వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
జీ20 వాణిజ్యం & పెట్టుబడుల సమావేశం నిర్ణయాల పత్రం, సారాంశం ఆమోదంతో ముగిసిన 'జీ20 వాణిజ్యం & పెట్టుబడుల మంత్రివర్గ సమావేశం'
Posted On:
25 AUG 2023 2:27PM by PIB Hyderabad
పింక్ నగరం జైపుర్‌లో, 'జీ20 వాణిజ్యం & పెట్టుబడుల మంత్రివర్గ సమావేశం' (టీఐఎంఎం) ఈ రోజు ముగిసింది. కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. నిర్ణయాల పత్రం, అధ్యక్షదేశ సారాంశం తీసుకురావడంలో, ఆమోదం పొందడంలో జరిగిన చర్చల్లో పాల్గొన్న జీ20 సభ్య దేశాలు, ఆహ్వానిత దేశాల మంత్రులు, అంతర్జాతీయ సంస్థలైన ప్రపంచ వాణిజ్య సంస్థ, యూఎన్‌సీటీఏడీ, ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్, ఓఈసీడీ వంటి సంస్థల ప్రతినిధుల నిబద్ధత, సహకారానికి కేంద్ర మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులపై విశ్వాసాన్ని పునర్నిర్మించడం జీ20 సభ్య దేశాలుగా మన బాధ్యత అని గౌరవనీయ భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. జీ20 మంత్రులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. భవిష్యత్ సవాళ్లను తట్టుకోగల, ప్రపంచ వాణిజ్యంలో ఎంఎస్‌ఎంఈల నుంచి ఎక్కువ భాగస్వామ్యాన్ని సృష్టించగల స్థితిస్థాపక, సమగ్ర ప్రపంచ విలువ గొలుసులను నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. డబ్ల్యుటీవో ప్రధానాంశంగా నియమాల ఆధారిత, బహిరంగ, భాగస్వామ్య, బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థపై భారతదేశానికి ఉన్న దృఢ విశ్వాసం గురించి కూడా ప్రధాని మాట్లాడారు.
భారతదేశ అధ్యక్షతన, జైపుర్‌లో జరిగిన వాణిజ్య మంత్రివర్గ సమావేశం నిర్ణయాల పత్రంలో ఆమోదించిన ఐదు కీలక, కార్యాచరణ ఆధారిత నిర్ణయాలపై జీ20 వాణిజ్యం, పెట్టుబడి మంత్రివర్గ సమావేశం ఏకాభిప్రాయానికి వచ్చింది.
మొదటిది, వాణిజ్య పత్రాల డిజిటలీకరణపై ఉన్నత స్థాయి ప్రమాణాలను స్వీకరించడం. ఇందులో, దేశాల మధ్య కాగితం రహిత వాణిజ్యాన్ని సమర్థవంతంగా మారడంలో వివిధ కోణాలను సమగ్రపరిచే 10 సూత్రాలను జీ20 మంత్రులు వివరించారు. ఎలక్ట్రానిక్ వాణిజ్య సంబంధిత సమాచారం, పత్రాల మార్పిడికి సంబంధించిన చర్యలను అమలు చేయడంలో ఈ సూత్రాలు దేశాలకు మార్గదర్శకత్వం వహిస్తాయి. దీంతోపాటు, దేశాల మధ్య సురక్షిత పరస్పర సహకారం, పారదర్శకమైన కాగిత రహిత వాణిజ్యం నిర్వహణ వాతావరణం కల్పించాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తాయి. అటువంటి మార్పు అన్ని పరిమాణాల వ్యాపారాలకు అనుగుణంగా ఉండేలా చూడడానికి సూత్రాల్లో ప్రాధాన్యత ఇచ్చారు.
ఎంఎస్‌ఎంఈలకు సమాచార లభ్యతను మెరుగుపరచేందుకు 'జైపుర్ కాల్ ఫర్ యాక్షన్'ను కూడా జీ20 మంత్రులు ఆమోదించారు. ఎంఎస్‌ఎంఈలు ఎదుర్కొంటున్న సమాచార సంబంధిత సమస్యలను పరిష్కరించేలా ఐటీసీకి చెందిన ప్రపంచ వాణిజ్య సహాయ కేంద్రాన్ని ఆధునీకరించడం కోసం, యూఎన్‌సీటీఏడీ & డబ్ల్యూటీసీతో సంప్రదింపుల ద్వారా ఒక వివరణాత్మక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్‌ను (ఐటీసీ) మంత్రులు కోరారు.
