ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

50 కోట్లు దాటిన జన్ ధన్ ఖాతాల సంఖ్య


మహిళల పేరిట 56% ఖాతాలు, గ్రామీణ/సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో 67% ఖాతాలు

Posted On: 18 AUG 2023 4:34PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజనగా (పీఎంజేడీవై) ప్రసిద్ధి చెందిన 'ది నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌' 2014 ఆగస్టు 28న ప్రారంభమైంది, ఇప్పటికి దాదాపు 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. బ్యాంకులు సమర్పించిన తాజా నివేదికల ప్రకారం, ఈ నెల 9వ తేదీ నాటికి మొత్తం జన్ ధన్ ఖాతాల సంఖ్య 50 కోట్లు దాటింది. ఈ ఖాతాల్లో 56% ఖాతాలు మహిళలవి, 67% ఖాతాలు గ్రామీణ/ సెమీ-అర్బన్‌ ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. ఈ ఖాతాల్లోని నగదు జమల మొత్తం రూ.2.03 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. ఈ ఖాతాల కోసం దాదాపు 34 కోట్ల రూపే కార్డులను ఉచితంగా జారీ చేశారు. పీఎంజేడీవై ఖాతాల్లో సగటు నగదు నిల్వ రూ.4,076. 5.5 కోట్లకు పైగా పీఎంజేడీవై ఖాతాలు డీబీటీ ప్రయోజనాలు పొందుతున్నాయి.

పీఎంజేడీవై పథకం దేశ ఆర్థిక స్వరూపాన్ని మార్చడంలో విజయం సాధించింది. పెద్దల బ్యాంకు ఖాతాల విషయంలో సంతృప్తికర స్థాయికి చేరువైంది. సాంకేతికత, సహకారం, ఆవిష్కరణల ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థ చివరి మైలును కూడా చేరేందుకు చేసిన ప్రయత్నంతో పీఎంజేడీవై విజయవంతం అయింది.

పీఎంజేడీవై ఖాతాదార్ల ఖాతాల్లో కనీస నగదు నిల్వ అవసరం లేదు. రూ. 2 లక్షల ప్రమాద బీమా, ఉచితంగా రూపే డెబిట్ కార్డు, రూ.10,000 వరకు ఓవర్‌ డ్రాఫ్ట్ సౌకర్యం వంటి బహుళ ప్రయోజనాలు ఈ ఖాతా ద్వారా అందుతున్నాయి.

 

****


(Release ID: 1950372) Visitor Counter : 163