధాన మంత్రి అన్నారు.

కోవిడ్ 19 మహమ్మారి ప్రారంభంతో జీవితంలో సంభవించిన మార్పుల గురించి ప్రస్తావిస్తూ, ప్రపంచ సరఫరా గొలుసులో అంతరాయాల కోలుకోలేని మార్పును ప్రధాన మంత్రి వివరించారు. ప్రపంచానికి అత్యంత అవసర సమయంలో ఉనికిని కోల్పోయిన ప్రపంచ సరఫరా గొలుసు సామర్థ్యాన్ని ప్రశ్నించిన ప్రధాన మంత్రి, నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అంతరాయాలకు భారతదేశ విధానమే పరిష్కారం అని స్పష్టం చేశారు. నేడు ప్రపంచంలో విశ్వసనీయమైన సరఫరా గొలుసును సృష్టించడంలో భారతదేశ స్థానాన్ని ఆయన ప్రముఖంగా తెలిపారు. ప్రపంచ వ్యాపారాల సహకారాలను నొక్కి చెప్పారు.. 

జి 20 దేశాల వ్యాపారాలలో బి 20 బలమైన వేదికగా అవతరించిందని సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, సుస్థిరతపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. సుస్థిరత అనేది ఒక అవకాశం, వ్యాపార నమూనా కాబట్టి ప్రపంచ వ్యాపారం ముందుకు సాగాలని ఆయన కోరారు.

చిరుధాన్యాల ఉదాహరణను ఇవ్వడం ద్వారా ఆయన దీనిని వివరించారు, ఇది సూపర్ ఫుడ్, పర్యావరణ అనుకూలమైనది ,చిన్న రైతులకు మంచిది, ఆర్థిక ,జీవనశైలి రెండింటి కోణంలో విజయవంతమైన నమూనాగా మారిందని అన్నారు. సర్క్యులర్ ఎకానమీ, గ్రీన్ ఎనర్జీ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. అంతర్జాతీయ సౌర కూటమి వంటి దశల్లో ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లే భారత్ విధానం కనిపిస్తుంది. 

కరోనా అనంతర ప్రపంచంలో, ప్రతి వ్యక్తి తమ ఆరోగ్యం గురించి మరింత స్పృహ లోకి వచ్చారని, దాని ప్రభావం రోజువారీ కార్యకలాపాలలో స్పష్టంగా కనిపిస్తోందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి చర్యల వల్ల భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం ఉంటుందోనని ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ నమ్మకానికి బలం చేకూర్చుతూ, వ్యాపారాలు , సమాజం, భూగోళం పట్ల ఒకే విధమైన విధానాన్ని కలిగి ఉండాలని , భూగోళం పై వారి నిర్ణయాల ప్రభావాన్ని విశ్లేషించాలని ప్రధాన మంత్రి అన్నారు. 

భూగోళం బాగోగులు కూడా మన బాధ్యతేనని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. మిషన్ ఎల్ ఐ ఎఫ్ ఇ (లైఫ్) గురించి మాట్లాడుతూ, ప్రో ప్లానెట్ పీపుల్ సమూహం లేదా సమాజాలను సృష్టించడం ఈ కార్యక్రమం ముఖ్యోద్దేశం అని అన్నారు. జీవనశైలి, వ్యాపారాలు రెండూ అనుకూలంగా ఉంటే సగం సమస్యలు తగ్గుతాయని ఆయన చెప్పారు. పర్యావరణానికి అనుగుణంగా జీవితాన్ని, వ్యాపారాన్ని మార్చు కోవాలని అన్నారు. భారతదేశం వ్యాపారం కోసం గ్రీన్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ ను సిద్ధం చేయడం గురించి తెలియజేశారు, ఇది భూగోళం సానుకూల చర్యలకు ప్రాధాన్యత ఇస్తుంది. ప్రపంచ వ్యాపార దిగ్గజాలందరూ చేతులు కలిపి దీనిని ప్రపంచ ఉద్యమంగా మార్చాలని ప్రధాని కోరారు.

