ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

చత్తీస్ గఢ్ లోని రాయపూర్ లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

Posted On: 07 JUL 2023 12:53PM by PIB Hyderabad

చత్తీస్  గఢ్  గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్  జీ, ముఖ్యమంత్రి శ్రీ భూపేష్  సింగ్  భాగెల్  జీ, నా కేబినెట్  సహచరులు శ్రీ నితిన్  గడ్కరి జీ, శ్రీ మన్  సుఖ్  మాండవీయ జీ, శ్రీ రేణుకా సింగ్  జీ, ఉప ముఖ్యమంత్రి శ్రీ టిఎస్  సింగ్  దేవ్  జీ, శ్రీ రమణ్  సింగ్  జీ, కార్యక్రమానికి హాజరైన ఇతర ప్రముఖులు, సోదరసోదరీమణురాలా, చత్తీస్  గఢ్  అభివృద్ధిలో ఇది అత్యంత కీలక సమయం. 
నేడు చత్తీస్  గఢ్ రూ.7000 కోట్లకు పైబడిన ప్రాజక్టులు బహుమతులుగా పొందుతోంది. మౌలిక వసతులు, అనుసంధానతకు చెందిన కానుకలివి. ఈ కానుకలు చత్తీస్  గఢ్  ప్రజల జీవన సౌలభ్యంతో పాటు ప్రజల ఆరోగ్య  సంరక్షణ  సేవలు మెరుగుపరుస్తాయి.  కేంద్రప్రభుత్వం అందిస్తున్న ఈ కానుకలతో ఇక్కడ పలు ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడతాయి. వరి రైతులు, ఖనిజ సంపదతో సంబంధం ఉన్న పరిశ్రమలు, పర్యాటక రంగాల వారు ప్రత్యేకంగా లబ్ధి పొందుతారు. సౌకర్యం, అభివృద్ధికి జరుగుతున్న ఈ ప్రయాణంలో గిరిజన ప్రాంతాల్లో కొత్త శకం ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్టులు అందుకుంటున్న చత్తీస్ గఢ్  ప్రజలను నేను అభినందిస్తున్నాను.
మిత్రులారా,  
దశాబ్దాల మన అనుభవం ప్రకారం మౌలిక వసతులు అత్యంత బలహీనంగా ఉండేవి, అదే విధంగా అభివృద్ధి  కూడా ఆలస్యంగా మన వరకు వచ్చేది. అభివృద్ధి పరుగులో వెనుకబడి ఉండిపోయిన ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతూ నేడు మౌలిక వసతులు అభివృద్ధి చేస్తున్నాం. ఫలితంగా ప్రజల జీవనం సరళం అవుతోంది. మౌలిక వసతులంటే వ్యాపార సరళీకరణ, మౌలిక వసతులంటే ఉపాధి అవకాశాల కల్పన, మౌలిక వసతులంటే వేగవంతమైన అభివృద్ధి. ఆ రకంగా నేడు నవభారతంలో విస్తరిస్తున్న మౌలిక వసతులన్నీ చత్తీస్  గఢ్  కు కూడా చేరుతున్నాయి. గత 9 సంవత్సరాల కాలంలో ప్రధానమంత్రి గ్రామ్  సడక్  యోజన కింద చత్తీస్ గఢ్  లోని వేలాది గిరిజన గ్రామాలకు రోడ్డు వసతి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం చత్తీస్  గఢ్  లో 3,500 కిలోమీటర్ల నిడివి గల జాతీయ రహదారి ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వాటిలో 3,000 కిలోమీటర్ల నిడివి గల ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయి. అందులో భాగంగానే రాయపూర్-కోడేబోడ్, బిలాస్  పూర్-పత్రపలి రహదారులు  ఈ రోజు ప్రారంభిస్తున్నాం. చత్తీస్  గఢ్  లో  రైలు, రోడ్డు లేదా టెలికాం రంగం ఏదైనా అన్నింటిలోనూ కేంద్రప్రభుత్వం గత 9 సంవత్సరాల కాలంలో కనివిని ఎరుగని స్థాయిలో పనులు నిర్వహించింది.
