రక్షణ మంత్రిత్వ శాఖ
24వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా 1999 కార్గిల్ యుద్ధ వీరులకు దేశం నివాళులు అర్పించిన దేశ ప్రజలు: డ్రాస్ లోని కార్గిల్ వార్ మెమోరియల్ వద్ద వీర జవాన్లకు నివాళులర్పించిన రక్షణ మంత్రి
నేటి భారతదేశం మన సాహస యోధుల త్యాగాల పునాదిపై ఆధారపడి ఉంది: శ్రీ రాజ్ నాథ్ సింగ్
“భారత్ శాంతికాముక దేశం- అయితే రెచ్చగొడితే ప్రతీకారం తీర్చుకోవడానికి వెనుకాడబోము: జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది”
దేశాన్ని రక్షించేందుకు పరోక్షంగానే కాకుండా అవసరమైతే ప్రత్యక్షంగా కూడా మానసికంగా సిద్ధంగా ఉండాలని కోరిన రక్షణ మంత్రి
Posted On:
26 JUL 2023 1:14PM by PIB Hyderabad
1999 కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్లకు ప్రతి సంవత్సరం జూలై 26న 'కార్గిల్ విజయ్ దివస్'గా జరుపుకునే 24వ వార్షికోత్సవం సందర్భంగా దేశం ఈ రోజు వారికి ఘనంగా నివాళులు అర్పించింది. 'కార్గిల్ విజయ్ దివస్‘ ను పురస్కరించుకుని రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ ఈ రోజు లద్దాఖ్ లోని డ్రాస్ వద్ద ఉన్న కార్గిల్ యుద్ధ స్మారకాన్ని సందర్శించి, 'ఆపరేషన్ విజయ్'లో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన వీర జవాన్లకు పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.
డ్రాస్ లో జరిగిన ఈ వేడుకలో యుద్ధ వీరులు, వీర్ నారీలు, అమర వీరుల కుటుంబాలు కూడా పాల్గొన్నాయి. శ్రీ రాజ్ నాథ్ సింగ్ వారితో సంభాషించారు. దేశ సేవలో అత్యున్నత త్యాగం చేసిన వారందరినీ స్మరించుకుంటూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వీరుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని అన్నారు.
ఈ సందర్భంగా రక్షణ మంత్రి ప్రసంగిస్తూ, సంక్షోభ సమయాల్లో దేశం నిలదొక్కుకోవడానికి సహాయపడిన సాయుధ దళాల ధైర్యసాహసాలు, నిబద్ధతను కొనియాడారు. సైనికుల త్యాగాల పునాదులపైనే నేటి భారతావని ఆధారపడి ఉందన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్ ధైర్యసాహసాలను చాటిచెప్పిన సంఘటన 'ఆపరేషన్ విజయ్'గా రాజ్ నాథ్ సింగ్ అభివర్ణించారు. ఈ విజయం దేశాన్ని విజయ శిఖరాలకు చేర్చిన లాంచ్ ప్యాడ్ గా ఆయన అభివర్ణించారు.
"మన గొప్పతనం ఎప్పుడూ పడిపోవడంలో కాదు, పడిపోయిన ప్రతిసారీ లేవడంలో ఉంది. యుద్ధ సమయంలో ప్రత్యర్థికి వ్యూహాత్మక సైనిక ప్రయోజనం ఉన్నప్పటికీ, మన దళాలు వారిని వెనక్కి నెట్టి మన భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడంలో సాటిలేని ధైర్యసాహసాలు , నైపుణ్యాన్ని ప్రదర్శించాయి. దేశ ప్రయోజనాలకు హాని కలిగితే మన సైన్యం ఎట్టిపరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గదనే సందేశాన్ని ఈ విజయంతో పాకిస్థాన్ కు, ప్రపంచానికి భారత్ పంపిందని “ రాజ్ నాథ్ సింగ్ అన్నారు.
సవాలుతో సంబంధం లేకుండా జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. దేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతను పరిరక్షించడంలో రాజీపడేది లేదన్నారు.
“దేశ శత్రువులను ఏరివేసేందుకు సాయుధ దళాలకు స్వేచ్ఛనిచ్చాం. భారతదేశం శాంతికాముక దేశం. శతాబ్దాల నాటి విలువలను విశ్వసిస్తుంది. అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉంటుంది. అయితే మన ప్రయోజనాలను పరిరక్షించుకోవడానికి నియంత్రణ రేఖను దాటడానికి వెనుకాడబోము. ఇంతకు ముందు, దేశానికి, సాయుధ దళాలకు రాజకీయ సంకల్పం లేదు, ఇప్పుడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని మన ప్రభుత్వం దీనిని అందించింది. బలగాలకు అండగా ఉంటాం. మన సైనికులపై ప్రజలకు, పార్లమెంటుకు పూర్తి విశ్వాసం ఉంది” అని రక్షణ మంత్రి స్పష్టం చేశారు.
పరమవీర చక్ర (పివిసి) అవార్డు గ్రహీతలు కెప్టెన్ విక్రమ్ బాత్రా , కెప్టెన్ మనోజ్ పాండే , వీర్ చక్ర (విఆర్ సి) అవార్డు గ్రహీతలు లెఫ్టినెంట్ కల్నల్ ఆర్ విశ్వనాథన్, కెప్టెన్ జింటూ గొగోయ్, కెప్టెన్ విజయంత్ థాపర్ , నాయబ్ సుబేదార్ మంగేజ్ సింగ్ తో సహా అనేక మంది అమర వీర సైనికుల పోరాట పటిమను శ్రీ రాజ్ నాథ్ సింగ్ గుర్తు చేసుకున్నారు. భావితరాలకు వారు స్ఫూర్తినిస్తారని, ఎప్పటికీ గుర్తుండి పోతారని అన్నారు.
