రక్షణ మంత్రిత్వ శాఖ
నడి సముద్రంలో గుండెపోటుకు గురైన చైనా దేశీయుడిని రక్షించిన భారతీయ తీర రక్షణ దళం
Posted On:
17 AUG 2023 10:07AM by PIB Hyderabad
నడి సముద్రంలో గుండెపోటుకు గురైన చైనా జాతీయుడికి వైద్య సాయం అందించి, అతని ప్రాణాలను భారతీయ తీర రక్షణ దళం నిలబెట్టింది. ఈ నెల 16-17 తేదీల అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. అరేబియా సముద్రంలో, ముంబై తీరానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎంవీ డాంగ్ ఫాంగ్ కాన్ టాన్ నంబర్ 2 అనే పరిశోధన నౌకలో చైనా జాతీయుడు హఠాత్తుగా అస్వస్థతతకు గురయ్యాడు. వాతావరణం అనుకూలంగా లేకపోయినా, ఆ చిమ్మచీకటి సమయంలోనే భారతీయ తీర రక్షణ దళం బాధితుడి కోసం రంగంలోకి దిగింది.
చైనా నుంచి యుఏఈకి వెళుతున్న పరిశోధన నౌకలో ఉన్న సిబ్బందిలో, యిన్ వీగ్యాంగ్ అనే వ్యక్తికి గుండెపోటు వచ్చిందని, తక్షణ వైద్య సహాయం అవసరమని ముంబైలోని 'మారిటైమ్ రెస్క్యూ కో-ఆర్డినేషన్ సెంటర్'కు సమాచారం అందింది. భారతీయ సిబ్బంది వెంటనే ఆ నౌకలోని సిబ్బందితో మాట్లాడారు, అవసరమైన టెలిమెడిసిన్ సలహాలు అందించారు.
రోగి అత్యవసర పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, తదుపరి వైద్య సేవలను భారతీయ తీర రక్షణ దళం ప్రారంభించింది. రోగిని సీజీ ఏఎల్‌హెచ్ ఎంకే-III ద్వారా ఆకాశమార్గాన తరలించింది, ఆ సమయంలోనే ప్రథమ చికిత్స అందించింది. తదుపరి వైద్య నిర్వహణ కోసం అతనిని నౌకలోని ప్రతినిధికి అప్పగించింది.
చీకటి సమయంలోనూ వేగంగా ఆపరేషన్ చేపట్టిన సీజీ ఏఎల్‌హెచ్, సీజీఏఎస్ డామన్, ఒక విదేశీ పౌరుడి ప్రాణాలను కాపాడాయి. ఈ సంఘటన, "మేం రక్షిస్తాం" అనే భారతీయ తీర రక్షణ దళం నిబద్ధతను మరోమారు చాటి చెప్పింది.
****
(Release ID: 1949821)
Visitor Counter : 189