మిత్రులారా, 
సాధారణంగా ఆధునిక మౌలిక వసతులపై పెద్దగా చర్చించాం. ఈ ఆధునిక మౌలిక వసతులు సామాజిక న్యాయం ఆవిష్కరిస్తాయి. శతాబ్దాలుగా అన్యాయం, అసౌకర్యాలకు గురైన వారికి కేంద్ర ప్రభుత్వం ఆధునిక వసతులు అందుబాటులోకి తెస్తోంది. నేడు ఈ రోడ్డు, రైల్వే ప్రాజెక్టులన్నీ పేదలు, దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనుల నివాస ప్రాంతాలకు చేరుతున్నాయి. ఈ సంక్లిష్టమైన ప్రాంతాల్లో నివశించే రోగులు, తల్లులు, సోదరీమణులు నేడు తేలిగ్గా ఆస్పత్రులకు చేరగలుగుతున్నారు. ఈ ప్రాంతాల్లోని రైతులు, కార్మికులు ప్రత్యక్షంగా ప్రయోజనం పొందుతున్నారు. మొబైల్  అనుసంధానత కూడా ఆ కోవలోనిదే. 9 సంవత్సరాల క్రితం కేవలం 20 శాతం చత్తీస్  గఢ్  గ్రామాలకు ఎలాంటి మొబైల్   కనెక్టివిటీ అందుబాటులో ఉండేది కాదు. నేడు అలాంటి వారి సంఖ్య 6 శాతానికి తగ్గింది. వీటిలో అధికం గిరిజన గ్రామాలు, నక్సల్  దౌర్జన్యకాండకు గురైనవే. ఇలాంటి గ్రామాలకు కూడా 4జి సేవలు అందుతాయనే భరోసా కల్పిస్తూ కేంద్రప్రభుత్వం 700 పైగా మొబైల్  టవర్లు నిర్మించింది. వాటిలో 300 టవర్లు ఇప్పటికే పని ప్రారంభించాయి. తరచు మొబైల్  నెట్  వర్క్  లో అంతరాయాలు కలిగే ఆ ప్రాంతాల్లో మొబైల్  రింగ్  టోన్లు మార్మోగుతున్నాయి. మొబైల్  కనెక్టివిటీ  రాకతో  ఈ గ్రామాల ప్రజలు ఇప్పుడు అనేక పనులు పొందుతున్నారు. ఇదే ‘సబ్  కా సాత్, సబ్  కా వికాస్’ సిద్ధాంత మూల సూత్రం. 
మిత్రులారా, 
నేడు చత్తీస్  గడ్  రెండు ఆర్థిక కారిడార్ల అనుసంధానత సాధించింది. రాయపూర్-ధన్  బాద్  ఆర్థిక కారిడార్ ఒకటి కాగా రెండోది రాయపూర్-విశాఖపట్టణం ఆర్థిక కారిడార్. ఈ రెండు కారిడార్లు ఈ ప్రాంత సౌభాగ్యాన్ని సంపూర్ణంగా మార్చివేయనున్నాయి. ఈ ఆర్థిక కారిడార్లు ఒకప్పుడు దౌర్జన్యకాండ, అరాచకం విలయ తాండవం చేసి వెనుకబడినవిగా వ్యవహారంలో ఉండే ఆకాంక్షాపూరిత జిల్లాల ద్వారా సాగుతున్నాయి. నేడు కేంద్ర ప్రభుత్వం ఆ జిల్లాల్లో కొత్త అభివృద్ధి  కథనం రచిస్తోంది. ఇప్పటికే పనులు ప్రారంభమైన రాయపూర్-విశాఖపట్టణం ఆర్థిక కారిడార్  ఆ ప్రాంతంలో నవ జీవనం ఆవిష్కరిస్తుంది. రాయపూర్-విశాఖపట్టణం మధ్య ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గుతుంది. 6 లేన్ల ఈ రోడ్డు వరి అధికంగా పండించే ధంతరి బెల్ట్ తో పాటు కంకర్  బాక్సైట్  బెల్ట్, కొండగాం హస్తకళా బెల్ట్  వంటి ప్రాంతాలకు వెలుపలి ప్రపంచంతో ప్రత్యక్ష బంధం ఏర్పడుతోంది. మరో అంశం కూడా నాకెంతో ప్రీతిపాత్రమైనది. ఈ రోడ్డు వన్యప్రాణి సంరక్షణా ప్రాంతాల మీదుగా సాగడమే  ఆ ప్రత్యేకత. వన్యప్రాణుల సౌకర్యం కోసం ఈ రోడ్డు అంతా సొరంగ మార్గాలు, వన్యప్రాణులు ఎలాంటి ప్రమాదానికి లోను కాకుండా తిరిగేందుకు వీలైన ప్రదేశాలతో నిండి ఉంటాయి. దళ్లి రాజ్ హర్ నుంచి జగదల్  పూర్  రైల్వే లైనుతో అంటగఢ్  నుంచి రాయపూర్  కి నేరుగా రైలు సర్వీసు అందుబాటులోకి వచ్చి దూర ప్రాంతాల ప్రయాణంలో సౌలభ్యం ఏర్పడుతుంది.