యుద్ధ సమయంలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఫ్లైట్ లెఫ్టినెంట్లు గుంజన్ సక్సేనా, శ్రీవిద్య రాజన్ ల గురించి రక్షణ మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశ సరిహద్దుల భద్రత విషయంలో భారతీయ మహిళలు తమ పురుష సహచరులకు ఏ మాత్రం తీసిపోరని అన్నారు. వీరంతా భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారని, అయితే దేశ, ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ఒక్కటిగా పోరాడారని గుర్తు చేశారు.
కేవలం ఆయుధాలు, బాంబులతోనే యుద్ధాలు చేసి గెలవక్కరలేదని, ధైర్యసాహసాలు, అచంచలమైన స్ఫూర్తి సమాన ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని రక్షణమంత్రి అన్నారు. . ఈ సంకల్ప బలం, జాతీయ గర్వ భావమే భారత సైనికులను మిగతా వారి నుంచి వేరు చేస్తుందని, దేశ రక్షణ, నాగరికత, సంస్కృతి పరిరక్షణ కోసం దేశభక్తి విలువలతో మన బలగాలు నిండి ఉన్నాయని ఆయన అన్నారు.
రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణను ఉదాహరణగా చూపుతూ, గత ఏడాదికి పైగా కొనసాగుతున్న యుద్ధం నేటి కాలంలో సంఘర్షణల అనూహ్య స్వభావాన్ని ప్రతిబింబిస్తుందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ప్రజలు శిక్షణ పొంది తమ సైన్యంలో చేరి తమ ప్రయోజనాల కోసం పోరాడుతున్నందున యుద్ధం సుదీర్ఘంగా సాగిందని ఆయన అన్నారు.
అవసరమైతే పరోక్షంగానే కాకుండా ప్రత్యక్షంగా కూడా యుద్ధాల్లో పాల్గొనడానికి మానసికంగా సిద్ధంగా ఉండాలని రాజ్ నాథ్ సింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలు మానసికంగా సిద్ధంగా ఉండాలని, తద్వారా దేశానికి ఎప్పుడు అవసరమైతే అప్పుడు సాయుధ దళాలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు. ప్రతి సైనికుడూ భారతీయుడే అయినట్లే; అదేవిధంగా ప్రతి భారతీయుడు సైనికుడి పాత్ర పోషించడానికి సిద్ధంగా ఉండాలని అన్నారు.
లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ బ్రిగేడియర్ (డాక్టర్) బీడీ మిశ్రా (రిటైర్డ్), చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే, చీఫ్ ఆఫ్ నేవీ స్టాఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్, వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీపీ మాలిక్ (రిటైర్డ్), జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. జనరల్ ఆఫీసర్ కమాండింగ్, 14 కార్ప్స్ లెఫ్టినెంట్ జనరల్ రషీమ్ బాలి, లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి (రిటైర్డ్), లెఫ్టినెంట్ జనరల్ అమర్నాథ్ ఔల్ (రిటైర్డ్) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ధైర్యం , సంకల్పానికి నిజమైన ఉదాహరణ పివిసి గ్రహీత మరియు హవిల్దార్ దిగేంద్ర కుమార్, మహావీర చక్ర గ్రహీత సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్ హాజరు సభికులకు స్ఫూర్తినిచ్చింది. పివిసి కెప్టెన్ మనోజ్ పాండే సోదరుడు శ్రీ మన్మోహన్ పాండే మరియు పివిసి కెప్టెన్ విక్రమ్ బాత్రా సోదరుడు శ్రీ విశాల్ బాత్రా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 'స్పిరిట్ ఆఫ్ ఇండియా'ను నిర్వచించే వీరత్వాన్ని గుర్తించడానికి దేశం ఏకతాటిపైకి రావడంతో ద్రాస్ లో జరిగిన ఈ కార్యక్రమం ఐక్యత, కృతజ్ఞత, గర్వానికి ప్రతీకగా నిలిచింది.
ధైర్యం , సంకల్పానికి నిజమైన ఉదాహరణ అయిన సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్, పి వి సి, హవల్దార్ దిగేంద్ర కుమార్ , మహావీర్ చక్రహాజరు కావడం ఆహుతులను ఉత్తేజ పరిచింది. కెప్టెన్ మనోజ్ పాండే , పి వి సి, సోదరుడు శ్రీ మన్మోహన్ పాండే, కెప్టెన్ విక్రమ్ బాత్రా సోదరుడు శ్రీ విశాల్ బత్రా కూడా హాజరయ్యారు. 'స్పిరిట్ ఆఫ్ ఇండియా'ను నిర్వచించే వీరత్వాన్ని గుర్తించడానికి దేశం ఏకతాటిపైకి రావడంతో డ్రాస్ లో జరిగిన ఈ కార్యక్రమం ఐక్యత, కృతజ్ఞత, గర్వానికి ప్రతీకగా నిలిచింది.
దేశ రాజధానిలో రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్, రక్షణ కార్యదర్శి శ్రీ గిరిధర్ అరమానే, చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ చైర్మన్, చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ (సిఐఎస్ సి ) లెఫ్టినెంట్ జనరల్ జెపి మాథ్యూ, త్రివిధ దళాల వైస్ చీఫ్ లు జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అమరవీరులకు నివాళులు అర్పించారు.
****
(Release ID: 1943092)
Visitor Counter : 132