రక్షణ మంత్రిత్వ శాఖ
భారత నౌకాదళ సామర్థ్యం పెంచడానికి ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్ మెరైన్ విమానాల కొనుగోలు ప్రతిపాదనకు డీఏసీ ఆమోదం
'బయ్' (ఇండియన్) విభాగం కింద మరో మూడు స్కార్పెన్ జలాంతర్గాముల కొనుగోలుకు కూడా ఆమోదం
प्रविष्टि तिथि:
13 JUL 2023 2:58PM by PIB Hyderabad
భారత రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఇవాళ జరిగిన 'రక్షణ రంగ కొనుగోళ్ల మండలి' (డీఏసీ) సమావేశంలో మూడు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. 26 రాఫెల్ మెరైన్ విమానాల కొనుగోలుకు 'యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసిసిటీ'ని (ఏవోఎన్) డీఏసీ మంజూరు చేసింది. విమాన అనుబంధ పరికరాలు, ఆయుధాలు, సిమ్యులేటర్, విడిభాగాలు, పత్రాలు, సిబ్బంది శిక్షణ, లాజిస్టిక్ మద్దతు కూడా విమానాల కొనుగోలుతో కలిపి అనుమతి మంజూరు చేసింది. ఇలాంటి విమానాలను ఇతర దేశాలు కొన్న ధర సహా సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, భారత్‌కు సరఫరా చేసే ధర, ఇతర కొనుగోలు నిబంధనలపై ఫ్రాన్స్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతారు. భారతదేశం రూపొందించిన పరికరాలను రాఫెల్ మెరైన్ విమానాల్లో ఏర్పాటు చేయడం, వివిధ వ్యవస్థల నిర్వహణ, మరమ్మతులు, కార్యకలాపాల (ఎంఆర్‌వో) కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వంటివి కూడా చర్చల ద్వారా ఒప్పంద పత్రాల్లో చేరుస్తారు.
మజగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) నిర్మించే మూడు స్కార్పెన్ జలాంతర్గాముల సేకరణకు కూడా 'బయ్' (ఇండియన్) విభాగం కింద డీఏసీ అనుమతి మంజూరు చేసింది. ఎక్కువ శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన జలాంతర్గాములను సేకరించడం వల్ల భారత నౌకాదళ శక్తి, సామర్థ్యాలు పెరగడం మాత్రమే కాకుండా, దేశీయ రంగంలో ఎక్కువ ఉపాధి అవకాశాలను కూడా సృష్టించవచ్చు. జలాంతర్గాముల నిర్మాణంలో మరింత సామర్థ్యం, నైపుణ్యం పెంచుకోవడానికి ఎండీఎల్‌కు కూడా ఇది ఉపయోగపడుతుంది.
అన్ని విభాగాల్లో అవసరమైన స్వదేశీ పరిజ్ఞానాన్ని సాధించడానికి కావలసిన మూలధన సేకరణలకు మార్గదర్శకాలు రూపొందించే ప్రతిపాదనను కూడా డీఏసీ ఆమోదించింది. కీలక తయారీ సాంకేతికతల్లో 'స్వయంసమృద్ధి'ని సాధించడంలో ఇది సహాయపడుతుంది.
*****
(रिलीज़ आईडी: 1939221)
आगंतुक पटल : 280