మిత్రులారా, 
ప్ర‌కృతి  సంపద ఎక్కడ ఉన్నా అక్కడ కొత్త అవకాశాలు అందుబాటులోకి తెస్తామని, మరిన్ని పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయిస్తామన్నది కేంద్రప్రభుత్వ కట్టుబాటు. గత 9 సంవత్సరాల కాలంలో ఈ దిశగా కేంద్రప్రభుత్వం తీసుకున్న చర్యలు కారణంగా చత్తీస్  గఢ్  లో పారిశ్రామికీకరణకు తాజా ఉత్తేజం ఏర్పడింది. కేంద్రప్రభుత్వ విధానాల కారణంగా ఆదాయం రూపంలో చత్తీస్  గఢ్  మరింత ధనం పొందుతోంది.  ప్రత్యేకించి ఖనిజాలు, గనుల చట్టం సవరించిన అనంతరం చత్తీస్  గడ్  రాయల్టీ రూపంలో అదనపు ఆదాయం పొందుతోంది. 2014 సంవత్సరానికి ముందు నాలుగు సంవత్సరాల రాయల్టీ రూపంలో చత్తీస్  గఢ్  రూ.1300 కోట్లు అందుకోగా  2015-16 నుంచి 2020-21 సంవత్సరాల మధ్య కాలంలో రూ.2800 కోట్లు అందుకుంది. జిల్లా మినరల్  నిధికి ఆదాయం పెరగడంతో ఖనిజ సంపద పుష్కలంగా ఉన్న జిల్లాల్లో అభివృద్ధి పనులు వేగం అందుకున్నాయి. పిల్లలకు పాఠశాలలు, గ్రంథాలయాలు, ప్రజలకు నీటి వ్యవస్థల ఏర్పాటుకు జిల్లా మినరల్ ఫండ్  నుంచి నిధులు అందుతున్నాయి. 
మిత్రులారా, 
కేంద్రప్రభుత్వ మరో ప్రయత్నం ద్వారా కూడా చత్తీస్  గఢ్  ప్రయోజనం పొందుతోంది. కేంద్రప్రభుత్వ ప్రయత్నాల కారణంగా చత్తీస్  గఢ్  లో 1.60 కోట్ల జన్ ధన్  బ్యాంకు ఖాతాలు తెరిచారు. నేడు ఈ ఖాతాల్లో రూ.6,000 కోట్లకు పైబడి నిధులు జమ అయి ఉన్నాయి. ఈ సొమ్మంతా ఆ ప్రాంతంలోని పేద కుటుంబాలు ప్రత్యేకించి రైతు కుటుంబాలు, రైతులు, కార్మికులదే. గతంలో వారంతా తప్పనిసరిగా తమ వద్ద ఉన్న సొమ్ము ఏ విధమైన భద్రత లేని వారి  చేతుల్లో దాచుకోవలసి వచ్చేది. జన్ ధన్  ఖాతాలతో నేడు వారందరూ ప్రభుత్వం నుంచి ప్రత్యక్ష సహాయం కూడా అందుకోగలుగుతున్నారు. చత్తీస్  గఢ్ యువత ఉపాధి అవకాశాల కోసం కేంద్ర ప్రభుత్వ అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. వారు స్వయం ఉపాధి పొందాలనుకున్నా ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొనకుండా ఏర్పాట్లు చేసింది. ముద్ర యోజన కింద చత్తీస్  గడ్  యువతకు రూ.40,000 కోట్లకు పైగా  సహాయం అందింది. ఎలాంటి బ్యాంకు గ్యారంటీ లేకుండానే వారికి ఈ సొమ్మంతా అందింది. ఈ సహాయంతో గిరిజన యువత,  పేద కుటుంబాల యువకులు చత్తీస్  గఢ్  లోని తమ గ్రామాల్లో సొంత వ్యాపారాలు ప్రారంభించుకోగలిగారు. కరోనా కష్టకాలంలో చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడితో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకం ప్రారంభించింది. ఈ పథకం కింద చత్తీస్  గఢ్  లోని 2 లక్షల పరిశ్రమలకు రూ.5,000 కోట్ల వరకు సహాయం అందింది. 
