ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యుఎఇ పర్యటన సందర్భంగా భారత్ - యుఎఇ సంయుక్త ప్రకటన

Posted On: 15 JUL 2023 6:09PM by PIB Hyderabad

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ , భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జూలై 15 న అబుదాబిలో సమావేశమయ్యారు.

 

గత ఎనిమిదేళ్లలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యుఎఇ లో పర్యటించడం ఇది ఐదోసారి అని ఇరు పక్షాలు పేర్కొన్నాయి. 2015లో 34 ఏళ్ల తర్వాత యుఎఇ లో పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించారు.

ఈ పర్యటన తరువాత 2016 లో షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారతదేశాన్ని సందర్శించారు, తరువాత 2017 లో షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతేకాకుండా, 2017 లో షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత పర్యటన సందర్భంగా భారత్- యుఎఇ సంబంధాలు అధికారికంగా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి పెరిగాయి.

ప్రధాని మోదీ చివరిసారిగా 2022 జూన్ లో యుఎఇ లో పర్యటించి షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

 

యు ఎ ఇ - భారత్ సంబంధాలు అన్ని రంగాల్లో అద్భుతమైన పురోగతి సాధించాయని ప్రస్తుత సమావేశం సందర్భంగా ఇద్దరు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. భారతదేశం-యుఎఇ వాణిజ్యం 2022 లో 85 బిలియన్ డాలర్లకు పెరిగింది,  2022-23 సంవత్సరానికి యుఎఇ భారతదేశ మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఇంకా భారతదేశ రెండవ అతిపెద్ద ఎగుమతి గమ్యస్థానంగా మారింది. అటు యుఎఇ కి భారత్ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2022 ఫిబ్రవరిలో యుఎఇ తో సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సి ఇ పి ఎ ) కుదుర్చుకున్న తొలి దేశంగా భారత్ నిలిచింది. 2022 మే ఒకటిన  సిఇపిఎ అమలు లోకి వచ్చినప్పటి నుండి ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు 15% పెరిగింది.

 

2023లో జీ20 కి భారత్ అధ్యక్షత, సి ఒ పి 28 కి  యుఎఇ అధ్యక్షత వహించడంతో రెండు దేశాలు అంతర్జాతీయంగా పోషించిన కీలక పాత్ర లను ఇరువురు నేతలు ప్రస్తావించారు.  2023 జనవరిలో వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్ కు భారత్ ఆతిథ్యమివ్వడాన్ని యుఎఇ అభినందించింది. సి ఒ పి   28 లో గ్లోబల్ సౌత్ ప్రయోజనాలను ప్రోత్సహించడం

లోనూ, సి ఒ పి 28 ను "కాప్ ఆఫ్ యాక్షన్"గా మార్చడంలోనూ యుఎఇ కీలక పాత్ర పోషించిందని భారత్ ప్రశంసించింది. ఐ2యూ2, యుఎఇ -ఫ్రాన్స్-భారత్ త్రైపాక్షిక సహకార కార్యక్రమం వంటి బహుళపక్ష వేదికలలో మరింత సహకారం అవసరమని ఇరు పక్షాలు ఆకాంక్షించాయి. భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ఇరు దేశాలకు ఇలాంటి వేదికలు ఎక్కువ అవకాశాలను కల్పిస్తున్నాయని వారు పేర్కొన్నారు.

 

అబుదాబిలో, యుఎఇ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ , గౌరవ భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమక్షంలో ఈ క్రింది ఒప్పందాలు జరిగాయి. వాటిని వీక్షించారు:

 

1. సీమాంతర లావాదేవీల కోసం స్థానిక కరెన్సీల (ఐఎన్ఆర్- ఎ ఇ డి)  వాడకాన్ని ప్రోత్సహించడానికి ఒక ఫ్రేమ్ వర్క్ ఏర్పాటుకు సంబంధిత కేంద్ర బ్యాంకుల గవర్నర్లు అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు.

 

II. పేమెంట్, మెసేజింగ్ వ్యవస్థలను అనుసంధానం చేయడంపై సంబంధిత సెంట్రల్ బ్యాంకుల గవర్నర్లు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.

 

III. అబుదాబిలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - ఢిల్లీని ఏర్పాటు చేయడానికి ప్రణాళిక కోసం అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు.