జీవీసీల కోసం 'జీ20 జనరిక్ మ్యాపింగ్ ఫ్రేమ్‌వర్క్'ను కూడా జీ20 మంత్రివర్గం ఆమోదించింది. ఇందులో కీలక సమాచారం, విశ్లేషణ, జీవీసీ సమాచార ప్రాతినిధ్యం ఉంటుంది. రంగాలు, ఉత్పత్తుల స్థాయుల్లో జీవీసీల స్థితిస్థాపకతను మదింపు చేసేందుకు సాయపడే కీలక పరిమాణాలను గుర్తించాలని కూడా ఫ్రేమ్‌వర్క్ సూచించింది.
వృత్తిపరమైన సేవల కోసం 'మ్యూచువల్ రికగ్నిషన్ అగ్రిమెంట్స్'లపై (ఎంఆర్‌ఏ) ఉత్తమ విధానాలను స్వచ్ఛందంగా పంచుకోవడాన్ని కూడా జీ20 మంత్రులు స్వాగతించారు. ఉత్తమ విధానాల కలయిక ఎంఆర్‌ఏ విజయాలను ప్రోత్సహిస్తుంది. ఇది మన వైద్యులు, నర్సులు, న్యాయవాదులు, ఇంజినీర్లు సహా వివిధ రంగాల నిపుణుల సాంకేతిక అర్హతలను ఇతర దేశాలు కూడా గుర్తించేలా చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక సేవలను అందించడంలో ఇది మన వృత్తి నిపుణులకు సాయం చేస్తుంది.
నియంత్రణ పరమైన వైరుధ్యాలు, అనుబంధ వాణిజ్య వ్యయాలను తగ్గించడానికి, అనవసరమైన వాణిజ్య ఘర్షణలను నివారించడానికి, వాణిజ్యం & పెట్టుబడి సంబంధిత చర్యలను పర్యవేక్షించడానికి, ఇప్పటికే ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి పరస్పరం సమావేశం కావలసిన అవసరాన్ని, ప్రాముఖ్యతను జీ20 మంత్రులు గుర్తించారు. 2023లో 'జీ20 స్టాండర్డ్స్ డైలాగ్' నిర్వహించాలన్న భారతదేశ సూచనను జీ20 మంత్రులు స్వాగతించారు. దీనివల్ల జీ20 సభ్య దేశాలు, విధాన నిర్ణేతలు, నియంత్రణ సంస్థలు, ఇతర వాటాదార్లు ఒకచోట చేరి ఉత్తమ నియంత్రణ విధానాలు, ప్రమాణాలు వంటి ఉమ్మడి అంశాలపై చర్చిస్తారు.
మొత్తం ఐదు నిర్ణయాలకు జీ20 మంత్రుల నుండి విస్తృత మద్దతు లభించింది.
2024 ప్రారంభంలో జరిగే డబ్ల్యూటీవో 13వ మంత్రివర్గ సమావేశంలో (ఎంసీ13) జరిగే ఒప్పందాల్లో ఎక్కువ భాగం వాస్తవ రూపం దాల్చేలా చూడాలని వరల్డ్ ట్రేడ్ సెంటర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ న్గోజీ ఒకోంజో-ఇవాలా జీ20 మంత్రులకు సూచించారు. డబ్ల్యూటీవోతో బహుపాక్షిక వాణిజ్య వ్యవస్థ పాత్రను జీ20 మంత్రులు స్పష్టం చేశారు. డబ్ల్యూటీవో నియమాలను రూపొందించే విభాగాన్ని బలోపేతం చేయడంలో తమ నిబద్ధతను చాటారు. ముఖ్యంగా, డబ్ల్యూటీవో 13వ మంత్రివర్గ సమావేశంలో డబ్ల్యూటీవో సంస్కరణలు సహా సానుకూల ఫలితాలు వచ్చేలా పని చేయడాన్ని కొనసాగించడానికి జీ20 మంత్రులు అంగీకరించారు.
ఈ రోజు ఆమోదించిన నిర్ణయాల పత్రం, సారాంశం జీ20 వెబ్‌సైట్ https://www.g20.org/en/ లో అందుబాటులో ఉంది.
***
(Release ID: 1952231)
Visitor Counter : 178