మిత్రులారా,
మన దేశంలో గతంలో ఏ ప్రభుత్వమూ వీధి వ్యాపారుల గురించి ఆలోచించలేదు. వారిలో చాలా మంది గ్రామాలకు చెందిన వారే. నగరాలకు వచ్చి పని చేసుకుంటూ జీవితం గడిపే వారు. వీధి వ్యాపారుల్లో ప్రతీ ఒక్కరూ తన భాగస్వాములేనని కేంద్ర  ప్రభుత్వం భావించింది. అందుకే వారి కోసం పిఎం స్వనిధి యోజనను ప్రారంభించి వారందరికీ ఎలాంటి బ్యాంక్  గ్యారంటీ లేకుండానే రుణాలు అందించింది. ఆ పథకం  నుంచి కూడా చత్తీస్  గడ్  కు చెందిన 60 వేల మందికి పైబడిన లబ్ధిదారులున్నారు. గ్రామాల్లో ఎంజిఎన్ఆర్ఇజిఏ కింద తగినన్ని ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్రప్రభుత్వం రూ.25,000 కోట్లకు పైగా అందించింది. కేంద్రప్రభుత్వం అందించిన ఈ నిధులు గ్రామాల్లో కార్మికుల జేబులకు చేరుతున్నాయి.
మిత్రులారా,  
కొద్ది సేపటి క్రితమే 75 లక్షల మంది లబ్ధిదారులకు ఆయుష్మాన్  కార్డుల పంపిణీ జరిగింది. రాష్ర్టానికి చెందిన పేద, గిరిజన సోదర సోదరీమణులందరికీ ఏడాదికి రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స హామీ లభించింది. చత్తీస్  గఢ్  లోని 1500 పైగా ప్రధాన ఆస్పత్రుల్లో వారు చికిత్స పొందవచ్చు. ఆయుష్మాన్  యోజన పేద, గిరిజన, వెనుకబడిన, దళిత కుటుంబాల ప్రజలెందరి జీవితాలు కాపాడడానికి సహాయకారిగా ఉందని చెప్పడం నాకు ఆనందంగా ఉంది. ఈ పథకానికి చెందిన మరో ప్రధాన ఫీచర్ కూడా ది. చత్తీస్  గఢ్  కు చెందిన లబ్ధిదారులెవరైనా భారతదేశంలోని ఏదైనా వేరే రాష్ర్టంలో నివశిస్తూ వారికి ఎలాంటి ఆరోగ్య సమస్య అయినా ఏర్పడితే వారున్న రాష్ర్టంలోనే చికిత్స పొందేందుకు ఈ కార్డు ఉపయోగపడుతుంది. ఈ కార్డులో కనిపించని శక్తి ఉంది. అదే సేవాభావంతో చత్తీస్  గఢ్  లోని ప్రతీ ఒక్క కుటుంబానికి కేంద్రప్రభుత్వం సేవలు కొనసాగిస్తుందని నేను హామీ ఇస్తున్నాను. ఈ అభివృద్ధి ప్రాజెక్టులు పొందుతున్నందుకు మరోసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు.
గమనిక :  ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది అనువాదం మాత్రమే.

 

***
 


(Release ID: 1938373) Visitor Counter : 116