 

ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పరిష్కరించుకోవడానికి ఇరు దేశాల మధ్య లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ ను అభివృద్ధి చేయడం పరస్పర విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని నేతలు తమ చర్చలలో అభిప్రాయపడ్డారు. అంతేకాక, ఇది రెండు దేశాల ఆర్థిక వ్యవస్థల దృఢత్వాన్ని నొక్కి చెబుతుంది. ఇంకా యుఎఇ - భారతదేశం మధ్య ఆర్థిక సంబంధాలను పెంచుతుంది. యు ఎ ఇ , భారత్ మధ్య సీమాంతర లావాదేవీలను మరింత సమర్థవంతంగా ప్రాసెస్ చేయడానికి తమ తక్షణ చెల్లింపు వ్యవస్థల మధ్య ఏకీకరణను అనుమతించడం ద్వారా చెల్లింపు వ్యవస్థల రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడానికి నాయకులు ఆసక్తిని వ్యక్తం చేశారు. జాతీయ కార్డు స్విచ్ లను అనుసంధానం చేయడం ద్వారా దేశీయ కార్డు పథకాలను పరస్పరం అంగీకరించడం కూడా అటువంటి సహకారంలో ఉంటుంది. ఈ వ్యవస్థల మధ్య అనుసంధానం రెండు దేశాల పౌరులు , నివాసితుల ప్రయోజనం కోసం చెల్లింపు సేవల ప్రాప్యతను పెంచుతుంది.

 

ఇరు దేశాల మధ్య పెట్టుబడుల సంబంధాలను మరింత బలోపేతం చేయాలనే సంకల్పాన్ని నేతలు పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక ఉన్నత స్థాయి జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్స్ కృషిని వారు అభినందించారు. 2021-2022లో ఏడో స్థానంలో ఉన్న యు ఎ ఇ 2022-2023లో భారత్ లో నాలుగో అతిపెద్ద పెట్టుబడిదారుగా అవతరించినట్టు గుర్తించారు. రాబోయే కొద్ది నెలల్లో గుజరాత్ లోని ఫైనాన్షియల్ ఫ్రీ జోన్ అయిన గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీ (గిఫ్ట్ సిటీ)లో ఉనికిని ఏర్పాటు చేయడానికి అబుదాబి ఇన్వెస్ట్ మెంట్ అథారిటీ (ఎడిఐఎ) ప్రణాళికను వారు అభినందించారు. దీంతో భారత్ లో

యు ఎ ఇ పెట్టుబడులకు మరింత వెసులుబాటు కలుగుతుంది.

 

ఐఐటీ ఢిల్లీ - అబుదాబి ఏర్పాటుకు సంబంధించి భారత విద్యా మంత్రిత్వ శాఖ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ ఢిల్లీ), అబుదాబి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ (ఎ డి ఎ కె ) మధ్య కుదిరిన త్రైపాక్షిక అవగాహన ఒప్పందం ప్రాముఖ్యతపై కూడా నేతలు చర్చించారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఇరువురు నేతల మధ్య జరిగిన వర్చువల్ సమ్మిట్ సందర్భంగా యు ఎ ఇ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు.

 

ఈ విజన్ ను సాకారం చేయడానికి గత రెండేళ్లుగా ఇరు పక్షాలు అవిశ్రాంతంగా శ్రమించాయి. ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ సస్టెయినబిలిటీలో మాస్టర్స్ ప్రోగ్రామ్ ను అందించడం ద్వారా ఐఐటీ ఢిల్లీ - అబుదాబి జనవరి 2024 నాటికి పనిచేస్తుందని ఇద్దరు నాయకులు తమ నిర్ధారణను , ఆమోదాన్ని వ్యక్తం చేశారు.

సస్టెయినబుల్ ఎనర్జీ, క్లైమేట్ స్టడీస్, కంప్యూటింగ్, డేటా సైన్సెస్ రంగాల్లో పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు 2024 సెప్టెంబర్ నుంచి ఇతర బ్యాచిలర్, మాస్టర్స్, పీహెచ్ డీ స్థాయి ప్రోగ్రామ్ లను అందించాలని భావిస్తున్నారు.

 

చమురు, గ్యాస్, పునరుత్పాదక ఇంధన రంగాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకోవాలని నేతలు తీర్మానించారు. గ్రీన్ హైడ్రోజన్, సోలార్ ఎనర్జీ, గ్రిడ్ కనెక్టివిటీలో ఇరు దేశాలు తమ సహకారాన్ని ముందుకు తీసుకెళ్తాయి.

భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్ కార్యక్రమంతో సహా ఇంధన స్పెక్ట్రమ్ అంతటా పెట్టుబడులను పెంచడానికి ఇరు పక్షాలు అంగీకరించాయి.

 

వాతావరణ మార్పుల సమస్యలపై, ముఖ్యంగా జి 20 కి  భారతదేశం,  సిఓపి 28 కు యుఎఇ అధ్యక్షత వహిస్తున్న సమయంలో సంయుక్త కృషి ఆవశ్యకత ను ఇద్దరు నాయకులు అంగీకరించారు. కాప్ 28ను అందరికీ విజయవంతం గా చేయడానికి కలిసి పనిచేయాలని వారు తీర్మానించారు.