వ్యాపారానికి సంబంధించిన సంప్రదాయ విధానాన్ని పునఃపరిశీలించాలని ప్రధాని కోరారు. బ్రాండ్, సేల్స్ కు అతీతంగా వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. "ఒక వ్యాపారంగా, దీర్ఘకాలికంగా మనకు ప్రయోజనం చేకూర్చే పర్యావరణ వ్యవస్థను సృష్టించడంపై కూడా మనం దృష్టి పెట్టాలి. గత కొన్నేళ్లుగా భారత్ అమలు చేస్తున్న విధానాల వల్ల కేవలం ఐదేళ్లలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. వీళ్లే కొత్త వినియోగదారులు. ఈ నయా మధ్యతరగతి కూడా భారత వృద్ధికి ఊపునిస్తోంది. అంటే, పేదల కోసం ప్రభుత్వం చేస్తున్న పనుల నికర లబ్దిదారు మన మధ్యతరగతితో పాటు మన ఎంఎస్ఎంఈలు కూడా” అన్నారు. 

స్వీయ కేంద్రీకృత విధానం ప్రతి ఒక్కరికీ హాని కలిగిస్తుంది కాబట్టి ఎక్కువ మంది ప్రజల కొనుగోలు శక్తిని మెరుగుపరచడంపై వ్యాపారాలు దృష్టి పెట్టాలని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు.కీలకమైన భౌతిక, అరుదైన భూలోహాల్లో అసమాన లభ్యత, సార్వజనీన అవసరాన్ని ప్రస్తావిస్తూ, వాటిని కలిగి ఉన్నవారు వాటిని ప్రపంచ బాధ్యతగా చూడకపోతే, అది వలసవాదం కొత్త నమూనాను ప్రోత్సహిస్తుందని ప్రధాని అన్నారు.ఉత్పత్తిదారులు, వినియోగదారుల ప్రయోజనాల్లో సమతుల్యత ఉన్నప్పుడే లాభదాయకమైన మార్కెట్ ను కొనసాగించవచ్చని, ఇది దేశాలకు కూడా వర్తిస్తుందని ప్రధాన మంత్రి చెప్పారు. ఇతర దేశాలను కేవలం మార్కెట్ గా మాత్రమే చూడటం వల్ల ప్రయోజనం ఉండదని, ఉత్పత్తి దేశాలకు కూడా నష్టం జరుగుతుందని ఆయన ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో అందరినీ సమాన భాగస్వాములను చేయడమే ముందున్న మార్గమని ఆయన ఉద్ఘాటించారు. ఈ వినియోగదారులు వ్యక్తులు లేదా దేశాలుగా ఉండేలా వ్యాపారాలను మరింత వినియోగదారు కేంద్రీకృతం చేయడంపై ఆలోచించాలని ఆయన ఈ సందర్భంగా హాజరైన వ్యాపార నాయకులను కోరారు. వారి ప్రయోజనాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ఏటా ప్రచారం చేయాలని సూచించారు. "ప్రతి సంవత్సరం, వినియోగదారులు,  వారి మార్కెట్ల శ్రేయస్సు కోసం తమను తాము తాకట్టు పెట్టడానికి ప్రపంచ వ్యాపారాలు కలిసి రాగలవా" అని ప్రధాన మంత్రి అడిగారు.

వినియోగదారుల ప్రయోజనాల గురించి మాట్లాడటానికి ఒక రోజును నిర్ణయించాలని శ్రీ మోదీ ప్రపంచ వ్యాపారాన్ని కోరారు. వినియోగదారుల హక్కుల గురించి మాట్లాడేటప్పుడు, వినియోగదారుల సంరక్షణ గురించి కూడా మనం గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఇది స్వయంచాలకంగా అనేక వినియోగదారుల హక్కుల సమస్యలను పరిష్కరిస్తుంది. అంతర్జాతీయ వినియోగదారుల సంరక్షణ దినోత్సవం కోసం ఒక వ్యవస్థ గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఇది వ్యాపారాలు, వినియోగదారుల మధ్య నమ్మకాన్ని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది" అని ప్రధాన మంత్రి అన్నారు. వినియోగదారులు ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలోని రిటైల్ వినియోగదారులకు మాత్రమే పరిమితం కాదని, ప్రపంచ వాణిజ్యం, ప్రపంచ వస్తువులు ,సేవల వినియోగదారులుగా ఉన్న దేశాలను కూడా ఆయన వివరించారు.

