ప్రధాన మంత్రి కార్యాలయం
మధ్యప్రదేశ్ రోజ్‌గార్ మేళా సందర్భంగా ప్రధానమంత్రి వీడియో సందేశానికి - తెలుగు అనువాదం
Posted On:
21 AUG 2023 1:16PM by PIB Hyderabad
నమస్కారం,
ఈ చారిత్రక సమయంలో, ఈ కీలకమైన బోధనా బాధ్యత తో ఈరోజు మీరందరూ మిమ్మల్ని మీరు కలుపుకుంటున్నారు. ఈ సంవత్సరం, నేను ఎర్రకోట బురుజుల నుండి ప్రసంగిస్తూ, దేశ అభివృద్ధిలో జాతీయత అనేది ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో వివరంగా చెప్పాను. భావి భారత తరాన్ని తీర్చిదిద్దడం, వారిని ఆధునికతగా తీర్చిదిద్దడం, కొత్త దిశానిర్దేశం చేయడం మీ అందరి బాధ్యత. మధ్యప్రదేశ్ లోని ప్రాథమిక పాఠశాలల్లో నియమితులైన 5,500 మందికి పైగా ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత మూడేళ్లలో మధ్యప్రదేశ్ లో దాదాపు 50 వేల మంది ఉపాధ్యాయులను నియమించినట్లు అధికారులు తెలియజేశారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తున్నాను.
మిత్రులారా,
జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడంలో మీరందరూ కూడా ప్రధాన పాత్ర పోషించనున్నారు. అభివృద్ధి చెందిన భారత దేశ తీర్మానాన్ని నెరవేర్చే దిశగా జాతీయ విద్యా విధానం భారీ సహకారం అందిస్తోంది. ఈ విధానం కింద, సాంప్రదాయ జ్ఞానం, అత్యాధునిక సాంకేతికత రెండింటికీ సమాన ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ప్రాథమిక విద్య కోసం కొత్త పాఠ్యాంశాలు కూడా రూపొందించడం జరిగింది. మాతృభాషలో విద్యాబోధన చేయడం ద్వారా మరో అభినందనీయమైన పని జరిగింది. ఇంగ్లీషు రాని విద్యార్థులకు మాతృభాషలో విద్యాబోధన జరగకుండా తీవ్ర అన్యాయం జరిగింది. ఇది సామాజిక న్యాయానికి విరుద్ధం. ఇప్పుడు మన ప్రభుత్వం ఈ అన్యాయాన్ని దూరం చేసింది. ఇప్పుడు పాఠ్యాంశాల్లో ప్రాంతీయ భాషల్లోని పుస్తకాలకు పెద్దపీట వేస్తున్నారు. దేశ విద్యా వ్యవస్థలో భారీ సంస్కరణలకు ఇది ప్రాతిపదిక అవుతుంది.
మిత్రులారా,
సానుకూల మనస్తత్వం, సరైన ఉద్దేశ్యం, పూర్తి అంకిత భావంతో నిర్ణయాలు తీసుకున్నప్పుడు, మొత్తం వాతావరణం సానుకూలత తో నిండి ఉంటుంది. 'అమృత్ కాల్' మొదటి సంవత్సరంలో, మనం, రెండు ప్రధాన సానుకూల వార్తలు విన్నాము. దేశంలో తగ్గుతున్న పేదరికం, పెరుగుతున్న శ్రేయస్సు గురించి అవి మనకు తెలియజేశాయి. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం, కేవలం ఐదేళ్లలో, 13.5 కోట్ల మంది భారతీయులు భారతదేశంలో దారిద్య్రరేఖకు ఎగువకు చేరుకున్నారు. కొద్దిరోజుల క్రితం మరో నివేదిక వెలువడింది. ఆ నివేదిక ప్రకారం, ఈ సంవత్సరం దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌ల సంఖ్య కూడా చాలా ముఖ్యమైన విషయాన్ని సూచిస్తుంది. గత 9 ఏళ్లలో ప్రజల సగటు ఆదాయం లో భారీ పెరుగుదల నమోదయ్యింది. ఐ.టీ.ఆర్.సమాచారం ప్రకారం, 2014లో దాదాపు 4 లక్షల రూపాయలుగా ఉన్న సగటు ఆదాయం 2023 నాటికి 13 లక్షల రూపాయలకు పెరిగింది. భారతదేశంలో, తక్కువ ఆదాయ సమూహం నుండి ఎగువ ఆదాయ వర్గానికి మారుతున్న వారి సంఖ్య కూడా పెరిగింది. ఈ గణాంకాలు ఉత్సాహాన్ని పెంచడంతో పాటు, దేశంలోని ప్రతి రంగం బలపడుతుందని, అనేక కొత్త ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని భరోసా ఇస్తున్నాయి.