 

ఆహార భద్రత ప్రాముఖ్యతను గుర్తించిన నాయకులు, ఆహార సరఫరా గొలుసుల విశ్వసనీయత , స్థితిస్థాపకతను ప్రోత్సహించడానికి , భారతదేశంలో ఆహార కారిడార్ ప్రాజెక్టులతో సహా ఆహార,  వ్యవసాయ వాణిజ్యాన్ని విస్తరించడానికి తమ సంకల్పాన్ని పునరుద్ఘాటించారు. ఈ ప్రాంతంలో ప్రాజెక్టులను త్వరితగతిన సాకారం చేయడానికి వివిధ భారతీయ భాగస్వాములతో యుఎఇ పక్షం తన సంప్రదింపులను వేగంగా పూర్తి చేస్తుంది.

 

ద్వైపాక్షికంగా, తృతీయ దేశాలలో కొనసాగుతున్న ఆరోగ్య సహకారాన్ని ఉత్తేజపరచడం ద్వారా , దానిని మరింత వైవిధ్యపరచడం ద్వారా ఆరోగ్య రంగం ప్రాముఖ్యత ,సహకార పరిధిని నాయకులు ప్రస్తావించారు. వ్యాక్సిన్లు, ఔషధాల ప్రపంచ ఆరోగ్య సరఫరా గొలుసుల్లో విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా మారడానికి ఇరు దేశాల సామర్థ్యాన్ని వివరించారు. యు ఎ ఇ, భారత్ లలో పెరుగుతున్న ఆరోగ్య మౌలిక సదుపాయాల్లో సహకారానికి గల అవకాశాలపై కూడా చర్చించారు.

 

చారిత్రాత్మక భారత్- యు ఎ ఇ  సంబంధాలకు శతాబ్దాల నాటి ప్రజల మధ్య సంబంధాలు బలమైన, అతి ముఖ్యమైన స్తంభాల్లో ఒకటని నేతలు పేర్కొన్నారు. యుఎఇ సమాజం , ఆర్థిక వ్యవస్థలో పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయ ప్రవాసులు గణనీయమైన పాత్రను పోషిస్తున్నారని , ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తున్నారని యుఎఇ ప్రశంసించింది.

 

భారతదేశం, యుఎఇ , వాటి భాగస్వామ్య పొరుగు దేశాలలో అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఈ ప్రాంతంలో సముద్ర భద్రత , కనెక్టివిటీని , ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి నాయకులు అంగీకరించారు. రక్షణ మార్పిడి, అనుభవాల భాగస్వామ్యం, శిక్షణ, సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అంగీకరించారు.

 

సీమాంతర ఉగ్రవాదం సహా తీవ్రవాదం, ఉగ్రవాదంపై ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో అన్ని రూపాల్లో పోరాడేందుకు తమ ఉమ్మడి నిబద్ధతను నేతలు పునరుద్ఘాటించారు. ఉగ్రవాదం, టెర్రరిస్టు ఫైనాన్సింగ్, తీవ్రవాదంపై పోరులో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రజల మధ్య శాంతి, సంయమనం, సహజీవనం, సహనం వంటి విలువలను పెంపొందించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పిన వారు అన్ని రకాల తీవ్రవాదం, విద్వేషపూరిత ప్రసంగాలు, వివక్ష, ప్రేరేపణలను విడనాడాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు.

 

ఇరువురు నాయకులు బహుళపక్షవాదం ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు.న్యాయమైన, నియమాల ఆధారిత ప్రపంచ వ్యవస్థను ప్రోత్సహించడానికి సమిష్టి చర్యకు పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వ్యవహారాల్లో కలసి పని చేయడంపై ముఖ్యంగా 2022లో యు ఎన్ భద్రతా మండలిలో నాన్ పర్మినెంట్ మెంబర్లుగా రెండు దేశాలు పనిచేసినప్పుడు రెండు దేశాలు ప్రదర్శించిన  సమన్వయంపై ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. భద్రతా మండలిలో ఎన్నికైన సభ్యదేశంగా తన పదవీకాలంలో యు ఎ ఇ  సాధించిన విజయాలను ప్రధాని మోదీ ప్రశంసించారు. సంస్కరణలు జరిగిన  యు ఎన్ ఎస్ సి లో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం చేస్తున్న ప్రయత్నానికి యుఎఇ తన మద్దతును పునరుద్ఘాటించింది.

 

తన ప్రతినిధి బృందానికి ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చినందుకు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. 2023 సెప్టెంబర్ 9-10 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగే జీ20 లీడర్స్ సమ్మిట్ లో షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పాల్గొనడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు ప్రధాని మోదీ తెలిపారు.

 

సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, సహకారం విస్తరణ కు అవకాశం ఉన్న ప్రాంతాలను అన్వేషించడానికి , ఈ ప్రాంతం లోనూ , అంతకు మించీ శాంతి, స్థిరత్వం , అభివృద్ధిని ప్రోత్సహించడానికి తమ నిబద్ధతను ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు.

 

***



(Release ID: 1940146) Visitor Counter : 136