ఆయుష్
భారతీయ వైద్య వ్యవస్థల కింద చికిత్స పొందాలని కోరుకునే విదేశీయుల కోసం నూతన కేటగిరీ ఆయుష్ వీసాను ప్రవేశపెట్టిన ప్రభుత్వం
భారతీయ సంప్రదాయ వైద్యాన్ని ఒక ప్రపంచ దృగ్విషయంగా మార్చాలన్న ప్రధానమంత్రి దార్శనికతను ఆయుష్ వీసా కేటగిరీ బలోపేతం చేస్తుందిః కేంద్ర ఆయుష్ మంత్రి
Posted On:
02 AUG 2023 4:50PM by PIB Hyderabad
భారతీయ వైద్య వ్యవస్థలు/ ఆయుష్ వ్యవస్థల కింద చికిత్స పొందాలనుకునే విదేశీయులకు నూతన కేటగిరీ ఆయుష్ (ఎవై)ను సృష్టించేందుకు భారత హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. భారతీయ వైద్య వ్యవస్థలు/ ఆయుష్ వ్యవస్థల కింద యోగా, సంక్షేమం, వైద్య చికిత్సల కోసం భారత్‌కు వచ్చే విదేశీయుల కోసం ప్రత్యేక వీసా పథకాన్ని ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనను ఆయుష్ వీసా నెరవేరుస్తుంది.
భారతీయ వైద్య వ్యవస్థల కింద చికిత్సకు సంబంధించి వీసా మాన్యువల్‌లోని చాప్టర్ 11- మెడికల్ వీసాలో నూతన చాప్టర్ అంటే చాప్టర్ 11 ఎ- ఆయుష్ వీసాను పొందుపరిచి, అనుగుణంగా వీసా మాన్యువల్ 2019లోని వివిధ చాప్టర్లలో అవసరమైన సవరణలను చేశారు.
ఆయుష్ వ్యవస్థలు/ భారతీయ వైద్య వ్యవస్థల కింద చికిత్స కోరుకునే విదేశీయుల కోసం నూతన కేటగిరీ ఆయుష్ (ఎవై) వీసాను సృష్టించడమన్నది ఒక చెప్పుకోదగిన అడుగు అని కేంద్ర ఆయుష్, రేవులు, షిప్పింగ్ & జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద్ సోనోవాల్ అన్నారు. ఈ చొరవ భారతీయ సంప్రదాయ వైద్యాన్ని ప్రపంచ దృగ్విషయంగా మార్చాలన్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ దార్శనికతను సాధించాలన్న కృషిని బలోపేతం చేస్తుందని అన్నారు. ప్రత్యేక ఆయుష్ వీసా కేటగిరీని సృష్టించడంలో కృషి చేసిన కేంద్ర మంత్రి శ్రీ అమిత్ షాకు అభినందనలు తెలపాలనుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.
ఆయుష్ వైద్య చికిత్స కోసం భారత్‌కు ప్రయాణించాలనుకునే విదేశీయులకు వారి ప్రయాణాన్ని సులభతరం చేయడం కోసం ఒక ప్రత్యేక ఆయుష్ వీసా కేటగిరీని సృష్టిస్తామని గుజరాత్, గాంధీనగర్‌లో 2022లో జరిగిన గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్నొవేషన్ సమ్మిట్ (జిఎఐఐఎస్)లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రకటించడాన్ని ఇక్కడ తప్పనిసరిగా ప్రస్తావించాలి.
ప్రభుత్వం చేపట్టిన హీల్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ (స్వస్థ బారత్ చొరవ) రోడ్‌మాప్‌లో ఆయుష్ వీసా కేటగిరీని ప్రవేశపెట్టడం ఒక భాగం. ఇది వైద్య ఉపయోగిత ప్రయాణ గమ్యస్థానంగా ప్రోత్సహించేందుకు ఉద్దేశించింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ భారతదేశాన్ని ప్రపంచంలోని వైద్య పర్యాటక గమ్యస్థానంగా ప్రోత్సహించడానికి వన్ స్టాప్ హీల్ ఇన్ ఇండియా పోర్టల్‌లోను అభివృద్ధి చేయడానికి కలిసి పని చేస్తున్నాయి.
ఇటీవలి సంవత్సరాలలో భారతదేశంలో వైద్య ఉపయోగిత ప్రయాణం గణనీయమైన వృద్ధిని సాధించింది. గ్లోబల్ వెల్‌నెస్ ఇనిస్టిట్యూట్ (జిడబ్ల్యుఐ) విడుదల చేసిన గ్లోబల్ వెల్‌నెస్ ఎకానమీ ః లుకింగ్ బియాండ్ కోవిడ్ ( ప్రపంచ సంక్షేమ ఆర్ధిక వ్యవస్థః కోవిడ్ ఆవల దృష్టి) ప్రకారం, ప్రపంచ సంక్షేమ ఆర్థిక వ్యవస్థ వార్షికంగా 9.9% పెరుగనుంది. ఆయుష్ ఆధారిత ఆరోగ్య సంరక్షణ & సంక్షేమ ఆర్థిక వ్యవస్థ 2025 నాటికి 70 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా.
దేశీయంగా, అంతర్జాతీయంగా ఆయుష్ చికిత్స వ్యవస్థలను ప్రోత్సహించేందుకు అనేక కోణాలలో ఆయుష్ మంత్రిత్వ శాఖ పని చేస్తోంది. ఇటీలి కాలంలో పర్యాటక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియా టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఐటిడిసి) , భారత ప్రభుత్వం ఆయుర్వేద, ఇతర సంప్రదాయ వైద్య వ్యవస్థల ప్రోత్సాహం కోసం కలిసి పని చేసేందుకు ఒక అవగాహనా పత్రం (ఎంఒయు)పై సంతకాలు చేశాయి.
****
(Release ID: 1945268)
Visitor Counter : 205