మిత్రులారా,
ఆదాయపు పన్ను రిటర్న్‌ల కొత్త గణాంకాలలో గమనించాల్సిన మరో విషయం ఉంది. అది, తమ ప్రభుత్వం పై దేశ పౌరుల విశ్వాసం నిరంతరం బలపడుతోంది. ఫలితంగా, దేశ పౌరులు నిజాయితీగా పన్నులు చెల్లించేందుకు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. తాము చెల్లించే పన్నులో ప్రతి పైసా దేశాభివృద్ధికి వినియోగిస్తున్నారని వారికి తెలుసు. 2014 సంవత్సరానికి ముందు ప్రపంచంలో 10వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ నేడు 5వ స్థానానికి చేరుకోవడం వారికి స్పష్టంగా కనిపిస్తోంది. దేశ పౌరులు 2014 సంవత్సరానికి ముందు అవినీతి కుంభకోణాల యుగాన్ని మరిచిపోలేరు. పేదల హక్కులు దోచుకున్నారు, వారి డబ్బు వారికి చేరకముందే దోచుకున్నారు. నేడు పేదలకు అందాల్సిన డబ్బులన్నీ నేరుగా వారి ఖాతాల్లోకే చేరుతున్నాయి.
మిత్రులారా,
వ్యవస్థలోని లీకేజీని పూడ్చడం వల్ల వచ్చే ఫలితాల్లో ఒకటి ఏమిటంటే, ప్రభుత్వం ఇప్పుడు పేదల సంక్షేమానికి గతంలో కంటే ఎక్కువ ఖర్చు చేయగలదు. ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడంతో దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతాల్లోనూ, ఉపాధి కల్పన జరిగింది. అలాంటి ఒక ఉదాహరణ కామన్ సర్వీస్ సెంటర్లు. 2014 సంవత్సరం నుంచి దేశంలోని గ్రామాల్లో కొత్తగా 5 లక్షల ఉమ్మడి సేవా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ప్రతి సామాన్య సేవా కేంద్రం ఈ రోజున అనేక మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది. తద్వారా గ్రామాలకు, పేదలకు సంక్షేమంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా కల్పించబడ్డాయి.
మిత్రులారా,
నేడు విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన వంటి మూడు స్థాయిల్లో అందరికీ చేరువయ్యే విధానాలు, నిర్ణయాలతో దేశంలో అనేక ఆర్థిక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. ఈ ఆగస్టు 15వ తేదీన, ఎర్ర కోట బురుజుల నుండి ప్రసంగిస్తూ, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను కూడా ప్రకటించాను. ఈ పథకం కూడా ఇదే దార్శనికతను ప్రతిబింబిస్తుంది. 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా మన విశ్వకర్మ స్నేహితుల సంప్రదాయ నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ను రూపొందించడం జరిగింది. ఈ పథకంలో దాదాపు 13 వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడి పెట్టనున్నారు. ఈ పథకం కింద, 18 రకాల నైపుణ్యాలతో అనుబంధం ఉన్న కుటుంబాలకు అన్ని రకాల సహాయం అందించడం ద్వారా, వారు ప్రయోజనం పొందుతారు. ఇది సమాజంలోని ఆ వర్గానికి ప్రయోజనం చేకూరుస్తుంది, దీని ప్రాముఖ్యత గురించి చర్చించడం జరిగింది, అయితే, వారి పరిస్థితిని మెరుగుపరిచేందుకు, ఇంతవరకు, ఎటువంటి సమిష్టి ప్రయత్నాలు చేయలేదు. ఇప్పుడు, విశ్వకర్మ పథకం కింద శిక్షణతో పాటు, ఆధునిక పనిముట్లు కొనుగోలు చేసుకునేందుకు వీలుగా, లబ్ధిదారులకు వోచర్లు కూడా అందజేయడం జరుగుతుంది. అంటే, పీ.ఎం.విశ్వకర్మ ద్వారా యువత తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి మరిన్ని అవకాశాలను పొందుతారు.
మిత్రులారా,
ఈ రోజు ఉపాధ్యాయులుగా మారిన ఈ అద్భుతమైన వ్యక్తులకు నేను మరొక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరంతా ఎంతో కష్టపడి ఇక్కడి దాకా చేరుకున్నారు. మీరు ఇంకా నేర్చుకుంటూనే ఉంటారని ఆశిస్తున్నాను. మీకు సహాయం చెయ్యడం కోసం, ప్రభుత్వం "ఐ.జి.ఓ.టి. కర్మయోగి" అనే ఆన్-లైన్ లెర్నింగ్ ప్లాట్-ఫారమ్ ని ప్రారంభించింది. ఈ సదుపాయాన్ని గరిష్టంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. మీ కలలను నెరవేర్చుకోవడానికి ఇప్పుడు మీకు గొప్ప అవకాశం వచ్చింది. ఈ కొత్త విజయానికి, ఈ కొత్త ప్రయాణానికి, మీకు, మీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు.
ధన్యవాదములు.
ముఖ్య గమనిక:
ఇది ప్రధానమంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి స్వేచ్చానువాదం.
*****
(Release ID: 1951115)
Visitor Counter : 146
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Nepali
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam