రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
రూ.2,900 కోట్ల విలువైన 3 ఎన్‌హెచ్ ప్రాజెక్టులకు తిరుపతిలో శంకుస్థాపన చేసిన శ్రీ నితిన్ గడ్కరీ
Posted On:
13 JUL 2023 3:31PM by PIB Hyderabad
కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, 3 జాతీయ రహదారి ప్రాజెక్టులకు తిరుపతిలో ఇవాళ శంకుస్థాపన చేశారు.
ఈ ప్రాజెక్టుల మొత్తం పొడవు 87 కిలోమీటర్లు, వ్యయం రూ.2,900 కోట్లు.
ఎన్‌హెచ్-71లోని నాయుడుపేట-తూర్పు కణుపూర్ సెక్షన్‌లో, ₹1,399 కోట్ల పెట్టుబడి వ్యయంతో చేపట్టే 35 కి.మీ. పొడవైన రహదారి ప్రాజెక్టుకు మొదట శంకుస్థాపన చేశారు. ఎన్‌హెచ్ 516డబ్ల్యూలోని చిల్లకూరు క్రాస్-కృష్ణపట్నం పోర్టు సౌత్ గేట్ సెక్షన్‌లో, ₹909 కోట్ల వ్యయంతో నిర్మించే 36 కి.మీ. ప్రాజెక్టు రెండోది. ఎన్‌హెచ్-516డబ్ల్యూ, ఎన్‌హెచ్-67లోకి వచ్చే తమ్మినపట్నం-నారికెళ్లపల్లె సెక్షన్‌లో, ₹610 కోట్ల వ్యయంతో ఏపూరు నుంచి కృష్ణపట్నం ఓడరేవు వరకు 16 కి.మీ. పొడవైన నౌకాశ్రయ రహదారి నిర్మాణం మూడో ప్రాజెక్టు.
కృష్ణపట్నం నౌకాశ్రయానికి ఎలాంటి అవాంతరాలు లేని, సురక్షితమైన రవాణా సదుపాయం ఈ ప్రాజెక్టుల లక్ష్యంగా శ్రీ గడ్కరీ చెప్పారు. జాతీయ బృహత్తర పథకం ప్రాంతాలు, పారిశ్రామిక ప్రాంతాలు, నెల్లూరులోని సెజ్‌లకు వేగంగా చేరడానికి ఈ ప్రాజెక్టుల వల్ల అవకాశం లభిస్తుందని చెప్పారు. తిరుపతి, శ్రీకాళహస్తి పుణ్యక్షేతాలకు ప్రయాణించే భక్తుల భద్రత, సౌకర్యం పెరుగుతుందన్నారు. గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, దేశవ్యాప్తంగా వేగవంతమైన, అవాంతరాలు లేని, ఇంధన సమర్థవంతమైన రవాణా సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టులు శ్రీహరికోటలోని నేలపట్టు పక్షుల అభయారణ్యం, షార్ వంటి పర్యాటక ప్రాంతాలను అనుసంధానిస్తూ పర్యాటకాన్ని బలోపేతం చేస్తాయని శ్రీ గడ్కరీ చెప్పారు. తద్వారా, ఉపాధి అవకాశాలను కూడా భారీగా పెరుగుతాయని కేంద్ర మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
***
(Release ID: 1939264)
Visitor Counter : 206