ప్రపంచ పారిశ్రామికవేత్తల ఉనికి పై ప్రధాన మంత్రి ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తారు. ఈ ప్రశ్నలకు సమాధానాల ద్వారా వ్యాపారం,  మానవాళి భవిష్యత్తు నిర్ణయించబడుతుందని అన్నారు. వీటికి సమాధానాలివ్వాలంటే పరస్పర సహకారం అవసరమని మోదీ అన్నారు. వాతావరణ మార్పులు, ఇంధన రంగ సంక్షోభం, ఆహార సరఫరా గొలుసు అసమతుల్యత, నీటి భద్రత, సైబర్ భద్రత వంటి అంశాలు వ్యాపారంపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయని, దీనిని ఎదుర్కోవడానికి ప్రయత్నాలను పెంచాలని ఆయన నొక్కి చెప్పారు. 10-15 ఏళ్ల క్రితం ఎవరూ ఊహించని అంశాలను స్పృశిస్తూ, క్రిప్టోకరెన్సీలకు సంబంధించిన సవాళ్లను ఉదాహరణగా చెప్పారు. ఈ విషయంలో మరింత సమగ్ర విధానం అవసరాన్ని నొక్కిచెప్పిన ప్రధాన మంత్రి, భాగస్వాములందరి సమస్యలను పరిష్కరించగల ప్రపంచ ఫ్రేమ్ వర్క్ ను రూపొందించాలని సూచించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి కూడా ఇదే విధమైన విధానం అవసరమని ఆయన అన్నారు. కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) చుట్టూ ఉన్న ఉత్సాహాన్ని, ఆసక్తిని ప్రస్తావిస్తూ, నైపుణ్యం , రీ-స్కిల్లింగ్ కు సంబంధించిన కొన్ని నైతిక పరిగణనలు ,  అల్గోరిథం పక్షపాతం,  సమాజంపై దాని ప్రభావానికి సంబంధించిన ఆందోళనలపై ప్రధాన మంత్రి దృష్టి సారించారు. ఇలాంటి సమస్యలను కలిసికట్టుగా పరిష్కరించుకోవాలన్నారు. ఎథికల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరించేలా చూడటానికి ప్రపంచ వ్యాపార వర్గాలు , ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సి ఉంటుంది" అని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు . వివిధ రంగాలలో సంభావ్య అంతరాయాలను గ్రహించాలని చెప్పారు.

వ్యాపారాలు విజయవంతంగా సరిహద్దులు, హద్దులు దాటి వెళ్లాయని, అయితే వ్యాపారాలను అట్టడుగు స్థాయికి మించి తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగిస్తూ అన్నారు. సప్లై చైన్ స్థితిస్థాపకత , సుస్థిరతపై దృష్టి పెట్టడం ద్వారా దీనిని నిర్వహించవచ్చని ఆయన అన్నారు. బి20 శిఖరాగ్ర సదస్సు సమిష్టి పరివర్తనకు బాటలు వేసిందని శ్రీ మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. కనెక్టెడ్ ప్రపంచం అంటే కేవలం టెక్నాలజీ ద్వారా కనెక్షన్ మాత్రమే కాదని గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. ఇది కేవలం సామాజిక వేదికలను పంచుకోవడం గురించి మాత్రమే కాదు, భాగస్వామ్య ప్రయోజనం, భాగస్వామ్యప్రాంతం , భాగస్వామ్య శ్రేయస్సు , భాగస్వామ్య భవిష్యత్తు గురించి కూడా" అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

నేపథ్యం

బిజినెస్ 20 (బి 20) అనేది గ్లోబల్ బిజినెస్ కమ్యూనిటీతో అధికారిక జి 20 డైలాగ్ ఫోరం. 2010 లో ఏర్పాటయిన బి 20 జి 20 లో అత్యంత ముఖ్యమైన ఎంగేజ్మెంట్ గ్రూపులలో ఒకటి, ఇందులో కంపెనీలు , వ్యాపార సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. ఆర్థిక వృద్ధి, అభివృద్ధికి ఊతమిచ్చేందుకు నిర్దిష్టమైన కార్యాచరణ విధాన సిఫార్సులను అందించేందుకు  బి 20 పనిచేస్తుంది.

ఆగస్టు 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు ఈ సదస్సు ఆర్ ఎ  ఐ ఎస్ ఇ (రెయిజ్) – బాధ్యతాయుతమైన, వేగవంతమైన, సృజనాత్మక, సుస్థిర సమాన వ్యాపారాలు-  అనే ఇతివృత్తం తో జరుగుతోంది. సుమారు 55 దేశాల నుంచి 1,500 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. 

 

 

***

DS/TS


(Release ID: 1952744) Visitor Counter : 167